టాప్ స్టోరీ
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్.. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యార్థుల కెరీర్‌లో అత్యంత కీలక ఘట్టం. కోర్సులో అడుగు పెట్టినప్పటి నుంచే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తారు. మెచ్చిన కంపెనీలో కోరుకున్న కొలువు కోసం అహోరాత్రులు కష్టపడతారు. కోర్సు ఫైనల్ దశలో ఉన్న విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకునే సమయం వచ్చేసింది. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని కాలేజీల్లో మరో నెల రోజుల్లో ప్లేస్‌మెంట్స్ మొదలుకానున్నాయి. ఇప్పటివరకు అందిన ఆఫర్స్‌ను పరిశీలిస్తే గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, లేటెస్ట్ ట్రెండ్స్‌పై నిపుణుల విశ్లేషణ..
ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల స్థాయిలో ఇప్పటికే క్యాంపస్ నియామక ప్రక్రియ మొదలైంది. ప్రఖ్యాత ఐఐఎంలు, ఐఐటీల్లో ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. అయితే ఐఐటీలు, ఐఐఎంలలో ప్రీ ప్లేస్‌మెంట్స్, సమ్మర్ ప్లేస్‌మెంట్స్ పేరుతో మూడు నెలల క్రితమే అనేక కంపెనీలు ఆఫర్లు అందించాయి. ఈ ఆఫర్స్ పొందిన విద్యార్థులు ఆయా సంస్థల్లో కచ్చితంగా ఫైనల్ ప్లేస్‌మెంట్ సొంతం చేసుకుంటారనేది గత ఐదారేళ్ల గణాంకాల ద్వారా తెలుస్తోంది.
ఐఐఎంలలో ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్
మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో పేరుగాంచిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లలో ప్రీ ప్లేస్‌మెంట్/సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ పరిస్థితి అత్యంత ఆకర్షణీయంగా ఉంది. 2014-15 బ్యాచ్‌కు సంబంధించి నిర్వహించిన ప్రీ ప్లేస్‌మెంట్‌లో ఐఐఎం లక్నో 100 శాతం రికార్డ్ సొంతం చేసుకుంది. దేశీయ, విదేశీ సంస్థలు రెండూ కలిపి మొత్తం 164 సంస్థలు అవకాశాలు కల్పించాయి. ఐఐఎం-అహ్మదాబాద్‌లో 2014-15 పీజీపీఎక్స్ ప్రోగ్రామ్‌లోని మొత్తం 381 విద్యార్థుల్లో 378 మందికి సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ లభించాయి. ఇతర ఐఐఎంలు.. బెంగళూరు, కోల్‌కతా, ఇండోర్, రాయ్‌పూర్‌లలోనూ ఇదే ప్రగతి నమోదైంది. ఇవి కేవలం ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ మాత్రమే అని.. ఫైనల్ ప్లేస్‌మెంట్స్ మరింత ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వారి అంచనాల ప్రకారం- ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో 20 నుంచి 80 శాతం వృద్ధి కనిపించే అవకాశముంది. కంపెనీల పరంగా చూస్తే సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్ సంస్థల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇంజనీరింగ్‌లో ఇలా
ఇంజనీరింగ్ కోర్సుల విషయానికొస్తే.. ఈ ఏడాది ఐఐటీల కంటే ఎన్‌ఐటీలలో ముందుగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇప్పటికే గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు రిక్రూట్‌మెంట్స్ ముగించాయి. అమెజాన్ డాట్ కామ్.. నిట్ అలహాబాద్, సూరత్‌కల్‌లలో రూ.25 లక్షలు చొప్పున వేతనాన్ని ఆఫర్ చేసింది. స్వదేశీ కంపెనీలలో కోడ్ నేషన్ సంస్థ నిట్ వరంగల్ విద్యార్థికి రూ.24 లక్షల ఆఫర్ ఇవ్వడం విశేషం. ఐఐటీల విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్స్ పేరుతో పలు సంస్థలు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించాయి. ఆ సమయంలోనే ఆకర్షణీయమైన స్టైఫండ్‌ను సైతం అందించాయి. ఐఐటీ గువహటి విద్యార్థులకు రూ.1.44 లక్షల స్టైఫండ్ లభించింది. ఇక పూర్తి స్థాయిలో ఫైనల్ ప్లేస్‌మెంట్స్ మొదలైతే ఐఐటీ క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్స్ వెల్లువెత్తడం ఖాయం.
కోర్ కంపెనీలు.. పబ్లిక్ సెక్టార్ సంస్థలు
ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇప్పటివరకు ముగిసిన ప్రాంగణ నియామకాల్లో ఎక్కువగా పాల్గొన్నది ఐటీ, ఐటీఈఎస్ రంగాలే. కోర్ సెక్టార్ కంపెనీలు (ఆటోమొబైల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఇంకా క్యాంపస్‌లలో కాలు పెట్టలేదు. ఇవి నవంబర్ చివరివారంలో లేదా డిసెంబర్‌లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహించే అవకాశముంది. ఇవి ముగిస్తే ఇంజనీరింగ్ విభాగాల్లో గతేడాదితో పోల్చితే కచ్చితంగా 50 శాతం ఎక్కువగా నియామకాలు జరుగుతాయని అంచనా. మరోవైపు ఈసారి ప్రాంగణ నియామకాల్లో ప్రభుత్వరంగ సంస్థలు కూడా పాల్పంచుకోనున్నాయి. మొత్తం ఖాళీల్లో 25 శాతం ఉద్యోగాలను క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా భర్తీ చేసుకోవచ్చని వీటికి ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఆ మేరకు నాణ్యమైన మానవ వనరుల ఎంపికకు ప్రాంగణ నియామకాలను వేదికగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీపీసీఎల్, ఓఎన్‌జీసీ తదితర సంస్థలు డిసెంబర్‌లో క్యాంపస్‌లకు రానున్నాయి. ముఖ్యంగా నిట్ క్యాంపస్‌లు, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మొగ్గు చూపే అవకాశముంది.
సన్నద్ధమవుతున్న సూపర్ డ్రీమ్ కంపెనీలు
ప్రాంగణ నియామకాలకు సంబంధించి.. కంపెనీలను అవి అందించే వార్షిక వేతనాల ఆధారంగా విద్యార్థుల కోణంలో మూడు కేటగిరీలుగా(సూపర్ డ్రీమ్, డ్రీమ్, రెగ్యులర్) పేర్కొంటారు. ఏడాదికి రూ.10 లక్షలుపైగా అందించే సంస్థలను సూపర్ డ్రీమ్ కంపెనీలుగా; రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఆఫర్ ఇచ్చే సంస్థలను డ్రీమ్ కంపెనీలుగా; రూ.5 లక్షల లోపు వేతనాలు ఇచ్చే సంస్థలను రెగ్యులర్ సంస్థలుగా పిలుస్తారు. ఈ క్రమంలో సూపర్ డ్రీమ్ కంపెనీలుగా పేరు పొందిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్, ఐబీఎం వంటి సంస్థలు డిసెంబర్‌లో నియామక ప్రక్రియను నిర్వహించనున్నాయి. ఐఐటీల్లో రిక్రూట్‌మెంట్స్ డ్రైవ్స్ నిర్వహించే సంస్థల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ఐఐటీ-గువహటిలో గతేడాది 120 సంస్థలు రాగా.. ఈసారి ఆ సంఖ్య 200కు చేరుకోనుంది. ఇదే పరిస్థితి ఇతర ఐఐటీల్లోనూ కనిపిస్తోంది.
ఈ-కామర్స్ ఆకర్షణీయం
ఇక కంపెనీల కోణంలోనూ ఫ్రెషర్స్ హైరింగ్ ఈ ఏడాది భారీగా జరగనుంది. అందుకు వేదిక ప్రాంగణ నియామకాలు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 55 వేల మందిని నియమిస్తామని పేర్కొన్న టీసీఎస్.. అందులో 25 వేల ఖాళీలను ఫ్రెషర్స్‌తో భర్తీ చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 40 శాతం మేరకు నియామకాలు పూర్తి చేసింది. త్వరలో మరిన్ని టైర్-2, టైర్-3 నగరాల్లోని కళాశాలల్లోనూ రిక్రూట్‌మెంట్స్ డ్రైవ్స్ నిర్వహించనుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22 వేల మంది తాజా అభ్యర్థులను నియమించుకోవాలని యోచిస్తోంది. ఇలా మొత్తం మీద కంపెనీలు కూడా తాజా నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ గతేడాదితో పోల్చితే 50 శాతం మేర పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే తాజాగా ఈ-కామర్స్.. అత్యంత ఆకర్షణీయంగా మారింది. అటు పరిశ్రమ పరంగా, ఇటు విద్యార్థుల కోణంలో గత కొన్నేళ్లుగా ఈ- కామర్స్ కంపెనీలు హాట్‌ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. ఈ సంస్థలు ఈ ఏడాది కూడా ప్రాంగణ నియామకాల్లో ముందంజలో ఉంటున్నాయి. ఇప్పటికే ముగిసిన రిక్రూట్‌మెంట్స్‌ను విశ్లేషిస్తే... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే-ఇండియా తదితర ఈ-కామర్స్ సంస్థలు గతేడాది కంటే 25 శాతం ఎక్కువ పే ప్యాకేజ్‌లు ఆఫర్ చేశాయి.
మారుతున్న నియామక విధానాలు
క్యాంపస్ సెలక్షన్స్ విషయంలో సంస్థలు కూడా తమ ఎంపిక ప్రక్రియలో మార్పులు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో చేపడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలోని సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. పెన్-పేపర్ టెస్ట్‌కు స్వస్తి పలికి ఆన్‌లైన్ టెస్ట్‌లను చేపడుతున్నాయి. దీంతో విద్యార్థులు ఏ విభాగానికి చెందినవారైనా.. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అవసరంగా మారింది. కొన్ని కోర్ విభాగంలోని సంస్థలు ఇప్పటికీ పెన్-పేపర్ విధానంలోనే నియామక పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు
ప్రాథమిక దశలో నిర్వహించే రాతపరీక్షలో ఎక్కువగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ వంటి అంశాల నుంచే ప్రశ్నలు అడుగుతున్నారు. కోర్ సబ్జెక్ట్‌లో అడిగే ప్రశ్నల సంఖ్య తక్కువగా ఉంటోంది. అయితే కోర్ నాలెడ్జ్‌ను ఇంటర్వ్యూలో పరీక్షిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. దాంతోపాటు ఆయా సంస్థల గత ప్లేస్‌మెంట్ పేపర్స్‌ను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది.
ఆఫర్ పొందిన వారికి శిక్షణ
ఐటీ కంపెనీలు కేవలం కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాలే కాకుండా.. కోర్ బ్రాంచ్‌లైన్‌మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ విద్యార్థులను కూడా నియమించుకుంటున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్స్ పొందిన విద్యార్థులకు శిక్షణనందించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ వెబ్ పోర్టల్స్‌ను రూపొందించాయి. వాటి ద్వారా నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా ఆఫర్ లెటర్ పొందిన రోజు నుంచి అపాయింట్‌మెంట్ తేదీ నాటికి సంస్థ కార్యకలాపాలపై అభ్యర్థికి పూర్తి అవగాహన లభిస్తుంది.
స్టార్టప్స్‌పై ఆసక్తి.. సీటీసీపై అనురక్తి
ఐఐటీ-చెన్నైలో దాదాపు పది మంది విద్యార్థులు సొంత స్టార్టప్స్‌పై ఆసక్తితో సమ్మర్ ఇంటర్న్స్ వచ్చినా వదులుకున్నారు. ఈసారి నియామకాల్లో కనిపిస్తున్న మరో కోణం.. సీటీసీకి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వడం. గతంలో చాలా మంది విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా అడుగులు వేయగా.. ఈసారి మాత్రం సీటీసీ (పే ప్యాకేజ్)లను ప్రధాన ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం.
ఆఫర్లు.. ఆశాజనకం
ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరించుకోవడంతోపాటు, ఫ్రెష్ టాలెంట్‌వైపు మొగ్గు చూపడమే దీనికి కారణం. బిట్స్ క్యాంపస్‌లలో రెండు రోజుల్లోనే 2,300 మంది విద్యార్థులకు ఆఫర్లు లభించడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 20 నుంచి 25 శాతం మేర నియామకాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తంలో ఐదు నుంచి పది శాతం వ్యత్యాసం ఉంటుందని భావించినా కూడా గత ఏడాది కంటే ఎక్కువ ఆఫర్లే ఆశించొచ్చు. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో భారీ నియామకాలు జరగడం ఖాయం.
-ప్రొఫెసర్ బాల సుబ్రమణియన్, చీఫ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్, బిట్స్-పిలానీ
అన్ని విభాగాల్లోనూ పెరిగిన అవకాశాలు
ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో అన్ని విభాగాల్లోనూ అవకాశాల సంఖ్య పెరిగింది. ఐటీ, కోర్ అనే కాకుండా ఇతర ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్‌ల విద్యార్థులకు కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. నిట్ వరంగల్‌లో బయోటెక్నాలజీ బ్రాంచ్‌కు చెందిన 45 మందికి, కెమికల్ విభాగంలో 29 మందికి ఆఫర్లు లభించడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. ఇక.. పే ప్యాకేజ్‌ల పరంగా ఈ ఏడాది దేశీయంగా పే ప్యాకేజ్‌లు రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షలు.. అంతర్జాతీయంగా పే ప్యాకేజ్‌లు రూ.50 లక్షల నుంచి రూ. కోటి అందే అవకాశముంది.
-ప్రొఫెసర్ రవి కుమార్, డెరైక్టర్-ప్లేస్‌మెంట్ సెల్, నిట్ - వరంగల్
ఔట్‌సోర్సింగ్, విస్తరణ విధానాలే కారణాలు
ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ పురోగమన దశలో పయనిస్తున్నాయి. దీనికి కారణం ఈ సంస్థల ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాలు, కోర్ బిజినెస్ విస్తరణ విధానాలే కారణాలు. సంస్థలు అభ్యర్థుల నుంచి ముఖ్యంగా కోరుకునే స్కిల్స్.. కమ్యూనికేషన్, ఇంటర్ కల్చరల్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్. వీటిని పెంచుకుంటే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విజయం సాధించడం సులభమే.
- పీఎస్‌ఆర్‌పీ కిరణ్, సీనియర్ మేనేజర్, టాలెంట్ ఎక్విజిషన్ విప్రో టెక్నాలజీస్
కంపెనీల రిక్రూట్‌మెంట్ జోష్..క్యాంపస్‌లకు పోదాం చలో చలో..
Published Sun, Oct 19 2014 11:11 PM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM
Advertisement
Advertisement