శాతవాహ న యూనివర్సిటీ:
ఉన్నత విద్య అభ్యసించి, మంచి ఉద్యోగం సంపాదించి భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలనుకొనే విద్యార్థుల ఆశలతో కొన్ని కళాశాలలు చెలగాటమాడుతున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ విధానం విపరీతమైన ప్రాచుర్యం పొందడంతో ప్రస్తుతం అన్ని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌ను కాసుల మేళాగా మార్చుకుంటున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అంటే ఉద్యోగం కోసమే అనే మాటను అనేక కళాశాలలు మార్చేశాయి.
క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేయడమే ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నాయి. తమ ప్రచారం కోసం, అడ్మిషన్‌లు పెంచుకోవడానికి ఈ దీనిని ఒక అవకాశంగా వినియోగించుకుంటున్నాయి. మరోవైపు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు విద్యార్థుల పాలిట ఎండమావిలా తయారయ్యాయి. చదువు కొనసాగిస్తున్న సమయంలోనే ఉద్యోగం తమను వెతుక్కుంటూ వస్తుందన్న ఆశలతో వారు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు హాజరవుతున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, పేరుమోసిన కంపెనీల్లో ఉద్యోగం అవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ కష్టాలు గట్టెక్కినట్లేనని భావిస్తున్నారు. తీరా ఇంటర్వ్యూలకు హాజరై, ఉద్యోగాల్లో చేరితే గానీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు మేడిపండు చందమేననే చేదు నిజం తెలియడం లేదు.
ఆర్భాటం ఎక్కువ.. అంతా డొల్ల
జిల్లాలోని చాలా కళాశాలల్లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో వారు చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఎంపిక కోసం హైదరాబాద్, ముంబయి. బెంగళూర్‌లలోని అనేక ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని, ఐదు వందల వర కు పోస్టులున్నాయని ఆర్భాటంగా ప్రకటనలు, ప్రచారాలు చేసి కళాశాలలు విద్యార్థులకు గాలం వేస్తున్నాయి.
క్యాంపస్ మేళాకు వచ్చేసరికి కంపెనీ పేరును బూతద్దం పెట్టి వెతికినా ప్రముఖ కంపెనీల జాబితాలో కనిపించకపోవడంతో విద్యార్థులు మోసపోయామని గొల్లుమంటున్నారు. పైగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లలో అధికంగా ఇప్పిస్తున్న ఉద్యోగాలను చూస్తే కాల్‌సెంటర్‌లలో చిన్నచిన్న ఉద్యోగాలు మాత్రమే ఉంటున్నాయి. ఇవన్నీ చూస్తే రిక్రూట్‌మెంట్‌లో ఆర్భాటం ఎక్కువ.. అంతా డొల్ల అనే విమర్శలు వస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ పేరుతో ఫీజులు వసూలు
ఏ కళాశాలలో రిక్రూట్‌మెంట్ అయినా కళాశాలల ప్రచారార్భాటంతో ఒక్కో మేళాకు దాదాపు వేలాది మందికి విద్యార్థులు హాజరవుతున్నారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వస్తున్నారు. క్యాంపస్ మేళాకు హాజరయ్యే ప్రతి విద్యార్థి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు రిజిస్ట్రేషన్ ఫీజు రూపేణా కళాశాలలు వసూలు చేస్తున్నాయి. ఉద్యోగం వచ్చినా రాకపోయినా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండడతో ఒక్క మేళా నిర్వహిస్తే రూ.లక్ష నుంచి రూ.2లక్షల దాకా గిట్టుబాటవుతున్నాయి. కంపెనీలను నగరాల నుంచి తీసుకురావడానికి కళాశాలలు దళారులను వాడుకుంటూ వారికి కొంత కమీషన్ చెల్లిస్తున్నాయి.
అటు రాయితీలు..
ఇటు మోసాలు..
పలు కంపెనీలు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రాయితీలు, సెజ్‌ల పేరిట నామమాత్రపు ధరలకే ప్రభుత్వ భూములు పొందుతుంటాయి. ప్రభుత్వం నుంచి ఇలాంటి సదుపాయాలు అందుకుంటున్నందున కొంతమంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటామని సదరు కంపెనీలు సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. అందులో భాగంగానే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నాయి.
కంపెనీ ఒప్పందంలో పేర్కొన్నామనే కారణంతో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లకు వస్తున్న చాలా కంపెనీలు తమకు కావాల్సిన అర్హతలు సదరు విద్యార్థుల వద్ద లేవనే సాకుతో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అడ్మిషన్‌లు పెంచుకోవడానికి కళాశాలలు, తూతూమంత్రంగా కంపెనీలు, డబ్బులు దండుకోవడానికి దళారులు నిర్వహిస్తున్న క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో చివరకు విద్యార్థులు మోసపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగానికి ఎంపికైన వారి నుంచే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయాలని, మొదటి జీతం పేరిట కోతలు పెట్టడం ఆపాలని, మోసాలను అరికట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కళాశాలల యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోకుండా విద్యార్థులు చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు కంపెనీ వారికే వెళ్తుందని, దానిలో విద్యాసంస్థలకు వచ్చేది లేదని నమ్మబలకడమే కాకుండా, విద్యార్థులకు ఉద్యోగాలను అందించడానికి అనేక రకాల వ్యయప్రయసాలు ఎదుర్కొంటున్నామని మొసలికన్నీరు కార్చుతున్నాయి. అందుకే అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త.
కాసుల మేళా
Published Fri, Dec 12 2014 1:38 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM
Advertisement