భగ్గుమన్న జనం
సాక్షి, తిరుపతి: కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలపడంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెల కొంది. పీలేరులో ఇద్దరు యువకులు ఆత్మాహుతియత్నం చేశారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. జేఏసీ నేతలు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. తిరుపతి బంద్‌కు ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు శుక్రవారం బంద్ ప్రకటించారు. గురువారం రాత్రి తిరుచానూరు సమీపంలోని తనపల్లి బైపాస్ రోడ్డును దిగ్బంధం చేశారు. వడమాలపేట రోడ్డును అక్కడి జేఏసీ నాయకులు దిగ్బంధం చేశారు. శుక్రవారం తిరుమలకు వాహనాలను కూడా నిలిపివేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
పీలేరులో పెట్రో లు బంక్‌లు మూసి వేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప లమనేరులో 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే.బాబు నాయకత్వంలో 72 గంటల బంద్ చేపట్టనున్నారు. కుప్పం, శ్రీకాళహస్తి, నగ రి, మదనప ల్లె నియోజకవర్గాల బంద్ కు సన్నాహా లు జరుగుతున్నాయి. జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు కేంద్ర కేబినెట్ నిర్ణయంపై మండిపడ్డారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సోనియా, చంద్రబాబు కుట్రకు నిదర్శంగా టీ నోట్ ఆమోదం పొందిందని తెలిపారు. ఆ పార్టీ నాయకుడు వరప్రసాదరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విభజన ద్రోహులని తెలిపారు.
కాంగ్రెసు నాయకుడు పులుగోరు మురళి మాట్లాడుతూ సోని యాగాంధీ సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని నాశనం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేవలం తన కుమారుడిని ప్రధానిని చేయడం కోసం ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లును పార్లమెంటులో చింపి వేస్తామని ప్రకటించారు. విభజనను ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించబోమని అన్నారు. తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు నోట్ రెడీ అవుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆఖరి నిముషంలో అయినా రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం వెనకడుగు వేసి ఉండేదని అన్నా రు. తెలుగుజాతి మనోభావాలను ఢిల్లీలో బహిరంగంగా తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
సెల్ టవర్‌కు నిప్పు
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు మొగ్గు చూపుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌ను ఆమోదించడంపై మండిపడ్డ సమైక్యవాదులు శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి ఎదురుగా రైల్వే ట్రాక్ వద్దనున్న సెల్ టవర్‌ను గురువారం అర్ధరాత్రి తగులబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే సెల్ టవర్ సగానికి పైగా కాలిపోయింది.