అమ్మ కుడిచేతికి ఏమైంది?
చెన్నై: తమిళనాడులోని మధుర జిల్లా తిరుపారంగుండ్రం అసెంబ్లీ స్థానానికి నవంబర్ 9న ఉపఎన్నిక జరగనుంది. అధికార ఏఐడీఎంకే తరఫున ఏకే బోస్ అనే అభ్యర్థి పోటీ చేయనున్నారు. అయితే ఆమేరకు సంబంధిత పత్రాలపై పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సంతకం తప్పనిసరైంది. దీంతో వైద్యులు.. సీఎం చేత సంతకానికి బదులు వేలిముద్రలు తీసుకున్నారు. అనంతరం పార్టీ పెద్దలు అమ్మ వేలిముద్ర వేసిన పత్రాలను మీడియాకు సైతం చూపించారు. ఇంతకీ అమ్మ చేతికి ఏమైనట్లు?
ఉపదాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించి వారం కిందట చివరి హెల్త్ బులిటెన్ వెల్లడించిన వైద్యులు.. ఆమె కోలుకుంటున్నదని చెప్పారు. ట్రెకియోటెమి విధానంలో జయ కుడిచేతి గుండా కృత్రిమ నాళాలను వేసినందువల్లే ఆమె సంతకం చేయలేకపోయారని, ఎడమచేతి వేలిముద్రలు తీసుకున్నామని అధికారులు ఎలక్షన్ కమిషన్ కు తెలిపారు. వేలిముద్రలు జయలలితవేనని మద్రాస్ మెడికల్ కాలేజీ నిపుణులు కూడా నిర్ధారించడంతో ఈసీ.. వేలిముద్రలున్న ఏకే బోస్ నామినేషన్ పత్రాలను స్వీకరించింది. కాగా, గతంలో వార్తలు వెలువడ్డట్టు దీపావళిలోపే అమ్మ డిశ్చార్జి అయ్యే అవకాశాలు లేవు. మరికొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది.