బ్రిటన్ విద్యార్థి వీసాల ఆశలు ఆవిరి!
టోఫెల్, టోయిక్ పరీక్షలు ఇకపై ఈటీఎస్ నిర్వహించదు
న్యూఢిల్లీ: విద్యార్థుల వీసా ఆశలపై నీళ్లు చల్లేలా బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. యూకేలో వీసాల జారీకి సంబంధించి టోఫెల్, టోయిక్ పరీక్షలను ఇకపై ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) నిర్వహించడం లేదని ప్రకటించింది. టోయిక్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్) అక్రిడేషన్ కోసం విద్యార్థులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు ఇటీవల బీబీసీలో కథనం వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈటీఎస్‌తో తమ కాంట్రాక్టు పొడిగించబోమని బ్రిటన్ హోంశాఖ తెలిపింది. ఈటీఎస్ పరీక్షలకు హాజరయ్యే వారు హోం శాఖ ఆమోదించిన ఇతర ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని యూకే అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల మండలి సూచించింది. సహాయం కోసం సంబంధిత విద్యాసంస్థల సలహాదారులను సంప్రదించాలని పేర్కొంది.