Tomato yields
-
టమాటా దిగుబడులపై వర్షం ఎఫెక్ట్
మదనపల్లె(చిత్తూరు జిల్లా): టమాటా దిగుబడులపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్‌కు అంతంతమాత్రంగా వస్తున్న టమాటా దిగుబడులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరింతగా తగ్గిపోయాయి. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాయలపై మచ్చలు వచ్చి.. తెగుళ్లు సోకుతున్నాయి. పంట నాణ్యతగా ఉండడం లేదు. గత నెల 9న రైతులు మార్కెట్‌కు 445 మెట్రిక్ టన్నుల టమాటాలు తీసుకువచ్చారు. ఇందులో మెదటి రకం టమాట ధర కిలో రూ.14 వరకు పలికింది. ప్రస్తుతం దిగుబడులు 70 శాతం మేర తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల్లో వర్షాలకు పంట దెబ్బతినడం, డిమాండ్‌కు తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో మొదటిరకం టమాటా ధర కిలో రూ.35 నుంచి రూ.52 మధ్య పలికింది. రెండో రకం రూ.16 నుంచి రూ.33 మధ్య నమోదైంది. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల నుంచి రైతులు 86 మెట్రిక్ టన్నుల టమాటాను మార్కెట్‌కు తీసుకువచ్చారు. కోత దశ చివరిది కావడంతో టమాటా దిగుబడులు తగ్గాయని, రబీ సీజన్ ప్రారంభమయ్యాక దిగుబడులు పెరిగే అవకాశం ఉందని హార్టికల్చరల్ ఆఫీసర్ సౌజన్య తెలిపారు. -
టమాటా ధర ఢమాల్..
* తగ్గిన ఉష్ణోగ్రతలు పెరిగిన దిగుబడి * స్టోరేజీ లేక నష్టపోతున్న రైతులు * యేటా ఇదే దుస్థితి ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో పది రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి టమాటా దిగుబడి ఒకేసారి గణనీయంగా పెరిగింది. కానీ ధర మాత్రం పాతాళానికి పడిపోయింది. పది రోజుల క్రితం కిలో రూ. 25 నుంచి రూ.30 వరకు ధర ఉండగా.. బుధవారం రూ.10కి పడిపోయింది. జిల్లాలో రబీ సాగులో అత్యధికంగా కూరగాయల సాగులో భా గంగా టమాటా సాగవుతోంది. దిగుబడి వస్తున్నా గిట్టుబాటు దర లేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఆదిలాబాద్ మార్కెట్‌కు రోజుకు 6టన్నుల నుంచి 8 టన్నుల టమాటా వస్తోంది. కోల్డ్ స్టోరేజీ సదుపాయం లేకపోవడంతో తక్కువ ధరకు విక్రయించడం, మిగిలిన వాటిని సాయంత్రం పడేయడం జరుగుతోంది. ఏటా స్టోరెజీ లేక క్వింటాళ్లాకు క్వింటాళ్లు రోడ్డున పడేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి టమాటా మార్కెట్‌కు తీసుక వస్తుండడంతో రవాణా ఖర్చులు కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎకరా సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చుతో రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి అవుతోంది. గతయేడాది పోలిస్తే ఈ యేడాది విత్తనాలు, పురుగుల మందుల, కూలీల ఖర్చు పెరిగింది. కానీ పంట చేతికొచ్చేసరికి గిట్టుబాటు ధర రావడం లేదు. తగ్గిన సాగు.. ప్రస్తుతం చలిగాలలు, మంచు ప్రభావంతో దిగుబడి ఒకేసారి అధికంగా మార్కెట్ రావడంతో ధర గణనీయంగా తగ్గింది. జిల్లాలో 6,897 వేల హెక్టార్లలో సాగువుతున్నట్లు ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. గతయేడాది పోలిస్తే ఈ యేడాది మూడువేలకు పైగా సాగు విస్తీర్ణం తగ్గింది. గత యేడాది ఇదే సమయంలో కిలో రూ. 5 వరకు ధర పలికింది. ఇప్పడు అదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, బజార్హత్నూర్, ఉట్నూర్, ఆదిలాబాద్, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లో అధికంగా సాగవుతోంది. ఆయా మండలాల నుంచి ఆదిలాబాద్ మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం టమాటా క్యారెట్(25కిలోలు) ధర రూ.400 నుంచి రూ.600 వరకు పలికింది. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80 వరకు చెల్లిస్తున్నారు. కోల్డ్‌స్టోరేజీ లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. -
ఆరు రాష్ట్రాలకు మన టమాటా
- పంట నష్టంతో పెరిగిన డిమాండ్ - మార్కెట్లోనే కిలో రూ.46 - మార్కెట్‌కు చేరుతోంది - కేవలం 220 టన్నులే బి.కొత్తకోట: మన జిల్లా టమాటాకు ఆరు రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. దీంతో ఆది, సోమవారాల్లో ఊహించని విధంగా ధరలు పలికాయి. అయితే స్థానికంగా దిగుబడి కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పలుకుతున్న ధరలు కొంతకాలం వరకూ ఇలాగే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సగటు ఏడాది పొడవునా 35 వేల ఎకరాల్లో టమాటా సాగవుతుంటే.. అందులో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో 30 వేల ఎకరాల్లో సాగులో ఉంది. గత పది రోజుల క్రితం వరకు బొటాబొటిగా ధరలు పలికిన టమాటా రెండు రోజులుగా అత్యధిక ధర పలుకుతోంది. ఆదివారం కిలో రూ.41 పలికితే సోమవారం రూ.46 పలికింది. ఒకరోజు వ్యవధిలోనే కిలోకు రూ.5 పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఇతర రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలతో టమాటా పంటకు నష్టం వాటిల్లడమే. దీంతో మదనపల్లె టమాటాపై వ్యాపారులు దృష్టి పెట్టారు. ఈనెల 5 నుంచి 14వతేదీ వరకు పలికిన ధరలు చూస్తే డిమాండ్ తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో పండిస్తున్న టమాటా దిగుబడులు తగ్గాయి. దీంతో వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఫలితంగా రైతులకు ఆశించిన ధరలు దక్కుతున్నాయి. మదనపల్లె మార్కెట్‌కు వస్తున్న టమాటాలు భారీగా తగ్గాయి. ఈనెల 5న 475 టన్నుల టమాట విక్రయానికి రాగా వరుసగా తగ్గుతూ వస్తూ సోమవారం 226 టన్నుల టమాటా మాత్రమే వచ్చింది. ఫలితంగా ధర భారీగా పెరిగింది. పది కిలోల టమాటా రూ.460 పలికింది. ఇక్కడ కొనుగోలు చేసిన టమాటా ఆరు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. తమిళనాడులోని చెన్నై, మధురై, పాండిచ్చేరి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటకలోని గదగ్, తెలంగాణలోని కరీంనగర్, హైదరబాదు, వరంగల్, ఖమ్మం, ఇల్లందు, భువనగిరి, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, గుడివాడ, నెల్లూరు, రాజమండ్రి ప్రాంతాలకు తరలిస్తున్నారు.