17 మంది ఎర్రకూలీల అరెస్టు
► 19 ఎర్రదుంగలు, ద్విచక్ర వాహనం స్వాధీనం
► పోలీసులపై తిరగబడ్డ ఎర్రకూలీలు
తిరుపతి క్రైం: తిరుపతి- కరకంబాడీ రోడ్డులోని రెడ్డిభవనం వద్ద బుధవారం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న వారిపై దాడి చేసి 15 మంది ఎర్రకూలీలను అరెస్టు చేసినట్టు ఈస్టు డీఎస్పీ మురళీకృష్ణ, టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. వారు గురువారం అలిపిరి పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా అందిన సమాచారం మేరకు కరకంబాడి రోడ్డులోని రెడ్డిభవనం సమీపంలోని శేషాచలం రిజర్వ్ ఫారెస్టులో ఆంధ్ర, తమిళనాడుకు చెందిన 17 మంది కూలీలు, స్మగ్లర్లు 13 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా గుర్తించామన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా రంపాలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడిచేకి దిగారని పేర్కొన్నారు.
అలిపి రి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చాకచక్యంగా వ్యవహరించి 15 మంది ఎర్రకూలీలను పట్టుకున్నారని, మరో ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారని తెలిపా రు. వారు తిరుపతికి చెందినవారని, ఎర్రచందనం రవాణాకు పెలైట్లుగా వ్యవహరిస్తున్నారని వెల్లడిం చారు. అరెస్టు చేసిన వారిలో ఆది అనే వ్యక్తి మేస్త్రీగా ఉంటూ కూలీలను శేషాచలం అడవిలోకి పంపి అక్రమ రవాణా చేస్తున్నట్టు తేలిందన్నారు. దుంగలను రహస్య ప్రదేశాలకు తరలించి అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడుకు చెందిన బడాస్మగ్లర్లకు పంపుతున్నారని వివరిం చారు. వారిని పోలీసులు అడ్డుకుంటే చంపేందుకు కూడా వెనుకాడరని పేర్కొన్నారు. నిందితుల నుంచి 13 ఎర్రచందనం దుంగలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నామన్నారు. వీరందరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
చంద్రగిరిలో..
చంద్రగిరి : సుమారు రూ.5 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు డీఆర్వో విజయ్‌కుమార్ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి శేషాచలం అటవీ ప్రాంతం సచ్చినోడుబండ సమీపంలోని సన్నరాళ్ల గుట్ట వద్ద కూంబింగ్ చేపట్టామన్నారు. ఏడుగురు కూలీలు ఎర్రచందనం దుంగలను మోసుకొస్తుండగా దాడి చేశామన్నారు. తమను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా రామిరెడ్డిపల్లికి చెందిన హరి, అయినార్ను అదుపులోకి తీసుకున్నామన్నారు.
కూచువారిపలికి చెందిన ఎర్రక్క, ఆమె మనవడు నవీన్‌నాయుడు, రంగంపేట దుర్గాకాలనీకి చెందిన పోలా వెంకటేష్, మారయ్య, చిన్నవెంకటేష్ పారిపోయారని వివరించారు. ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీ నం చేసుకున్నట్టు చెప్పారు. ఎర్రక్క విద్యానికేతన్ సమీపంలో దుకాణం ఏర్పాటు చేసుకుని స్మగ్లర్లకు సరుకులు పంపిణీ చేస్తోందని, ఆమె మనవడు నవీన్‌తో కలిసి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందిందని పేర్కొన్నారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.