టీచర్ల కౌన్సెలింగ్ నేటితో సమాప్తం!
– చివరిరోజు ఎస్జీటీ తెలుగు 3,301 నుంచి చివరిదాకా
– తప్పనిసరి బదిలీ..అయినా గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. బుధవారంతో అన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవవుతాయి. అయితే అప్‌గ్రేడ్ చేసిన పండిట్ పోస్టులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిడంతో వారికి మాత్రం మళ్లీ కౌన్సెలింగ్ ఉంటుంది.
‘నాట్‌ఆప్ట్’ ఆప్షన్లే ఎక్కువ
డీఈఓ లక్ష్మీనారాయణ, పరిశీలకులు జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కౌన్సెలింగ్ సజావుగా జరిగింది. రెక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఎక్కువమంది టీచర్లు వారికి అనుకూలమైన స్థానాలు రాకపోవడంతో ‘నాట్‌ఆప్ట్’ ఆప్షన్ ఇచ్చారు. రాత్రి 8 గంటలకు కౌన్సెలింగ్ ముగిసింది. బుధవారం సీనియార్టీ జాబితా 3,301 నుంచి చివరి నంబరు దాకా టీచర్లు హాజరుకావాలని డీఈఓ లక్ష్మీనారాయణ సూచించారు. ఉదయం 7 గంటలకే సైన్స్ సెంటర్‌కు చేరుకోవాలన్నారు.
తప్పనిసరి బదిలీ...గైర్హాజరు
హిందూపురం మండలం చెక్‌పోస్టుకాలనీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ పోస్టు రేషనలైజేషన్ ప్రభావంతో రద్దయింది. ఇక్కడ పని చేస్తున్న సరోజబాయి (సీనియార్టీ జాబితా సీరియల్ నంబర్ 3,018) తప్పనిసరి బదిలీ కావాలి. కానీ కౌన్సెలింగ్ సమయంలో ఈమె గైర్హాజరయ్యారు. అధికారులు పలుమార్లు అనౌన్స్ చేసినా రాలేదు. దీనిపై డీఈఓ మాట్లాడుతూ, చివరికి మిగిలిపోయిన ఖాళీలకు ఆమెను పంపుతామని ప్రకటించారు. అలాగే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామన్నారు.
అనుకూలమైన స్థానం కోసం....
రెండు రోజుల కిందట జరిగిన కౌన్సెలింగ్‌లో సుధాకర్ అనే టీచరు ఉరవకొండ మండలం కోనాపురం ప్రాథమిక పాఠశాల కోరుకున్నాడు. వాస్తవానికి అక్కడ పోస్టు ఖాలీ లేదు. దీంతో సదరు టీచరు డీఈఓ వద్ద రిపోర్ట్ చేసుకున్నారు. అయితే గార్లదిన్నె మెయిన్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న సురేఖ (సీరియల్ నంబర్ 2,806) రెక్వెస్ట్ బదిలీలో భాగంగా మంగళవారం జరిగిన కౌన్సెలింగ్‌లో బొమ్మనహాల్ మండలం వెళ్లింది. ఈ స్థానానికి ముందురోజు కోనాపురం వెళ్లి వెనక్కు వచ్చిన టీచరును పంపే ప్రయత్నం చేశారు. దీన్ని కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్లు అడ్డుకున్నారు. సురేఖ తర్వాత 2,813 సీరియల్ నంబర్లో ఉన్న పెద్దవడుగూరు మండలం రాయాపురం పాఠశాలలో పని చేస్తున్న గుర్రప్ప అనే టీచరు గార్లదిన్నె స్కూల్ కోరుకున్నాడు. అయితే సుధాకర్‌కు కనగానపల్లి మండలం దాదులూరు స్కూల్‌కు బదిలీ చేశారు. రెండు రోజుల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.