Top Story
-
దసరా నవరాత్రులు.. సర్వం శక్తిమయం
దసరా నవరాత్రులు ఏటా శరదృతువులో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జరుగుతాయి. అందుకే వీటిని శరన్నవరాత్రులని అంటారు. దుర్గాదేవిని ఈ తొమ్మిది రోజులూ ఆరాధిస్తారు గనుక దేవీ నవరాత్రులని అంటారు. హరిహరబ్రహ్మేంద్రాది దేవతల చేత పూజలందుకునే దుర్గాదేవి మహిషాసుర సంహారం కోసం అవతరించింది. మహిషాసురునితో తొమ్మిది రోజుల హోరాహోరీ యుద్ధం తర్వాత మహిషాసురుడిని సంహరించింది. లోకానికి మహిషాసురుని పీడ విరగడైనందుకు ఆశ్వీయుజ శుద్ధ దశమిని విజయదశమిగా పాటించడం ఆనవాయితీగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవిని ఆదిశక్తి స్వరూపంగా భక్తులు కొలుస్తారు. సమస్త చరాచర జగత్తుకు ఆధారభూతమైనది శక్తి మాత్రమేనని నమ్ముతారు. ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః’ నవరాత్రులలో అమ్మవారిని శక్తిస్వరూపంగా తలచి స్తోత్రపాఠాలతో వేడుకగా పూజలు జరుపుతారు. పురాణగాథల ప్రకారం మహిషాసుర సంహార ఘట్టం సంక్షిప్తంగా... మహిషాసురుడు అసురులలో మహా బలసంపన్నుడు. ఎంతటి బలసంపన్నుడికైనా ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు. మహిషాసురుడు తనకు మరణం ఉండరాదనుకున్నాడు. తన కోరిక నెరవేర్చుకోవడానికి మేరుపర్వత శిఖరానికి చేరుకుని, అక్కడ కూర్చుని బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. మరణం లేకుండా వరమివ్వమన్నాడు మహిషాసురుడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని, మరణం లేకుండా ఉండే వరం ప్రకృతి విరుద్ధమని, అలాంటి వరాన్ని ఇవ్వజాలనని అన్నాడు బ్రహ్మదేవుడు. అయినా, మహిషాసురుడు పట్టువదల్లేదు. ‘నీ మృత్యువుకు ఏదైనా ఒక మార్గం విడిచిపెట్టి వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘నా దృష్టిలో ఆడది అంటే అబల. అబల వల్ల నాకెలాంటి ప్రమాదమూ లేదు. అందువల్ల పురుషుల చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు’ అన్నాడు మహిషాసురుడు. ‘సరే’ అన్నాడు బ్రహ్మదేవుడు. వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. స్వర్గంపై దండెత్తి, దేవతలందరినీ ఓడించాడు. ఇంద్రపదవిని కైవసం చేసుకుని ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టసాగాడు. దుర్గాదేవి అవతరణ పదవీభ్రష్టుడైన ఇంద్రుడు త్రిమూర్తుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, వారిలో రగిలిన క్రోధాగ్ని ఒక దివ్యతేజస్సుగా మారింది. త్రిమూర్తుల దివ్యతేజస్సు కేంద్రీకృతమై ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా కలిగి అవతరించిన ఆమె పద్దెనిమిది భుజాలు కలిగి ఉంది. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని ఆమెకు ఆయుధాలుగా ఇచ్చారు. బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని ఇచ్చాడు. ఆమెకు వాహనంగా సింహాన్ని హిమవంతుడు ఇచ్చాడు. దేవతలందరూ ఇచ్చిన ఆయుధాలను ధరించిన ఆమె మహిషాసురుడిపై యుద్ధానికి వెళ్లింది. మహిషాసురుడి సేనతో భీకరమైన యుద్ధం చేసింది. మహిషాసురుడి సైన్యంలో ప్రముఖులైన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు వంటి వారిని తుదముట్టించిన తర్వాత నేరుగా మహిషాసురుడితో తలపడింది. తొమ్మిదిరోజుల యుద్ధం తర్వాత దశమి నాడు మహిషాసురుడు దేవి చేతిలో హతమయ్యాడు. మహిషాసురుడి పీడ విరగడ కావడంతో ప్రజలు ఆనాడు వేడుకలు జరుపుకున్నారు. మహిషాసురుడిపై విజయం సాధించిన రోజు గనుక విజయదశమిగా, దసరాగా ఈ పండుగను దేశ విదేశాల్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుకుంటారు. వైవిధ్యభరితంగా వేడుకలు దసరా నవరాత్రి వేడుకలను దేశం నలుమూలలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకొంటారు. దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో దసరా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో ఊరూరా దేదీప్యమానమైన అలంకరణలతో దేవీ మండపాలు పెద్దసంఖ్యలో కనిపిస్తాయి. సప్తమి, అష్టమి, నవమి తిథులలో బెంగాలీలు దుర్గామాతకు విశేష పూజలు చేస్తారు. దశమినాడు కాళీమాతను పూజిస్తారు. కోల్‌కతాలో కొలువుతీర్చిన దేవీవిగ్రహాలను నవరాత్రుల చివరిరోజున హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. అదేరోజున కుమారీపూజ చేస్తారు. ఒడిశాలో ఊరూరా వాడవాడలా దుర్గా మండపాలను ఏర్పాటు చేసి, తొమ్మిదిరోజులూ పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున విజయదుర్గను ఆరాధిస్తే అపజయాలు ఉండవని ఒడిశా ప్రజల విశ్వాసం. ఒడియా మహిళలు నవరాత్రుల సందర్భంగా మానికలో వడ్లు నింపి, ఆ మానికను లక్ష్మీదేవిలా భావించి పూజిస్తారు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిని వధించాడని విశ్వసిస్తారు. రావణవధకు ప్రతీకగా విశాలమైన కూడళ్లలో, మైదానాల్లో భారీ పరిమాణంలోని రావణుడి దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి, బాణసంచాతో కాలుస్తారు. చాలాసేపు కాలుతూ ఉండే రావణకాష్టాన్ని తిలకించడానికి కూడళ్లలో, మైదానాల్లో జనాలు పెద్దసంఖ్యలో గుమిగూడతారు. విజయదశమి తర్వాత వచ్చే పున్నమి వరకు ఒడిశాలో మహిళలు ‘జొహ్ని ఉసా’ వేడుకలను జరుపుకొంటారు. గౌరీదేవిని ఆరాధిస్తూ జరిపే ఈ వేడుకలో తెలంగాణలోని ‘బతుకమ్మ పండుగ’ వేడుకలను పోలి ఉంటాయి. గుజరాత్లో దసరా వేడుకల సందర్భంగా ప్రధానంగా పార్వతీదేవిని ఆరాధిస్తారు. ఇంటింటా శక్తిపూజ చేయడం గుజరాతీల ఆచారం. ఇంటి గోడలపై శ్రీచక్రం, త్రిశూలం, శక్తి ఆయుధం చిత్రాలను పసుపుతో చిత్రించి, అలంకరిస్తారు. సమీపంలోని పొలం నుంచి తీసుకు వచ్చిన మట్టితో వేదిక ఏర్పాటు చేసి, దానిపై గోధుమలు, బార్లీ గింజలను చల్లి, దానిపై నీటితో నింపిన మట్టి కుండను పెట్టి, అందులో పోకచెక్క లేదా రాగి లేదా వెండి నాణేన్ని వేస్తారు. ఆ మట్టికుండనే దేవీ ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. అష్టమి రోజున హోమం చేసి, దశమి రోజున నిమజ్జనం చేస్తారు. దశమి తర్వాత వచ్చే పున్నమి వరకు జరిగే ‘గర్భా’ వేడుకల్లో మహిళలు నృత్యగానాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా వైవిధ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో దసరా వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో దసరా సందర్భంగా ఏనుగు సంబరాలను నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల మొదటి రోజున ఏనుగు గుడిలో వయసైన బ్రహ్మచారిని భేతాళుడిగా నిలబెడతారు. తొమ్మిదిరోజులూ భేతాళుడే అమ్మవారి పూజాదికాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వెదురుకర్రలు, గడ్డి, కొబ్బరిపీచుతో తయారు చేసిన ఏనుగు బొమ్మను వివిధ అలంకరణలతో రూపొందించిన అంబారీతో అలంకరిస్తారు. ఇదేరీతిలో మరో చిన్న ఏనుగు బొమ్మను తయారు చేసి, చివరి రోజున బోయీలతో ఊరేగింపుగా తీసుకువెళతారు. దసరా రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరుగంటల వరకు జరిగే ఈ వేడుకలు తూపుచెరువు కట్ట వద్దకు చేరుకోవడంతో ముగుస్తాయి. విజయనగరంలో దసరా సందర్భంగా గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తారు. దసరా తర్వాతి మొదటి మంగళవారం రోజున పైడితల్లికి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో పూజారిని సిరిమాను ఎక్కించి, మూడు లాంతర్ల కూడలి నుంచి రాజుగారి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మూడు రోజుల ముందుగానే విజయనగరం చేరుకుని, వీధుల్లోనే గుడారాలు వేసుకుని మకాం వేసి, ఈ ఉత్సవాలను చూసి ఆనందిస్తారు. కృష్ణాజిల్లా రేవుపట్టణం బందరులో దసరా సందర్భంగా శక్తిపటాల ఊరేగింపు నిర్వహిస్తారు. బ్రిటిష్‌కాలంలో బుందేల్‌ఖండ్ నుంచి ఇక్కడకు వచ్చిన సైనికుడు ఒకరు అప్పట్లో బందరులోని ఈడేపల్లిలో కాళీమాతను ప్రతిష్ఠించాడు. దసరా నవరాత్రుల్లో ఇక్కడి నుంచి శక్తిపటాన్ని ఊరేగింపుగా వీధుల్లోకి తీసుకు రావడం ఆచారంగా వస్తోంది. వీధుల్లోకి వచ్చినప్పుడు జనం తమ తమ మొక్కుబళ్లను చెల్లించుకుంటారు. దసరా రోజున వీరనృత్యం చేస్తూ రాక్షసవధను అభినయిస్తారు. తర్వాత కోనేరు సెంటరు వద్ద జమ్మి కొట్టడంతో వేడుకలు ముగుస్తాయి. ఒంగోలులో దసరా వేడుకల సందర్భంగా కళారాలను ఊరేగిస్తారు. భారీ ముఖాకృతులనే ‘కళారా’లని అంటారు. కాళికాదేవి, మహిషాసురమర్దిని, నరసింహస్వామి వంటి దేవతా ఆకారాలతో కళారాలను ముందుగానే సిద్ధం చేస్తారు. వీటిని బండి మీదకు ఎక్కించి, ఇటూ అటూ ఊపేందుకు వీలుగా కొయ్యలకు కడతారు. కళారాల వెనుక కళాకారులు ఉంటారు. డప్పుల మోతకు అనుగుణంగా కళాకారులు ఉగ్రంగా కళారాలను ఊపుతూ వీరనృత్యం చేస్తారు. కళారాలను ఊరి నడిబొడ్డుకు తీసకువచ్చాక, అక్కడ రాక్షస సంహారాన్ని అభినయిస్తారు. ఈ ఏడాది ‘కరోనా’ మహమ్మారి కారణంగా పండుగలన్నీ కళ తప్పాయి. ఏటా ఆనవాయితీగా జరిగే స్థాయిలో ఈసారి దసరా నవరాత్రులు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. బహిరంగ వేడుకల అట్టహాసం, వీధుల్లో సంబరాలు జరుపుకోవడం వంటివేవీ లేకపోయినా, దేశవ్యాప్తంగా గల శక్తిపీఠాలు, దేవీ ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారు. నవదుర్గల ఆరాధన శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ప్రధానమైనవిగా భావిస్తారు. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని గౌడ సారస్వత బ్రాహ్మణులు నవదుర్గలను కులదేవతలుగా ఆరాధిస్తారు. వరాహ పురాణంలో నవదుర్గల ప్రస్తావన కనిపిస్తుంది. నవరాత్రులలో నవదుర్గలను వరాహపురాణ శ్లోకంలో చెప్పిన వరుస క్రమంలో ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా వరాహ పురాణంలోని ఈ శ్లోకం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గల పేర్లు. నవరాత్రులలో దుర్గాదేవిని ఈ రూపాలలో అలంకరణలు చేసి, నిష్టగా పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. దేవీసప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గ, భ్రామరి అనే నామాలను, వారి గాథలను ప్రస్తావించినా, ఈ అవతరాలను ప్రత్యేకంగా నవదుర్గలుగా వ్యవహరించలేదు. అయితే, దసరా నవరాత్రుల్లో కొన్ని ఆలయాల్లో అమ్మవారిని దేవీసప్తశతిలో పేర్కొన్న రూపాలలో అలంకరించి, పూజలు జరపడం ఆనవాయితీగా కొనసాగుతోంది. శాక్తేయ సంప్రదాయంలో నవదుర్గలనే కాకుండా, దశ మహావిద్యల రూపాల్లో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. దసరా నవరాత్రులలో దశ మహావిద్యల రూపాలైన కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్తా, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక రూపాలలో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అలాగే సప్తమాతృకలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండి రూపాలలో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిదిరోజులూ అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు చేస్తారు. విజయదశమి రోజున అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. కనకదుర్గ అమ్మవారు కృష్ణానదిలో మూడుసార్లు తెప్పపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలి వస్తారు. దసరా రోజున ప్రభల ఊరేగింపు, ప్రభల ఊరేగింపులో జరిగే భేతాళ నృత్యం విజయవాడ దసరా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణలో దసరా నవరాత్రులలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటారు. తంగేడు, గునుగు వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది మహిళలంతా ఉత్సాహంగా ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున నిమజ్జనం చేసిన తర్వాత పండుగ జరుపుకుంటారు. ఆడపడుచులు ఈ వేడుకలను కన్నవారిళ్లలో జరుపుకోవడం ఆనవాయితీ. -
కంపెనీల రిక్రూట్మెంట్ జోష్..క్యాంపస్‌లకు పోదాం చలో చలో..
టాప్ స్టోరీ క్యాంపస్ రిక్రూట్మెంట్స్.. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్యార్థుల కెరీర్లో అత్యంత కీలక ఘట్టం. కోర్సులో అడుగు పెట్టినప్పటి నుంచే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తారు. మెచ్చిన కంపెనీలో కోరుకున్న కొలువు కోసం అహోరాత్రులు కష్టపడతారు. కోర్సు ఫైనల్ దశలో ఉన్న విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకునే సమయం వచ్చేసింది. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని కాలేజీల్లో మరో నెల రోజుల్లో ప్లేస్‌మెంట్స్ మొదలుకానున్నాయి. ఇప్పటివరకు అందిన ఆఫర్స్‌ను పరిశీలిస్తే గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్, లేటెస్ట్ ట్రెండ్స్‌పై నిపుణుల విశ్లేషణ.. ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల స్థాయిలో ఇప్పటికే క్యాంపస్ నియామక ప్రక్రియ మొదలైంది. ప్రఖ్యాత ఐఐఎంలు, ఐఐటీల్లో ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ డిసెంబర్లో ప్రారంభం కానుంది. అయితే ఐఐటీలు, ఐఐఎంలలో ప్రీ ప్లేస్‌మెంట్స్, సమ్మర్ ప్లేస్‌మెంట్స్ పేరుతో మూడు నెలల క్రితమే అనేక కంపెనీలు ఆఫర్లు అందించాయి. ఈ ఆఫర్స్ పొందిన విద్యార్థులు ఆయా సంస్థల్లో కచ్చితంగా ఫైనల్ ప్లేస్మెంట్ సొంతం చేసుకుంటారనేది గత ఐదారేళ్ల గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఐఐఎంలలో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో పేరుగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లలో ప్రీ ప్లేస్మెంట్/సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్ పరిస్థితి అత్యంత ఆకర్షణీయంగా ఉంది. 2014-15 బ్యాచ్‌కు సంబంధించి నిర్వహించిన ప్రీ ప్లేస్మెంట్లో ఐఐఎం లక్నో 100 శాతం రికార్డ్ సొంతం చేసుకుంది. దేశీయ, విదేశీ సంస్థలు రెండూ కలిపి మొత్తం 164 సంస్థలు అవకాశాలు కల్పించాయి. ఐఐఎం-అహ్మదాబాద్‌లో 2014-15 పీజీపీఎక్స్ ప్రోగ్రామ్‌లోని మొత్తం 381 విద్యార్థుల్లో 378 మందికి సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించాయి. ఇతర ఐఐఎంలు.. బెంగళూరు, కోల్‌కతా, ఇండోర్, రాయ్పూర్లలోనూ ఇదే ప్రగతి నమోదైంది. ఇవి కేవలం ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ మాత్రమే అని.. ఫైనల్ ప్లేస్‌మెంట్స్ మరింత ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వారి అంచనాల ప్రకారం- ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో 20 నుంచి 80 శాతం వృద్ధి కనిపించే అవకాశముంది. కంపెనీల పరంగా చూస్తే సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్ సంస్థల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంజనీరింగ్‌లో ఇలా ఇంజనీరింగ్ కోర్సుల విషయానికొస్తే.. ఈ ఏడాది ఐఐటీల కంటే ఎన్ఐటీలలో ముందుగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఇన్స్టిట్యూట్లలో ఇప్పటికే గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు రిక్రూట్మెంట్స్ ముగించాయి. అమెజాన్ డాట్ కామ్.. నిట్ అలహాబాద్, సూరత్కల్లలో రూ.25 లక్షలు చొప్పున వేతనాన్ని ఆఫర్ చేసింది. స్వదేశీ కంపెనీలలో కోడ్ నేషన్ సంస్థ నిట్ వరంగల్ విద్యార్థికి రూ.24 లక్షల ఆఫర్ ఇవ్వడం విశేషం. ఐఐటీల విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్స్ పేరుతో పలు సంస్థలు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించాయి. ఆ సమయంలోనే ఆకర్షణీయమైన స్టైఫండ్‌ను సైతం అందించాయి. ఐఐటీ గువహటి విద్యార్థులకు రూ.1.44 లక్షల స్టైఫండ్ లభించింది. ఇక పూర్తి స్థాయిలో ఫైనల్ ప్లేస్‌మెంట్స్ మొదలైతే ఐఐటీ క్యాంపస్‌లలో రిక్రూట్మెంట్స్ వెల్లువెత్తడం ఖాయం. కోర్ కంపెనీలు.. పబ్లిక్ సెక్టార్ సంస్థలు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో ఇప్పటివరకు ముగిసిన ప్రాంగణ నియామకాల్లో ఎక్కువగా పాల్గొన్నది ఐటీ, ఐటీఈఎస్ రంగాలే. కోర్ సెక్టార్ కంపెనీలు (ఆటోమొబైల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఇంకా క్యాంపస్‌లలో కాలు పెట్టలేదు. ఇవి నవంబర్ చివరివారంలో లేదా డిసెంబర్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ నిర్వహించే అవకాశముంది. ఇవి ముగిస్తే ఇంజనీరింగ్ విభాగాల్లో గతేడాదితో పోల్చితే కచ్చితంగా 50 శాతం ఎక్కువగా నియామకాలు జరుగుతాయని అంచనా. మరోవైపు ఈసారి ప్రాంగణ నియామకాల్లో ప్రభుత్వరంగ సంస్థలు కూడా పాల్పంచుకోనున్నాయి. మొత్తం ఖాళీల్లో 25 శాతం ఉద్యోగాలను క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా భర్తీ చేసుకోవచ్చని వీటికి ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఆ మేరకు నాణ్యమైన మానవ వనరుల ఎంపికకు ప్రాంగణ నియామకాలను వేదికగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీపీసీఎల్, ఓఎన్జీసీ తదితర సంస్థలు డిసెంబర్లో క్యాంపస్‌లకు రానున్నాయి. ముఖ్యంగా నిట్ క్యాంపస్‌లు, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మొగ్గు చూపే అవకాశముంది. సన్నద్ధమవుతున్న సూపర్ డ్రీమ్ కంపెనీలు ప్రాంగణ నియామకాలకు సంబంధించి.. కంపెనీలను అవి అందించే వార్షిక వేతనాల ఆధారంగా విద్యార్థుల కోణంలో మూడు కేటగిరీలుగా(సూపర్ డ్రీమ్, డ్రీమ్, రెగ్యులర్) పేర్కొంటారు. ఏడాదికి రూ.10 లక్షలుపైగా అందించే సంస్థలను సూపర్ డ్రీమ్ కంపెనీలుగా; రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఆఫర్ ఇచ్చే సంస్థలను డ్రీమ్ కంపెనీలుగా; రూ.5 లక్షల లోపు వేతనాలు ఇచ్చే సంస్థలను రెగ్యులర్ సంస్థలుగా పిలుస్తారు. ఈ క్రమంలో సూపర్ డ్రీమ్ కంపెనీలుగా పేరు పొందిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, ఐబీఎం వంటి సంస్థలు డిసెంబర్లో నియామక ప్రక్రియను నిర్వహించనున్నాయి. ఐఐటీల్లో రిక్రూట్మెంట్స్ డ్రైవ్స్ నిర్వహించే సంస్థల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ఐఐటీ-గువహటిలో గతేడాది 120 సంస్థలు రాగా.. ఈసారి ఆ సంఖ్య 200కు చేరుకోనుంది. ఇదే పరిస్థితి ఇతర ఐఐటీల్లోనూ కనిపిస్తోంది. ఈ-కామర్స్ ఆకర్షణీయం ఇక కంపెనీల కోణంలోనూ ఫ్రెషర్స్ హైరింగ్ ఈ ఏడాది భారీగా జరగనుంది. అందుకు వేదిక ప్రాంగణ నియామకాలు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 55 వేల మందిని నియమిస్తామని పేర్కొన్న టీసీఎస్.. అందులో 25 వేల ఖాళీలను ఫ్రెషర్స్‌తో భర్తీ చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 40 శాతం మేరకు నియామకాలు పూర్తి చేసింది. త్వరలో మరిన్ని టైర్-2, టైర్-3 నగరాల్లోని కళాశాలల్లోనూ రిక్రూట్మెంట్స్ డ్రైవ్స్ నిర్వహించనుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22 వేల మంది తాజా అభ్యర్థులను నియమించుకోవాలని యోచిస్తోంది. ఇలా మొత్తం మీద కంపెనీలు కూడా తాజా నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ గతేడాదితో పోల్చితే 50 శాతం మేర పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే తాజాగా ఈ-కామర్స్.. అత్యంత ఆకర్షణీయంగా మారింది. అటు పరిశ్రమ పరంగా, ఇటు విద్యార్థుల కోణంలో గత కొన్నేళ్లుగా ఈ- కామర్స్ కంపెనీలు హాట్‌ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. ఈ సంస్థలు ఈ ఏడాది కూడా ప్రాంగణ నియామకాల్లో ముందంజలో ఉంటున్నాయి. ఇప్పటికే ముగిసిన రిక్రూట్‌మెంట్స్‌ను విశ్లేషిస్తే... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే-ఇండియా తదితర ఈ-కామర్స్ సంస్థలు గతేడాది కంటే 25 శాతం ఎక్కువ పే ప్యాకేజ్‌లు ఆఫర్ చేశాయి. మారుతున్న నియామక విధానాలు క్యాంపస్ సెలక్షన్స్ విషయంలో సంస్థలు కూడా తమ ఎంపిక ప్రక్రియలో మార్పులు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షలను ఆన్లైన్ విధానంలో చేపడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలోని సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. పెన్-పేపర్ టెస్ట్‌కు స్వస్తి పలికి ఆన్లైన్ టెస్ట్‌లను చేపడుతున్నాయి. దీంతో విద్యార్థులు ఏ విభాగానికి చెందినవారైనా.. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అవసరంగా మారింది. కొన్ని కోర్ విభాగంలోని సంస్థలు ఇప్పటికీ పెన్-పేపర్ విధానంలోనే నియామక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు ప్రాథమిక దశలో నిర్వహించే రాతపరీక్షలో ఎక్కువగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ వంటి అంశాల నుంచే ప్రశ్నలు అడుగుతున్నారు. కోర్ సబ్జెక్ట్‌లో అడిగే ప్రశ్నల సంఖ్య తక్కువగా ఉంటోంది. అయితే కోర్ నాలెడ్జ్‌ను ఇంటర్వ్యూలో పరీక్షిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. దాంతోపాటు ఆయా సంస్థల గత ప్లేస్మెంట్ పేపర్స్‌ను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఆఫర్ పొందిన వారికి శిక్షణ ఐటీ కంపెనీలు కేవలం కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాలే కాకుండా.. కోర్ బ్రాంచ్లైన్మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ విద్యార్థులను కూడా నియమించుకుంటున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్స్ పొందిన విద్యార్థులకు శిక్షణనందించేందుకు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్స్‌ను రూపొందించాయి. వాటి ద్వారా నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా ఆఫర్ లెటర్ పొందిన రోజు నుంచి అపాయింట్మెంట్ తేదీ నాటికి సంస్థ కార్యకలాపాలపై అభ్యర్థికి పూర్తి అవగాహన లభిస్తుంది. స్టార్టప్స్‌పై ఆసక్తి.. సీటీసీపై అనురక్తి ఐఐటీ-చెన్నైలో దాదాపు పది మంది విద్యార్థులు సొంత స్టార్టప్స్‌పై ఆసక్తితో సమ్మర్ ఇంటర్న్స్ వచ్చినా వదులుకున్నారు. ఈసారి నియామకాల్లో కనిపిస్తున్న మరో కోణం.. సీటీసీకి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వడం. గతంలో చాలా మంది విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా అడుగులు వేయగా.. ఈసారి మాత్రం సీటీసీ (పే ప్యాకేజ్)లను ప్రధాన ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం. ఆఫర్లు.. ఆశాజనకం ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరించుకోవడంతోపాటు, ఫ్రెష్ టాలెంట్వైపు మొగ్గు చూపడమే దీనికి కారణం. బిట్స్ క్యాంపస్‌లలో రెండు రోజుల్లోనే 2,300 మంది విద్యార్థులకు ఆఫర్లు లభించడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 20 నుంచి 25 శాతం మేర నియామకాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తంలో ఐదు నుంచి పది శాతం వ్యత్యాసం ఉంటుందని భావించినా కూడా గత ఏడాది కంటే ఎక్కువ ఆఫర్లే ఆశించొచ్చు. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో భారీ నియామకాలు జరగడం ఖాయం. -ప్రొఫెసర్ బాల సుబ్రమణియన్, చీఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, బిట్స్-పిలానీ అన్ని విభాగాల్లోనూ పెరిగిన అవకాశాలు ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో అన్ని విభాగాల్లోనూ అవకాశాల సంఖ్య పెరిగింది. ఐటీ, కోర్ అనే కాకుండా ఇతర ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్‌ల విద్యార్థులకు కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. నిట్ వరంగల్‌లో బయోటెక్నాలజీ బ్రాంచ్‌కు చెందిన 45 మందికి, కెమికల్ విభాగంలో 29 మందికి ఆఫర్లు లభించడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. ఇక.. పే ప్యాకేజ్‌ల పరంగా ఈ ఏడాది దేశీయంగా పే ప్యాకేజ్‌లు రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షలు.. అంతర్జాతీయంగా పే ప్యాకేజ్‌లు రూ.50 లక్షల నుంచి రూ. కోటి అందే అవకాశముంది. -ప్రొఫెసర్ రవి కుమార్, డెరైక్టర్-ప్లేస్మెంట్ సెల్, నిట్ - వరంగల్ ఔట్సోర్సింగ్, విస్తరణ విధానాలే కారణాలు ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్స్ పురోగమన దశలో పయనిస్తున్నాయి. దీనికి కారణం ఈ సంస్థల ఔట్సోర్సింగ్ కార్యకలాపాలు, కోర్ బిజినెస్ విస్తరణ విధానాలే కారణాలు. సంస్థలు అభ్యర్థుల నుంచి ముఖ్యంగా కోరుకునే స్కిల్స్.. కమ్యూనికేషన్, ఇంటర్ కల్చరల్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్. వీటిని పెంచుకుంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో విజయం సాధించడం సులభమే. - పీఎస్ఆర్పీ కిరణ్, సీనియర్ మేనేజర్, టాలెంట్ ఎక్విజిషన్ విప్రో టెక్నాలజీస్ -
కొత్త ఏడాది.. కొలువులకు స్వాగతం
మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తిచేసుకుని జాబ్ మార్కెట్లో అడుగుపెట్టనున్నారు. సాధారణంగా వీరందరిలో తలెత్తే ప్రశ్నలు.. జాబ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? కంపెనీలు ఏ స్థాయిలో నియామకాలు చేపడతాయి? గతేడాది కంటే ఈ ఏడాది జాబ్ మార్కెట్ మెరుగ్గా ఉంటుందా? అనేవే. అయితే ఈ విషయంలో ఆందోళన చెందనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది జాబ్ మార్కెట్ వెలుగులీననుంది. అన్ని రంగాల్లో నియామకాలు గతేడాదితో పోల్చితే ఎక్కువే ఉంటాయని పరిశ్రమ వర్గాల విశ్లేషణ. మరోవైపు అసోచామ్, సీఐఐ, నాస్కామ్ వంటి సంస్థల సర్వేలు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2014లో హైరింగ్ ట్రెండ్స్‌పై విశ్లేషణ.. ముందంజలో బీఎఫ్ఎస్ఐ కొత్త ఏడాదిలో నియామకాల పరంగా నిపుణుల అంచనా ప్రకారం.. మిగతా రంగాలతో పోల్చితే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ రంగాలు ముందంజలో నిలవనున్నాయి. ప్రైవేటు బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఫలితంగా.. ఒక్క బీఎఫ్ఎస్ఐ రంగంలోనే కొత్తగా దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకి అవకాశముంది. ‘ఈ ఏడాది బ్యాంకింగ్ రంగంలో నియామకాలు ఆశావహంగా ఉండనున్నాయి. ఉద్యోగార్థులు ముందస్తు ప్రణాళికతో అడుగులు వేస్తే ఏదో ఒక బ్యాంకులో కొలువు ఖాయం’ అంటున్నారు కోటక్ మహీంద్రా బ్యాంక్ క్యాంపస్ సెలక్ట్ హెడ్ ఎస్.చంద్రకళ. బీఎఫ్ఎస్ఐ తర్వాత స్థానంలో అత్యధిక నియామకాలు చేపట్టనున్న రంగం రిటైల్ పరిశ్రమ. ఇందులో ప్రస్తుత సంఖ్యతో పోల్చితే దాదాపు 40 శాతం మేర ఉద్యోగాల సంఖ్య పెరగనుంది. ప్రధానంగా 2014 ప్రథమార్ధంలోనే అన్ని స్థాయిల్లో నియామకాలు పూర్తి చేయాలని సంస్థలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి జూన్ చివరి వరకు రిటైల్ రంగంలో ఉద్యోగ మేళా కొనసాగనుంది. ఉద్యోగార్థులు వ్యక్తిగతంగా పరిమితులు విధించుకోకుండా ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే అవకాశాలు చేతికందుతాయి అనేది ఈ రంగంలో నిపుణుల సూచన. మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ మార్కెట్లో కీలక పాత్ర పోషించే రంగం.. మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దేశంలో ఇంజనీరింగ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎంచుకునే కోర్సు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ కోర్సు ఉత్తీర్ణులకు కూడా కొత్త ఏడాది ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్, మార్కెటింగ్ స్పెషలైజేషన్ విభాగాల్లో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. అటు ఉత్పత్తి రంగంలో, ఇటు సర్వీస్ సెక్టార్లో కొత్త కంపెనీలు రానున్నాయి. వాటికి వెన్నెముకలుగా నిలిచే ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఆయా కంపెనీలు ఎక్కువ దృష్టి సారించనుండటమే నియామకాలకు ప్రధాన కారణం అనేది క్యాపిటల్ ఐక్యూ హెచ్.ఆర్. ప్రతినిధి శ్వేత అభిప్రాయం. అంతేకాకుండా ఫైనాన్స్ విభాగానికి సంబంధించి అమెరికా, ఇతర దేశాలు మన దేశంలో అవుట్ సోర్సింగ్‌కు మొగ్గు చూపుతున్నాయి. ఇది ఫైనాన్స్ స్పెషలైజేషన్ విద్యార్థులకు కలిసొచ్చే అంశమని ప్రముఖ అవుట్ సోర్సింగ్ సంస్థ డెలాయిట్ ప్రతినిధి సిమిశర్మ అంటున్నారు. ఈ రంగాల్లో అందివస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మేనేజ్మెంట్ సంబంధిత సాఫ్ట్వేర్ కోర్సులు చేయడం కూడా లాభిస్తుంది. వివిధ ప్రైవేటు సంస్థలు షార్ట్‌టర్మ్ కంప్యూటర్ కోర్సులను అందిస్తున్నాయి. ఫైనాన్స్, మార్కెటింగ్ మాత్రమే కాకుండా ఎంబీఏలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎయిర్ అండ్ కార్గో మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అభ్యసించినవారికి మంచి అవకాశాలున్నాయి. అయితే మంచి కంపెనీలో కోరుకున్న వేతనంతో ఉద్యోగం సాధించాలంటే అత్యుత్తమ నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. ఐటీ.. ఐటీఈఎస్ ఆశావహమే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనుబంధ సర్వీసుల రంగంలో నియామకాలు గత ఏడాదితో పోల్చితే 10 నుంచి 14 శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే కంపెనీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించనున్నాయి. ముఖ్యంగా తాజా నియామకాల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండనున్నాయి. దీనికి మన దేశంలోని సాఫ్ట్వేర్ సంస్థలకు ప్రధాన క్లయింట్లుగా ఉన్న అమెరికా, యూరప్ దేశాల్లోని ప్రతికూల ఆర్థిక పరిస్థితులే కారణమన్నది నిపుణుల విశ్లేషణ. భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టడం కంటే అవసరమైనప్పుడు మాత్రమే భర్తీ చేయడానికి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. సబ్జెక్ట్ పరంగా పరిపూర్ణత పొందిన వారికే అవకాశాలు లభించనున్నాయి. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగార్థులు అకడెమిక్‌గా సబ్జెక్ట్ పరంగా సంపూర్ణ అవగాహన, క్షేత్ర స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు ట్రిపుల్ఐటీ హైదరాబాద్ హెడ్- ప్లేస్మెంట్ టి.వి. దేవీ ప్రసాద్. కోర్ ఇంజనీరింగ్ కళ కళ దేశవ్యాప్తంగా ఏటా దాదాపు పది లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. వీరిలో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు (మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సివిల్) విద్యార్థులు 70 శాతం ఉంటారు. వీరికి ఈ ఏడాది ఉద్యోగాలపరంగా మంచి అవకాశా లున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో నియామకాల సంఖ్య గత ఏడాదితో పోల్చితే పది నుంచి 20 శాతం మేర పెరగనుంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండనుంది. అంతేకాకుండా.. టెలికాం, పవర్ జనరేషన్ సంస్థల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కోర్ బ్రాంచ్‌ల ఇంజనీరింగ్ విద్యార్థులకు 2014 అత్యంత ఆశావహ సంవత్సరంగా పేర్కొనొచ్చు. ‘దేశంలో ఉత్పత్తి రంగం, ఆర్ అండ్ డీలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు జాబ్ మార్కెట్లో డిమాండ్ పెరగనుంది. దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత విద్యార్థులదే’ అంటున్నారు బీహెచ్ఈఎల్ హెచ్ఆర్ మేనేజర్ బాలకిషన్. ఫార్మాస్యూటికల్స్ బ్యాంకింగ్, ఐటీ, రిటైల్, సర్వీస్ సెక్టార్లను మినహాయిస్తే.. జాబ్ మార్కెట్, హైరింగ్ ట్రెండ్స్ విషయంలో ఫార్మాస్యూటికల్ విభాగంలో అధిక ఉద్యోగాలు లభించనున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం- దీనికి రెండు ప్రధాన కారణాలు.. మొదటిది.. దేశీయంగా ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరగడం.. ఆ మేరకు ఔషధ వినియోగం పెరగడం. కాగా, రెండో కారణం.. అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఆర్ అండ్ డీ నిబంధనలు, మానవ వనరుల విషయంలో కొరత కారణంగా అక్కడి ఫార్మాస్యూటికల్ సంస్థలు మన దేశంలో అవుట్సోర్సింగ్కు మొగ్గు చూపడం. ఈ రెండు కారణాలతో ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు ఈ ఏడాది అధిక అవకాశాలు లభించనున్నాయి. ప్రధానంగా డ్రగ్ ఫార్ములేషన్, డ్రగ్ రీసెర్చ్ విభాగాల్లో ఎక్కువగా ఖాళీల భర్తీ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎంఫార్మసీ విద్యార్థులకు ఈ ఏడాది కలిసొచ్చే సంవత్సరం అంటున్నారు నైపర్ ప్రాజెక్ట్ డెరైక్టర్ అహ్మద్ కమల్. కెరీర్‌కు వ్యవ‘సాయం’ ఇక.. సర్వేల పరంగా చూస్తే.. అసోచామ్ నిర్వహించిన సర్వే ప్రకారం-వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో ఈ ఏడాది పురోగతి కనిపించనుంది. రబీ సీజన్లోనే ఈ నియామకాలు ఊపందుకోనున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగా లైన అగ్రి ఇంజనీరింగ్, హార్టికల్చర్, సీడ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ వంటి కోర్సులు పూర్తిచేసినవారికి అటు ప్రభుత్వ రంగం లోనూ,ఇటు ప్రైవేటు రంగంలోనూ అత్యుత్తమ ఉపాధి అవకాశాలున్నాయి. బీటెక్‌లో అగ్రి బయో టెక్నాలజీ కోర్సులు పూర్తిచేసినవారికీ అవకాశాలు పుష్కలం. ఎందుకంటే మనదేశం ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. అంతే కాకుండా ఈ రంగంలోకి బహుళజాతి సంస్థలూ ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్‌తో కెరీర్ ‘పంట’ పండుతుందని నిపుణులు అంటున్నారు. హాస్పిటాలిటీ, టూరిజం సర్వీస్ సెక్టార్లో ప్రధానంగా హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం వంటి రంగాలు కూడా కొత్త ఏడాదిలో ఉద్యోగార్థులకు కొలువుల పరంగా కేరాఫ్‌గా నిలవనున్నాయి. ఈ విభాగాల్లో గత ఏడాదితో పోల్చితే 20 నుంచి 25 శాతం మేర నియామకాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణ. ఆర్థిక ఒడిదుడుకులు, జీడీపీ వృద్ధితో సంబంధం లేకుండా.. ప్రస్తుతం నమోదవుతున్న జీడీపీలో దాదాపు 10 శాతం వృద్ధి నమోదు చేసుకుంటున్న రంగాలు హాస్పిటాలిటీ, టూరిజం రంగాలు. ఈ రంగంలో నియామకాలు పెరుగుతాయని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. పీపుల్ స్ట్రాంగ్ ఇండియా అనే సంస్థ సీఐఐతో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.