ఆరు రాష్ట్రాలకు మన టమాటా
- పంట నష్టంతో పెరిగిన డిమాండ్
- మార్కెట్‌లోనే కిలో రూ.46
- మార్కెట్‌కు చేరుతోంది
- కేవలం 220 టన్నులే
బి.కొత్తకోట: మన జిల్లా టమాటాకు ఆరు రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. దీంతో ఆది, సోమవారాల్లో ఊహించని విధంగా ధరలు పలికాయి. అయితే స్థానికంగా దిగుబడి కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పలుకుతున్న ధరలు కొంతకాలం వరకూ ఇలాగే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సగటు ఏడాది పొడవునా 35 వేల ఎకరాల్లో టమాటా సాగవుతుంటే.. అందులో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో 30 వేల ఎకరాల్లో సాగులో ఉంది. గత పది రోజుల క్రితం వరకు బొటాబొటిగా ధరలు పలికిన టమాటా రెండు రోజులుగా అత్యధిక ధర పలుకుతోంది.
ఆదివారం కిలో రూ.41 పలికితే సోమవారం రూ.46 పలికింది. ఒకరోజు వ్యవధిలోనే కిలోకు రూ.5 పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఇతర రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలతో టమాటా పంటకు నష్టం వాటిల్లడమే. దీంతో మదనపల్లె టమాటాపై వ్యాపారులు దృష్టి పెట్టారు. ఈనెల 5 నుంచి 14వతేదీ వరకు పలికిన ధరలు చూస్తే డిమాండ్ తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో పండిస్తున్న టమాటా దిగుబడులు తగ్గాయి. దీంతో వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఫలితంగా రైతులకు ఆశించిన ధరలు దక్కుతున్నాయి.
మదనపల్లె మార్కెట్‌కు వస్తున్న టమాటాలు భారీగా తగ్గాయి.
ఈనెల 5న 475 టన్నుల టమాట విక్రయానికి రాగా వరుసగా తగ్గుతూ వస్తూ సోమవారం 226 టన్నుల టమాటా మాత్రమే వచ్చింది. ఫలితంగా ధర భారీగా పెరిగింది. పది కిలోల టమాటా రూ.460 పలికింది. ఇక్కడ కొనుగోలు చేసిన టమాటా ఆరు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. తమిళనాడులోని చెన్నై, మధురై, పాండిచ్చేరి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటకలోని గదగ్, తెలంగాణలోని కరీంనగర్, హైదరబాదు, వరంగల్, ఖమ్మం, ఇల్లందు, భువనగిరి, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, గుడివాడ, నెల్లూరు, రాజమండ్రి ప్రాంతాలకు తరలిస్తున్నారు.