తాళిబొట్లు తెంచడమే బాబు లక్ష్యమా?
బీటీఆర్ కాలనీలో గుడిపక్కన మద్యం షాపు ఏర్పాటుపై మండిపాటు
అడ్డుకున్న స్థానిక మహిళలు
తిరుపతి మంగళం: అడుగడుగుకూ మద్యం షాపులు పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఆడపడుచుల తాళిబొట్లు తెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మంగ ళం బీటీఆర్కాలనీ మహిళలు మండిపడ్డారు. హైవేల్లో మద్యం షాపులు తొలగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను పక్కనబెట్టి మంగళవారం రాత్రి తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి పంచాయతీ బీటీఆర్కాలనీ సమీపంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి 20మీటర్ల దూరంలో తిరుపతి–కరకంబాడి రోడ్డులో మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ, సీపీఐ నాయకులు వరగంటి లక్ష్మయ్యతో కలిసి స్థానిక మహిళలు దాన్ని అడ్డుకున్నారు.
రెండుగంటల పాటు మద్యం షాపు యజమానులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. షాపు పెడిగే తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మహిళలు హెచ్చరించారు. అలిపిరి పోలీసులు అక్కడికి చేరుకుని ఎక్సై జ్ అధికారులతో మాట్లాడిన తర్వాత మద్యం షాపు ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు సూచించా రు. వైఎస్సార్సీపీ నాయకుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేదలకు గుక్కెడు తాగునీరు ఇవ్వలేని చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు కూలీనాలి చేసుకుని సంపాదించిన డబ్బును తాగుడికే తగలేస్తున్నారని, తద్వారా వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిపారు. నిత్యం విద్యార్థులు తిరిగే ప్రాంతంలో మద్యం షాపునకు అనుమతి ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.