టమాటా ధర ఢమాల్..
* తగ్గిన ఉష్ణోగ్రతలు పెరిగిన దిగుబడి
* స్టోరేజీ లేక నష్టపోతున్న రైతులు
* యేటా ఇదే దుస్థితి
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో పది రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి టమాటా దిగుబడి ఒకేసారి గణనీయంగా పెరిగింది. కానీ ధర మాత్రం పాతాళానికి పడిపోయింది. పది రోజుల క్రితం కిలో రూ. 25 నుంచి రూ.30 వరకు ధర ఉండగా.. బుధవారం రూ.10కి పడిపోయింది. జిల్లాలో రబీ సాగులో అత్యధికంగా కూరగాయల సాగులో భా గంగా టమాటా సాగవుతోంది. దిగుబడి వస్తున్నా గిట్టుబాటు దర లేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
ఆదిలాబాద్ మార్కెట్‌కు రోజుకు 6టన్నుల నుంచి 8 టన్నుల టమాటా వస్తోంది. కోల్డ్ స్టోరేజీ సదుపాయం లేకపోవడంతో తక్కువ ధరకు విక్రయించడం, మిగిలిన వాటిని సాయంత్రం పడేయడం జరుగుతోంది. ఏటా స్టోరెజీ లేక క్వింటాళ్లాకు క్వింటాళ్లు రోడ్డున పడేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి టమాటా మార్కెట్‌కు తీసుక వస్తుండడంతో రవాణా ఖర్చులు కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎకరా సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చుతో రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి అవుతోంది. గతయేడాది పోలిస్తే ఈ యేడాది విత్తనాలు, పురుగుల మందుల, కూలీల ఖర్చు పెరిగింది. కానీ పంట చేతికొచ్చేసరికి గిట్టుబాటు ధర రావడం లేదు.
తగ్గిన సాగు..
ప్రస్తుతం చలిగాలలు, మంచు ప్రభావంతో దిగుబడి ఒకేసారి అధికంగా మార్కెట్ రావడంతో ధర గణనీయంగా తగ్గింది. జిల్లాలో 6,897 వేల హెక్టార్లలో సాగువుతున్నట్లు ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. గతయేడాది పోలిస్తే ఈ యేడాది మూడువేలకు పైగా సాగు విస్తీర్ణం తగ్గింది. గత యేడాది ఇదే సమయంలో కిలో రూ. 5 వరకు ధర పలికింది. ఇప్పడు అదే పరిస్థితి కనిపిస్తోంది.
జిల్లాలోని ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, ఉట్నూర్, ఆదిలాబాద్, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లో అధికంగా సాగవుతోంది. ఆయా మండలాల నుంచి ఆదిలాబాద్ మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం టమాటా క్యారెట్(25కిలోలు) ధర రూ.400 నుంచి రూ.600 వరకు పలికింది. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80 వరకు చెల్లిస్తున్నారు. కోల్డ్‌స్టోరేజీ లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.