‘బస్వాపురం’సామర్థ్యం పెంచాలి
నల్లగొండ రూరల్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తిప్పారం రిజర్వాయర్ నుంచి బస్వాపురం రిజర్వాయర్ వరకు గ్రావిటీ ద్వారా నీరందిస్తేనే క్షామ పీడిత ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేఇ 70 టీఎంసీల నీరు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు రాసిన లేఖను స్థానికంగా ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రారంభించినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. 16 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రారంభించినట్లు తెలిపారు.
జిల్లాలో ఆలేరు, భువనగిరి, మునుగోడు ప్రాంతాల్లో 2 లక్షల 29 వేల 832 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందన్నారు. జిల్లాలో సాగునీరు అందించేందుకు రూ. వెయ్యి 82 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వరదలు వచ్చినప్పుడు నది నికర జలాలను జిల్లాలో వినియోగించుకునేందుకు బస్వాపురం రిజర్వాయర్ను 10 టీఎంసీలకు పెంచాలన్నారు. ప్రస్తుతం దీని సామర్థ్యం 0.8 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. పంటలకు నీరందించేందుకు 120 రోజులు అవసరం ఉంటుందని, కాగా 90 రోజుల వరకే నిర్ధారించడం వల్ల పంటలకు నీరందదన్నారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టులో 16 ప్యాకేజీలో పనులు ప్రారంభమయ్యయన్నారు.
సిద్ధిపేటలోని గజ్వేల్ తరహాలోనే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ - 2 కింద కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే మూసీ వరకు కాల్వలను తవ్వించామన్నారు. మూసీకింద 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీని ద్వారా కొన్ని చెర్వులను మాత్రమే నింపామన్నారు. మిడ్ మానేరు బ్యాలెన్సింగ్ పనులను పూర్తి చేస్తే కొంత సాగునీరు అందుతుందన్నారు. మొత్తం జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 70 టీఎంసీలు కేటాయించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ హయంలోనే ఎస్ఈడబ్ల్యు, జీఎన్పీ, డీఎల్ఆర్కు అవార్డు చేసినట్లు గుర్తు చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు 70 టీఎంసీల నికర జలాలను కేటాయించాలని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏఎంఆర్పీలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 టీఎంసీలు, నక్కలగండి కింద 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 టీఎంసీలు, బి.వెల్లెంల ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు 10 టీఎంసీల చొప్పున మొత్తం 70 టీఎంసీల నీటిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీశైలం సొరంగమార్గం ద్వారా ఎక్కువ నీళ్లను తీసుకోవడం ద్వారానే జిల్లాలో పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య, కరువు దుర్భిక్షాన్ని అధిగమించవచ్చన్నారు. అందుకు 90 రోజుల నదీ నికర జలాలను కేటాయించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, కాంగ్రెస్ నాయకులు తుమ్మల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.