ఇంటర్ తర్వాత.. ఉజ్వల భవితకు 24ఎంట్రెన్స్‌లు
విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ ఇంటర్మీడియెట్. కెరీర్‌కు పునాది పడేది ఇక్కడే. దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ను పూర్తిచేసుకొని ఉన్నత విద్య దిశగా అడుగులేస్తున్నారు. మన రాష్ట్రంలో వీరి సంఖ్య దాదాపు 10 లక్షలు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి లెక్కలేనన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, బీడీఎస్, బీఫార్మసీ, ఫార్మ్‌డీ, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫిషరీసైన్స్, బీఆర్క్, హోటల్ మేనేజ్‌మెంట్, లా వంటి కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ప్రవేశపరీక్షలనే మైలురాళ్లను దాటాలి. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత.. ముఖ్యమైన ప్రవేశపరీక్షలను తెలుసుకుందాం.
ఎయిమ్స్ - న్యూఢిల్లీ
1956లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచింది. దీనికి న్యూఢిల్లీలో ప్రధాన క్యాంపస్ ఉంది. ఈ ఏడాది నుంచి కొత్తగా మరో ఆరు ఎయిమ్స్‌ల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అవి.. పాట్నా (బీహార్), భోపాల్ (మధ్యప్రదేశ్), జోధ్‌పూర్ (రాజస్థాన్), రిషికేశ్ (ఉత్తరాఖండ్), భువనేశ్వర్ (ఒడిశా), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్). వీటిల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం సీట్లు: ఎయిమ్స్ - ఢిల్లీలో 72, మిగిలినవాటిలో ఒక్కోదానిలో 100 చొప్పున సీట్లుంటాయి.
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
పరీక్ష విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహిస్తారు. మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో అడుగుతారు. ఫిజిక్స్ (60 ప్రశ్నలు), కెమిస్ట్రీ (60 ప్రశ్నలు), బయాలజీ (బోటనీ అండ్ జువాలజీ 60 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ (20)లపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. అదేవిధంగా తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో ప్రశ్నకు సరైన సమాధానాలకిచ్చే మార్కుల్లోంచి 1/3 మార్కులను తగ్గిస్తారు.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా..
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
పరీక్ష తేదీ: జూన్ 1, 2014, వెబ్‌సైట్: www.aiims.edu