విద్యార్థులను ఢీకొన్న మినీ లారీ
ఏడుగురికి గాయాలు
తిరువళ్లూరు: పాఠశాల ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లడానికి బస్టాండ్‌లో నిల్చున్న విద్యార్థులను మినీలారీ ఢీకొట్టిన సంఘటన తిరవళ్లూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కనకవల్లిపురం గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థినులు షీబా(14), సునీత (12), పదవ తరగతి విద్యార్థిని సౌమ్య(15), ఆరవ తరగతి విద్యార్థినులు షైనీ (11), భారతీ (12), ప్లస్‌టూ విద్యార్థులు పురుషోత్తం(16), తులసీరామన్(16) తిరువళ్లూరు జిల్లా పాండూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాల ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో వీరంతా బస్సు కోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో తిరుత్తణి నుంచి తిరువళ్లూరు వైపు వెళుతున్న ఐషర్ లారీ వీరి ఢీకొంది. వీరిలో సౌమ్య, భారతిల పరిస్థితి విషమంగా ఉండడంతో చెన్నై వైద్యశాలకు తరలించారు.
రాస్తారోకో: ఇదిలాఉండగా స్పీడు బ్రేకర్లను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ పాండూర్ వద్ద రాస్తారోకో స్థానికులు ఆందోళనకు దిగారు. వేగంగా వచ్చే వాహనాలను అదుపు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. దీంతో తిరువళ్లూరు- తిరుత్తణి రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.