హౌస్‌బిల్డింగ్ సొసైటీలో సీఐడీ విచారణ
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక వైఎంఆర్ కాలనీలోని సహకార గృహ నిర్మాణ సంఘ కార్యాలయంలో శుక్రవారం సీఐడీ అధికారులు విచారణ చేశారు. తిరుపతి సీఐడీ సీఐ కళావతితోపాటు సిబ్బంది విచారణ నిర్వహించారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న కందుల బాలనారాయణరెడ్డి కాలనీ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వెళ్లాయి. 479 ప్లాట్లలో సుమారు 200కు పైగా థర్డ్ పార్టీకి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రేటు ప్రకారం ప్లాట్లకు డబ్బు చెల్లించి, వచ్చిన ఆదాయాన్ని పక్కదారి పట్టించారనేది ప్రధాన అభియోగం. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల డీఎల్సీఓ రమేష్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఎంత మంది బినామీలు ఉన్నారు, ఆదాయం ఎంత వచ్చిందనే విషయమై సీఐడీ సీఐ విచారణ చేయడానికి వచ్చారు. విచారణ వివరాలను ఆయన వెల్లడించలేదు.