జననేతకు జేజేలు
సాక్షి, చిత్తూరు: జీడీ నెల్లూరు మండలంలోని తిరువీధికుప్పం నుంచి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం నాటి పర్యటన ప్రారంభమైంది. గ్రామంలో తన కోసం వేచి ఉన్న ప్రజలను ప్రతి ఒక్కరినీ ఆయన పలకరించారు. మహదేవ మంగళం వరకు రోడ్ షో నిర్వహించారు. అక్కడ వేచి ఉన్న మహిళలతో ముచ్చటించారు. మంగినాయని కుప్పంలోనూ గ్రామస్తులతో ముచ్చటించారు.
ఇక్కడ ఎం.వెన్నెల అనే 8వ తరగతి విద్యార్థిని లీడర్ అంటే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని, అసలు సిసలు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ వై.ఎస్.జగన్‌లో ఉన్నాయంటూ స్వీయరచన చేసిన పుస్తకాన్ని జననేతకు బహూకరించింది. ఈ విద్యార్థినిని జగన్ అభినందించారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆ విద్యార్థినితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ నుంచి జగన్ శ్రీనివాసపురం బీసీ కాలనీ చేరుకుని రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ ప్రజలు తమకు ఇళ్లు లేవని, దారి సమస్య ఉందని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మహానేత విగ్రహావిష్కరణ
ముసలయ్యగారిపల్లెలో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహం, పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మీ అందరి హృదయాల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారన్నారు. గురువారం జరగాల్సిన కార్యక్రమం బాగా ఆలస్యమైనా చికాకు పడకుండా శుక్రవారం ఉదయాన్నే గ్రామం మొత్తం మహానేత విగ్రహావిష్కరణకు రావడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఒక రోజు కార్యక్రమం ఆలస్యమైనందుకు పేరుపేరునా క్షమించాలని అన్నప్పుడు జనం పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో స్పందిం చారు.
జగన్‌కు గ్రామస్తులు డప్పులు, మేళతాళాలు, వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఇక్కడ వేపంజేరి సర్పంచ్ వరదరాజులు రెడ్డి జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ములసయ్యగారిపల్లెలోజగన్ను చూసేం దుకు జనం చెట్లపై, ఫ్లెక్సీ బోర్డులపై ఎక్కారు. ఈ సభలో చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్ రాబోయే 30 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా పని చేస్తారన్నారు. అనంతరం జగన్ అర్ధగంట సేపు మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. అక్కడ నుంచి అరిమాకులపల్లె వెళుతూ దారిలో రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం (వైఎస్ఆర్టీయూసీ అనుబంధం) 2014 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర కన్వీనర్ జనకప్రసాద్, జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, విద్యుత్ సంఘం నాయకులు పాల్గొన్నారు. తొప్పనపల్లెలోనూ జననేత కాన్వాయ్ దిగి జనం వద్దకు వెళ్లారు. వారు చెప్పేది ఓపిగ్గా విని మాట్లాడారు. దాసరపల్లెలోనూ మహిళలు ఘనస్వాగతం పలికారు. కండ్రిగలో రోడ్డుపై పూలుపరిచి గ్రామస్తులు ఆహ్వానించారు. ఆవులకొండలోని ముస్లింకాలనీలో ముస్లింలు, గ్రామస్తులు జగన్ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరింపజేశారు. తూంగుం డ్రంలో భారీగా బాణసంచా కాలుస్తూ తమ అభిమాన నాయకుడికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
జగన్ రాక కోసం ఎదురుచూస్తున్న చిన్నారులు, వృద్ధులు, మహిళలు, యువకులతో గ్రామంలోని రోడ్లన్నీ నిండిపోయాయి. మిద్దెలపై నుంచీ మహిళలు జగన్‌ను ఆసక్తిగా చూస్తూ కనిపించారు. వీరందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ జనంతో కలిసి అడుగేస్తూ నెమ్మదిగా కదిలారు. తూంగుండ్రం దాటేం దుకు గంటకుపైగా సమయం పట్టింది. జగన్ కలిసేందుకు పాఠశాలల పిల్లలూ క్యూలో వేచి ఉండడం కనిపించింది. తూంగుండ్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుణశేఖర్ ఇంటికి జగన్మోహన్రెడ్డి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. పాళ్యం, కొత్తూరులో రోడ్‌షో నిర్వహించారు.
ఇక్కడ రుక్మిణి అనే వికలాంగురాలు జగన్‌ను కలిసి దెబ్బతిన్న కాలును చూపించి సాయం చేయాలని కోరారు. ఈమెకు సా యం చేయాల్సిందిగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కె.నారాయణస్వామికి సూచించారు. జీడీ నెల్లూరు మండలం చివరి గ్రామం పిళ్లారి కుప్పంలోనూ జగన్‌కు జనం బ్రహ్మరథం పలికారు. కావేరి రాజపురంలోనూ ప్రజలు కాన్వాయ్‌ను ఆపి జగన్‌ను కలుసుకున్నారు.