చెల్సీ జట్టును అధిగమిస్తాం
హ్యారీ కేన్ ఇంటర్వూ
ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) టైటిల్ రేసులో చెల్సీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టోటెన్హామ్ హాట్స్పర్ నేడు (శనివారం) లివర్‌పూల్‌తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ స్ట్రయికర్ హ్యారీ కేన్ మరోసారి రాణించి జట్టుకు అండగా నిలుస్తాడని భావిస్తోంది. ఇప్పటికే అతను ఈ సీజన్లో 16 గోల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న హాట్స్పర్ మరో విజయంతో చెల్సీపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది.
లివర్‌పూల్‌తో ఈ మ్యాచ్ మీకు ఎంత కీలకంగా భావిస్తున్నారు?
ఈపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెల్సీకి మాకు తొమ్మిది పాయిట్ల తేడా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి దీన్ని మరింత తగ్గించి వారిపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాం. మేం వారిని అందుకోవాలంటే ఈ మ్యాచ్ కీలకమే.
ఇది జరుగుతుందని మీరు భావిస్తున్నారా?
మా ప్రయత్నం మేం చేస్తాం. కొన్ని పాయింట్లు వారు కోల్పోతారని ఆశిస్తున్నాం. లివర్‌పూల్ జట్టు హల్, అర్సెనల్, వాట్ఫోర్ట్ల చేతిలో ఓడింది. ఇది ఎవరు ఊహించారు? అందుకే ఎలాంటి అవకాశాన్ని కూడా మేం కోల్పోం. వారిని అందుకోవడం సాధ్యమే.
ఇక లివర్‌పూల్ మీకు ఎలాంటి పోటీ ఇస్తుందనుకుంటున్నారు?
మా చివరి మ్యాచ్ మిడిల్స్బరోలా కాకుండా ఇది మరింత పోటాపోటీగా ఉండనుంది. ఆ జట్టులో నాణ్యమైన అటాకింగ్ ఆటగాళ్లున్నారు. వారితో ప్రమాదమే. మేం కూడా మా శక్తిసామర్థ్యాల మేరకు ఆడగలిగితే విజయం సులభంగానే లభిస్తుంది.
టోటెన్హామ్తో ఒప్పందం కుదుర్చుకున్నాక జట్టుకు కీలకంగా మారారు. మున్ముందు ఇదే జట్టుతో కొనసాగాలనుకుంటున్నారా?
కొత్తగా ఏదైనా చేయడానికి ఇది మంచి చోటని భావిస్తున్నాను. ప్రపంచ అత్యుత్తమ మేనేజర్లలో ఒకరు మాతో ఉన్నారు. అలాగే త్వరలోనే మాకు కొత్త స్టేడియం రాబోతోంది. భవిష్యత్ చాలా బాగుండే అవకాశం ఉంది. ఈ క్లబ్‌కు ఆడుతున్నందుకు సంతోషంగా ఉన్నాను. అలాగే చాలా ఏళ్లపాటు ఇక్కడే ఆడాలని కోరుకుంటున్నాను.