Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే?
ఓ పక్క దేశంలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్ మరోసారి విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. కేరళ రాష్ట్రంలో పిల్లలను ‘టొమాటో ఫీవర్’ వణికిస్తోంది. నిజానికి పిల్లలకు ఏదైనా చిన్న సమస్య వస్తేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటారు. అలాంటిది ఐదేళ్లలోపు చిన్నారులకే ఎక్కువగా వచ్చే ఈ జ్వరంతో మరింతగా ఆందోళనపడుతున్నారు. నాలుగైదు వారాలుగా వ్యాధి విస్తృతంగా ఉన్న కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలను బెంబేలెత్తిస్తున్న ‘టొమాటో ఫీవర్’పై అవగాహన కోసం ఈ కథనం.
కొద్దిగా ఆసక్తికరమైన పేరుతో ఉన్న ఈ జ్వరం డెంగీ లేదా చికన్‌గున్యా తరహాకు చెందిదా లేక ఇతరత్రా మరేదైనా గ్రూపునకు చెందిన వైరస్‌నా అన్న విషయం ఇంకా నిర్ధారణగా తెలియదు. అయితే ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్సా (ఆర్ఎస్వీ) లేక అడినో వైరస్సా లేదా రైనోవైరసా అనే అంశం మీద నిపుణుల్లో ఇంకా చాలా సందేహాలే ఉన్నాయి. ఈ విషయమై వైరాలజీ, వైద్యవర్గాలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.
లక్షణాలు :
► తీవ్రమైన జ్వరం (హైఫీవర్)
► ఎర్రటి టొమాటోపండు రంగులో ఉండే మచ్చలు (బ్లిస్టర్స్) / ర్యాష్
► ఒళ్లంతా దురద.
► చర్మం ఎండిపోయినట్లుగా ఉండటం (డీహైడ్రేషన్)
► అలసట
► కీళ్లనొప్పులు
► కడుపులో కండరాలు పట్టేయడం
► వికారం / వాంతులు
► నీళ్లవిరేచనాలు
► దగ్గు
► ముక్కుకారుతుండటం
► కొన్నిసార్లు కొంతమంది పిల్లల్లో ఒంటిపై మచ్చలతో పోలిస్తే... కాళ్లూ–చేతులపై ఉండే మచ్చల రంగు ఒకింత మారి ఉన్నట్లు అనిపిస్తుంటుంది.
చికిత్స: ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) అందిస్తారు. పిల్లలకు ఉపశమనం కోసం గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తుండాలి. బాగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. కంటినిండా నిద్రపోయేలా చూడాలి.
సూచన : పేరుకు మాత్రమే దీన్ని టొమాటో ఫ్లూ / టొమాటో ఫీవర్ అంటారు. నిజానికి దీనికీ టొమాటోలకూ ఎలాంటి సంబంధం లేదు. ఇది సాధారణ ప్రజలూ గుర్తుపెట్టుకోడానికి వీలుగా పెట్టిన పేరు మాత్రమే. ఇది టొమాటోల వల్ల ఎంతమాత్రమూ రాదు. కాబట్టి ఇది సోకినవారు, ఇతరులూ టొమాటోలను నిరభ్యంతరంగా తినవచ్చు. వాటిలోని పోషకాలు, విటమిన్లతో మంచి వ్యాధినిరోధక శక్తి చేకూరుతుందనీ, ఫలితంగా టోమాటోఫీవర్తో పాటు అనేక జబ్బులను నివారించవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
చదవండి: Health Tips: తరచూ చింత చిగురును తింటే..
నివారణ
► ఇది అంటువ్యాధి కావడం వల్ల సోకిన పిల్లల నుంచి ఇతరులను దూరంగా ఉంచాలి.
► పిల్లలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వ్యక్తిగత పరిశుభ్రతతో చాలావరకు నివారణ సాధ్యం.
► వ్యాధి సోకిన పిల్లల దుస్తులు, వస్తువులు, ఆటబొమ్మలు... ఇతరులు తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి.
ఈ పేరెలా వచ్చిందంటే...
ఇది సోకిన పిల్లల ఒంటి మీద టొమాటో రంగులో ఉండే మచ్చలు (బ్లిస్టర్స్), ర్యాష్ ఏర్పడతాయి. దాంతో ఈ రుగ్మతను టొమాటో ఫీవర్ లేదా టొమాటో ఫ్లూ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లోనే ఎక్కువగా కనిపించే ఇది... అంతకంటే పెద్దపిల్లల్లోనూ, పెద్దవారిలోనూ చాలా చాలా అరుదుగా మాత్రమే సోకుతుంది.