తప్పు చేసి.. మళ్లీ నాపై నిందలా!
♦ లంచం ఆరోపణలపై మంత్రి సరోజ ..రాజామీనాక్షిపై ఆగ్రహం
సాక్షి, చెన్నై : తప్పు చేసింది కాకుండా, తప్పించుకునేందుకు నిందల్ని తన మీద మోపుతున్నారని లంచం వ్యవహారంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సరోజ ఆవేదన వ్యక్తం చేశారు. రాజామీనాక్షి ఆరోపణలపై మంగళవారం ఆమె వివరణ ఇచ్చారు. ధర్మపురి జిల్లా శిశుసంక్షేమ శాఖ అధికారిణి రాజామీనాక్షి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సరోజపై గత వారం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
తాను శిశుసంక్షేమ శాఖాధికారిణిగా కొనసాగాలంటే రూ.30 లక్షలు లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపించి రాజకీయంగా చర్చకు తెరలేపారు. లంచం కోసం తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు రాజా మీనాక్షి ఫిర్యాదు కూడా చేశారు. ఈ వ్యవహారంతో విమర్శల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మంత్రితో పాటు సీఎం పళని ప్రభుత్వానికి తప్పలేదు. రెండు మూడు రోజులుగా ఈ వ్యవహారంపై మంత్రి సరోజ కూడా నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రా జామీనాక్షి ఆరోపణల్ని తిప్పి కొడుతూ సరోజ ఓ ప్రకటన విడుదల చేశారు.
తప్ప చేసి నిందలా:
చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రాజామీనాక్షి నిందల్ని తన మీద వేస్తున్నారని మంత్రి సరోజ ఆవేదన వ్యక్తం చేశారు. శిశుసంక్షేమ శాఖలో రాజామీనాక్షి తాత్కాలిక ఉద్యోగిగా పేర్కొన్నారు. పనిచేస్తున్న చోట చేతి వాటం ప్రదర్శించి విచారణను ఎదుర్కొంటున్న రాజాలక్ష్మి తన మీద నిందలు వేసి రాజకీయ జీవితానికి, తన వైద్య వృత్తికి కలంకం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా, శిశు వైద్యురాలిగా తాను చేస్తున్న సేవలకు, రాజకీయ పయనంలో తన ఉత్సాహానికి మెచ్చి అమ్మ జయలలిత మంచి గుర్తింపు, పదవిని ఇచ్చారని గుర్తు చేశారు.
సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న తన మీద రాజామీనాక్షి ఆరోపణలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజామీనాక్షి విచారణను ఎదుర్కొంటున్నారని, గత నెల విచారణకు రావాల్సి ఉన్నా, అనారోగ్య కారణాలతో తప్పించుకున్నట్టు వివరించారు. ఆమె చేతివాటం ప్రదర్శించారన్నది ధ్రువీకరించబడి ఉందని, ఇక ఆమెపై చర్యలు తప్పదన్న నిర్ణయానికి సంబంధిత జిల్లా అధికారులు వచ్చి ఉన్నారని తెలిపారు.
గత వారం తన వద్దకు వచ్చిన రాజామీనాక్షి పర్మినెంట్ చేయాలని, విచారణ నుంచి బయటపడే మార్గం చూపించాలని, చెన్నైకు బదిలీ చేయాలని కోరడం జరిగిందన్నారు. ఇందుకు తాను అంగీకరించకుండా బయటకు పంపించానని, దీంతో ఆమె చేసిన తప్పును కప్పిపుచ్చుకునే యత్నంలో తన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడాల్సినంత అవసరం తనకు లేదు అని, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు.