దసరాకు 45% ఐఆర్: టీఎన్జీవోల సంఘం
సాక్షి, హైదరాబాద్: పదో వేతన సంఘం(పీఆర్సీ) నివేదిక రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఏడాది జూలై 1 నుంచి అమలయ్యే విధంగా దసరాకు కనీసం 45 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పి.కె.మహంతిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రతినిధి బృందంలో వేణుగోపాల్, ఉపేందర్‌రెడ్డి, జగదీశ్వర్, బుచ్చిరెడ్డి, రేచల్, విజయలక్ష్మి, సత్తెమ్మ, వనజ, శైలజ, రంగరాజు, హీమీద్ తదితరులు ఉన్నారు.
అనంతరం దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్సరం జూలై 1 నుంచి పదో పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ నివేదికే అందలేదన్నారు. ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం 45 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశామని, అందుకు సీఎస్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్‌లో ఉద్యమించక తప్పదని వారు హెచ్చరించారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని వారు కోరారు. అంతకుముందు టీఎన్జీవో భవన్లో టీఎన్జీవో కార్యవర్గ సమావేశం జరిగింది.
టీఎన్జీవో కార్యవర్గ సమావేశం తీర్మానాలివీ..
కేంద్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలి. శీతాకాల సమావేశాలకు ముందుగానే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి బిల్లుకు ఆమోదముద్ర వేయించాలి.
ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ స్వాభిమాన సదస్సు జయప్రదానికి కృషి చేయాలి. ఉద్యోగులు పెద్దఎత్తున కదిలిరావాలి. సదస్సును విజయవంతం చేయడానికి వీలుగా అన్ని జిల్లాల్లో టీఎన్జీవో సదస్సులు నిర్వహించాలి. ప్రత్యేక రాష్ట్రం వల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరించాలి.
సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలి. ఉద్యోగుల మీద బనాయించిన కేసులను ఎత్తివేయాలి.
సమైక్యాంధ్ర సమ్మె సందర్భంగా తెలంగాణ అధికారులు, ఉద్యోగులపై దాడులు చేయడం అమానుషం. వారికి పూర్తి భద్రత కల్పించాలి. సమ్మె కొనసాగినంత కాలం వారిని హైదరాబాద్‌కు బదిలీ చేయాలి.
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఏపీఎన్జీవోలు ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కరించదగినవే. ఏపీఎన్జీవోలు సమ్మె విరమించి విభజనకు సహకరించాలి. సభ సందర్భంగా తెలంగాణవాదులు, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి.
జూలై 30 తర్వాత పలు శాఖల్లో టీ-అధికారుల్ని వివక్షకు గురిచేస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని పునఃపరిశీలించాలి.
హైదరాబాద్‌ను యూటీగా ప్రకటించాలని కొందరు చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.