‘గాలేరు-నగరి’పై అధ్యయనం
కాలువ మార్గం మార్పు
సాధ్యాసాధ్యాలపై సర్వే
ఎక్స్పర్ట్ కమిటీని నియమించిన సర్కార్
రెండు నెలల్లో ప్రభుత్వానికి తుది నివేదిక
గాలేరు-నగరి ప్రధాన కాలువ మార్గాన్ని మార్చేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఎక్స్పర్ట కమిటీని నియమించింది. వీరు రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
తిరుపతి తుడా: గాలేరు-నగరి ప్రధాన కాలు వ మార్గాన్ని మార్చే విషయమై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు డీఎస్‌ఎన్‌రెడ్డి, ఎంకే.రెహమాన్‌తో కూడిన కమిటీని నియమించింది. రైతులు డిమాండ్ చేస్తున్న విధంగా ఎస్వీ జూపార్కు వెనుక నుంచి కల్యాణీ డ్యాం వరకు కాలువను తీసుకెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్యాణీ డ్యామ్‌లో నీటిని నింపి, అక్కడి నుంచి స్వర్ణముఖి నది ద్వారా తిరిగి గాలేరు-నగరి ప్రధాన కాలువలో కలపడం సాధ్యమేనా
అనే దానిపై కమిటీ సర్వే చేస్తోంది. రెండు నెలల్లో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదికను ఇవ్వనుంది. దీని ఆధారంగా భూసేకరణకు రంగం సిద్ధం చేయనున్నారు.
పరిశీలనలో రైతుల ప్రతిపాదనలు..
తిరుపతి రూరల్ మండలంలో ఖరీదైన భూములు ఉన్నాయని, ఎక్కువ మంది సన్నకారు రైతులు ఉన్నారని, గాలేరు-నగిరి ప్రధాన కాలువ అలైన్మెంట్ మార్పు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీఎన్ఎస్ఎస్ కార్యాలయం ఎదుట రెండు పర్యాయాలు ధర్నా చేపట్టారు. రెండు ప్రత్యామ్నాయ అలైన్మెంట్లను ప్రతిపాదించారు. ఇందులో ఒక ప్రతిపాదనను (అలిపిరి ప్రాంతం నుంచి ఎస్వీ జూపార్కు మీదుగా శ్రీనివాసమంగాపురం వెనుక స్వర్ణముఖి నదిలో క లపడం). దీనిపై ఇరిగేషన్ ఎస్ఈ రాధా ప్రభాకర్ బృందం సర్వే చేసి అసాధ్యమని తేల్చింది. ఎస్వీ జూపార్కు వెనుక నుంచి కల్యాణీ డ్యాం వరకు తీసుకె ళ్లి అక్కడి నుంచి డ్యామ్‌కు పంపింగ్ చేసే మరో ప్రతిపాదనను రైతులు సీఈ సుధాకర్ ముందు ఉంచారు. ఈ ప్రతిపాదనను సీఈ ప్రభుత్వానికి అందజేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది.
భూ సేకరణకు బ్రేక్..
తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ భూసేకరణకు ప్రభుత్వం రెండు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు నెలల్లో భూసేకరణ చేయాల్సి ఉండగా అలైన్మెంట్ మార్పు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేయడంతో భూసేకరణకు బ్రేక్ పడింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భూసేకరణ ఉంటుంది. అంతవరకు భూసేకరణ ఉండబోదని ఎస్ఈ రాధా ప్రభాకర్ చె ప్పారు. అలైన్మెంట్ మార్పు సాధ్యమైతే భూసేకరణతో పని ఉండదన్నారు.