అమ్మవారి గర్భగుడిలో లక్ష్మీహారం ప్రత్యక్షం
చిత్తూరు జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల క్రితం మాయమైన లక్ష్మీ హారం శుక్రవారం ఆలయ గర్భగుడిలో లభ్యమైంది. దాంతో అటు ఆలయ అధికారులు ఇటు అర్చకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే లక్ష్మీ హారం లభ్యం కావడంపై ఆలయ అర్చకులు భిన్న కథనాలు వెల్లడిస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించే లక్ష్మీహారం మంగళవారం మాయమైంది. ఆ విషయాన్ని గ్రహించిన అర్చకులు గోప్యంగా ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
రూ.10 లక్షల విలువైన ఆమ్మవారి హారం కనిపించకపోవడంతో ఆలయ ఉన్నతాధికారులు అగమేఘాలపై స్పందించారు. ఆలయ సిబ్బంది చేత అంతటా వెతికించారు. అయిన హారం జాడ తెలియలేదు. ఇంతలో అమ్మవారి హారం మాయమైన విషయం మీడియాకు పొక్కింది. దీంతో మీడియా లక్ష్మీ హారం అదృశ్యంపై పలు కథనాలు వెలువరించింది... శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయం గర్బగుడిలో లక్ష్మీ హారం ప్రత్యక్షమైంది. లక్ష్మీ హారం అదృశ్యంపై ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే గర్బగుడిలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కొసమెరుపు.