ఇదీ స్వచ్ఛభారతం!
పాతచీరలే ‘మరుగు’కు దిక్కు!!
బూర్జ: వ్యక్తిగత మరుగుదొడ్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని, స్వచ్ఛభారత్‌కు పాటుపడుతున్నామని ప్రభుత్వాలు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ ఆచరణలో అమలు కావటంలేదనే దానికి ఉదాహరణ ఈ చిత్రం. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాక శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ యాతవీధి వాసుల వెతలు అంతాఇంతా కాదు.
ఈ గ్రామంలో 2000 గృహాలు ఉండగా.. కేవలం 180 మరుగుదొడ్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 15 వరకూ పనులు ప్రారంభించినప్పటికీ.. బిల్లులు కాకపోవడంతో వాటిని కూడా అర్ధంతరంగా వదిలేశారు. మరికొంతమంది మరుగుదొడ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదు.
దీంతో గ్రామంలో చాలామంది పాత చీరలతో స్నానాల గది, మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. మరుగుదొడ్లను కట్టుకోవాలని ఆసక్తి ఉన్నా.. మంజూరు కాకపోవడం, ఒకవేళ మంజూరై పనులు చేపట్టినా బిల్లులు కాక ఇక్కట్లు తప్పట్లేదని గ్రామస్తులు వాపోతున్నారు.