సీతమ్మను కలుద్దాం: టీడీపీ నాయకులు
తాడేపల్లిగూడెం తెలుగుతమ్ముళ్ల ఆలోచన
మిత్రపక్ష నేతల మధ్య సయోధ్యకు యత్నం
ఐదుగురు సభ్యులతో కమిటీ !
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి, దాని మిత్రపక్షం భారతీయజనతా పార్టీకి పొసగడం లేదు. ఆ పార్టీల్లోని పెద్ద నేతల మధ్య సమన్వయం లోపించింది. ఇది కిందస్థాయి శ్రేణులకు ఇది తలనొప్పిగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఫలితంగా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తెలుగుతమ్ముళ్లు యత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికోసం ఓ ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని వేసినట్టు తెలిసింది.
నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మంత్రి మాణిక్యాలరావుకు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మధ్య మాటలులేనట్టుగా కనపడుతోంది. మంత్రి, మున్సిపల్ చైర్మన్ల బంధం కూడా బలహీనంగానే ఉంది. మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు వెళితే తెలుగుదేశం పార్టీ నేతలు హాజరుకావడం లేదు. కనీసం సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా వెళ్లడం లేదు. పట్టణంలోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి తన పని తాను చేసుకుని వెళ్తుండగా, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు వారి పనులు వారు చేసుకుంటున్నారు.
ఎవరికి వారే యమునా తీరేలా ఉండడంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోంది. పాలన కూడా సవ్యంగా సాగడం లేదు. టీడీపీ, బీజేపీ మధ్యే కాకుండా తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఫలితంగా ఆ పార్టీలోని నేతల మధ్య కూడా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తను ఇంతవరకు నియమించలేదు. ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే ఈలి నాని తాత్కాలికంగా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో హవా ఉన్నవారే హల్చల్ చేస్తున్నారు. ఈ పరిస్థితులను తెలుగుతమ్ముళ్లు కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి, జడ్పీచైర్మన్ల మధ్య కొరవడిన సమన్వయాన్ని చక్కదిద్దేందుకు యత్నించాలని టీడీపీ నాయకులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో నియోజకవర్గంలోని పట్టణంతోపాటు తాడేపల్లి గూడెం, పెంటపాడు మండలాలకు చెందిన ఐదుగురితో ఓ సమన్వయకమిటీ బృందాన్ని వేసి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని కలువనున్నారని పార్టీ వర్గాల సమాచారం. సీతమ్మ వద్ద పంచాయితీ పెట్టి ఆ తర్వాత ఆమె సూచనల మేరకు అవసరమైతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును కూడా కలవాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ గాడిలో పడాలంటే, మిత్రపక్షంతో సక్యతగా ముందుకెళితేనే మేలనే ఆలోచనలో టీడీపీ శ్రేణులున్నట్టు సమాచారం.