తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయండి
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి
- న్యాయవాదుల వినతి
తిరుపతిలీగల్ : తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తాను న్యాయవాదులు కోరారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రధాన న్యాయమూర్తి విమానంలో రేణిగుంట చేరుకున్నారు. అక్కడ చిత్తూరు జిల్లా ఇన్చార్జి జడ్జి విజయకుమార్, తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి ఎం.రాజమౌళిశర్మ పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు.
అక్కడి నుంచి ప్రధాన న్యాయమూర్తి నేరుగా శ్రీపద్మావతి అతిథిగృహం చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తర్వాత తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపాల పక్కన తిరుపతి నూతన కోర్టు భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం సేకరించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తిరుపతి కోర్టు ఆవరణ చేరుకున్నా రు. కోర్టు ఆవరణలోని న్యాయమూర్తుల విశ్రాంతి భవనం వద్ద ప్రధాన న్యాయమూర్తికి పోలీసులు గౌరవ వందనం చేశారు.
తిరుపతి సీనియర్ న్యాయవాది ఎం.దొరైరాజ్, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గల్లా సుదర్శనరావు ప్రధాన న్యాయమూర్తికి పూలమాలలు వేసి శాలువలతో సన్మానిం చారు. తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఇతర వసతులు కల్పించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తిరుపతి న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సీనియర్ న్యాయవాదులు చెన్నకేశవరెడ్డి, వై.భాస్కర్, నరహరిరెడ్డి, తిరుపతి న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షుడు రమ ణ, ప్రస్తుత న్యాయవాదుల సంఘ కార్యవర్గ సభ్యులు హరిబాబు, రవి, గిరిబాబు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం న్యాయమూర్తుల విశ్రాంతి భవనం నుంచి బయలుదేరిన ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఆవరణలోని పాత న్యాయమూర్తుల క్వార్టర్స్‌ను పరిశీలించారు. తర్వాత వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల పయనమయ్యారు.