విక్రయాల్లో మారుతి హవా
ముంబై: దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతు సుజుకి దేశీయ అమ్మకాల్లో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆటో దిగ్గజం మారుతీ వాహనాల అమ్మకాల్లో మరోసారి తన హవాను చాటుకుంది. నవంబర్ మాసానికిగాను కార్ల విక్రయంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశంలో డీమానిటైజేషన్ నేపథ్యంలో కూడా దేశీయ మార్కెట్లో నవంబరులో మినీ (ఆల్టో, వ్యాగన్ఆర్) , కాంపాక్ట్ (స్విఫ్ట్, బాలెనో మరియు డిజైర్) విభాగంలో భారీ అమ్మకాలను సాధించింది.
మొత్తం అమ్మకాల్లో 12.2 శాతం వృద్ధితో 1.35 లక్షల యూనిట్లను విక్రయించింది. దేశీయ అమ్మకాలు మరింత అధికంగా 14 శాతం పెరిగాయి. 1.26 లక్షల వాహనాలను అమ్మింది.అయితే ఎగుమతులు మాత్రం 10 శాతం(9.8) క్షీణించాయి.గత ఏడాది 10,225 యూనిట్లను ఎగుమతి చేయగా ఈ ఏడాది కేవలం 9,225 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేయగలిగింది.దీంతో ఆరంభంలో లో మారుతీ సుజుకీ షేరు 0.43 శాతం బలపడినా ప్రస్తుతం 0.19 నష్టాల్లో కొనసాగుతోంది.
కాగా దీపావళి సీజన్ తరువాత రీటైల్ డీలర్ల అమ్మకాలు స్వల్పంగా ప్రభావితమైనప్పటికీ మొత్తం అమ్మకాలు పెరిగాయి. దేశీయ మార్కెట్ లో 47శాతం వాటా ను ఆక్రమించిన మారుతి పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులతో ఒప్పందం చేసుకుని 100 శాతం ఫైనాన్స్ సదుపాయంతో కార్లను అందిస్తోంది.