ట్యాంకర్‌ను ఢీకొన్న టిప్పర్
జగ్గంపేట : ఎన్‌హెచ్‌పై రామవరం గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున ఆగివున్న మిథనాల్ ట్యాంకర్‌ను హెవీ టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏలేశ్వరం మండలం సిరి పురం గ్రామానికి చెంది న టిప్పర్ క్లీనర్ దొడ్డి రమేష్ (20) క్యాబిన్లో ఇరుక్కుని మృతి చెందాడు. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ రమణ, ట్యాంకర్ క్లీనర్ అనకాపల్లి మండలానికి చెందిన రమణలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం నుంచి మిథనాల్ లోడుతో వస్తున్న ట్యాంకర్ రామవరం వద్దకు వచ్చే సరికి వెనక టైరు గాలి తగ్గింది. దీంతో పెట్రోల్ బంక్ సమీపంలో ట్యాంకర్‌ను రోడ్డు పక్కనే ఉంచి డ్రైవర్ మధు, క్లీనర్ రమణలు టైరు మార్చుకుంటున్నారు. ఆ లారీని ఏలేశ్వరం నుంచి క్వారీ డస్ట్ లోడుతో జగ్గంపేట వైపు వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొంది. టిప్పర్ క్యాబిన్లో ఇరుక్కుని క్లీనర్ రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ రమణ, ట్యాంకర్ క్లీనర్ రమణ తీవ్రంగా గాయపడ్డాడు. ట్యాంకర్ డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు. కాగా, క్లీనర్ రమేష్ తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదస్థలాన్ని ఎస్సై సురేష్‌బాబు, సిబ్బంది పరిశీలించారు.