మణిపాల్ ప్రెస్ నుంచే పేపర్ లీక్
సీఐడీ అదనపు డీజీ వెల్లడి
పేపర్ లీకేజి కేసులో మరో 11 మంది అరెస్టు
సూత్రధారుల కోసం కొనసాగుతున్న వేట
సోమవారం అరెస్టయింది వీరే..
దళారులు: చక్రవర్తి, భూషణ్‌రెడ్డి, విజయ్, కిష్టప్ప, అభిమన్యు, పాట్రిక్, అమీర్ అహ్మద్
ర్యాంకర్లు (ర్యాంకు): పి.భరత్‌కుమార్ (7), సీహెచ్ రామారావు(14), సీహెచ్ సాయి ప్రణీత్ (15), కె.రమణ (26)
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం నిర్వహించిన పీజీ మెడికల్ ప్రవేశపరీక్ష (పీజీఎంఈటీ) -2014 ప్రశ్నపత్రం కర్ణాటకలోని మణిపాల్‌లో ఉన్న మణిపాల్ ప్రింటింగ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రెస్ నుంచే లీక్ అయినట్లు గుర్తించామని సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో గత నెల 29న 9 మందిని అరెస్టు చేయగా, సోమవారం మరో 11 మందిని అరెస్టు చేశామని, వీరిలో ఏడుగురు బ్రోకర్లు, నలుగురు ర్యాంకర్లు ఉన్నారని చెప్పారు.
లీకేజ్‌లో సూత్రధారుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ‘కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సీహెచ్ భూషణ్‌రెడ్డి 2011లో లక్డీకాపూల్ వద్ద బాలాజీ కెరీర్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆతర్వాత అతనికి ఇదే రంగంలో ఉన్న వి.సురేష్ (బెంగళూరు), అంజు సింగ్ (ముంబై), ధనుంజయ్ కుమార్ చౌహాన్ (బీహార్), కె.మునీశ్వర్‌రెడ్డి (కడప), డి.సాయినాథ్ (హైదరాబాద్)లతో పరిచయమేర్పడింది. వీరంతా కలిసి కర్ణాటకలోని దావనగెరెకు చెందిన అమీర్ అహ్మద్ సాయంతో పీజీఎంఈటీ ప్రశ్నపత్రం లీక్ చేశారు. దావనగెరెలో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహిస్తున్న పౌల్సన్, అమీర్ అహ్మద్, అంజుసింగ్లు ఒక ముఠాగా ఏర్పడి ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చారు..
ఈ కేసులో పౌల్సన్ కూడా కీలక సూత్రధారి. అంజుసింగ్, అమీర్ అహ్మద్‌లకు సహాయకులుగా వ్యవహరించిన అభిమన్యు, పాట్రిక్‌లు అనేక మంది వైద్య విద్యార్థుల్ని కన్సల్టెన్సీల ద్వారా ఎంపిక చేసి ఒప్పందాలు కుదుర్చుకునేలా చేశారు. వీరికి గుంతకల్‌కు చెందిన కిష్టప్ప, నరసరావుపేటకు చెందిన చక్రవర్తి, మరికొందరు దళారులు సహకరించారు’ అని ఆ ప్రకటనలో తెలిపారు.