తెలంగాణలో వ్యవసాయ యంత్ర పరిశ్రమ
రూ.500 కోట్లతో నెలకొల్పేందుకు టిర్త్ ఆగ్రో కంపెనీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానుంది. ఇప్పటికే దేశ విదేశాల్లోని పలు ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండగా తాజాగా దేశంలోని ప్రఖ్యాత వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ సంస్థ ‘టిర్త్ ఆగ్రో’కంపెనీ తమ ప్లాంట్‌ను తెలంగాణలో నెలకొల్పాలని నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లో టిర్త్ ఆగ్రో కంపెనీ ప్రతినిధులు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్‌కు చెందిన టిర్త్ ఆగ్రో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శక్తిమాన్ బ్రాండ్ పేరుతో వ్యవసాయ యంత్ర పరికరాల తయారీలో ఎంతో పేరు గడించిందని.. ఉత్తరాదిలో వ్యవసాయ యంత్ర పరికరాల ఉత్పత్తిలో ముందంజలో ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు.
తెలంగాణలో తయారీ యూనిట్‌ను నెలకొల్పడం ద్వారా దక్షిణ భారతదేశంలోని రైతులకు నాణ్యమైన యంత్ర పరికరాలు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయని తెలిపా రు. ప్లాంటు నిర్మాణం కోసం రూ.500 కోట్లు పెట్టుబడిగా పెడతామని.. మొత్తం 1,000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. భూమి ఇతర వసతులు కల్పిస్తే త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నా మన్నారు. పోచారం మాట్లాడుతూ.. తెలం గాణ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైం దని, సీఎం కేసీఆర్ పారిశ్రామిక రంగానికి ప్రాముఖ్యం ఇస్తున్నారని, టీఎస్పాస్ ద్వారా ఇప్పటికే వేల సంస్థలు తెలంగాణలో తమ ప్లాంట్లను నెలకొల్పాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ కోసం దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనన్ని సబ్సిడీలను ఇస్తోందన్నారు. పరిశ్రమల శాఖ ఎండీ నర్సింహారెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. టిర్త్ కంపెనీ ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన అనుమతులు,వసతులు కల్పిం చాల్సిందిగా సూచించారు. ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, టిర్త్ ప్రతినిధులు రవిమాథుర్, గుణాకర్‌రావు పాల్గొన్నారు.