బాబు యాత్ర బూటకం
చీరాల, న్యూస్‌లైన్ :టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీమాంధ్రలో చేస్తోంది తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర కాదని, బూటకపు యాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ 2008 అక్టోబర్ 18న ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి విభజనకు సానుకూలమంటూ లేఖ ఇచ్చి రాష్ట్రం ముక్కలు కావడానికి కాంగ్రెస్‌తో కలిసి బాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. తన పదవికి రాజీనామా చేయకుండా సీమాంధ్రలో ప్రజా ఉద్యమాన్ని చూసి పార్టీ తుడిచి పెట్టుకుపోతుందనే భయంతో బాబు బస్సు యాత్ర చేస్తున్నాడని విమర్శించారు.
తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని స్వచ్ఛందంగా ఉద్యమంలోకి రావాలేకానీ స్వార్థ రాజకీయాల కోసం బాబు యాత్రలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. తెలంగాణకు అనుకూలంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహరించారంటూ టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ విడిపోతే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే మరో దేశానికి వెళ్లినట్లు ఉంటుందని వైఎస్ ఆనాడే రాష్ట్ర విభజనను వ్యతిరేకించారని గుర్తు చేశారు. 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ సొంతగా పోటీ చేయడం కూడా అందులో భాగమేనన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మొట్టమొదటి సారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు.
13 జిల్లాల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా పాల్గొంటున్నారని, సీమాంధ్ర ప్రజలు తమ పార్టీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి సీమాంధ్రుల మన్ననలు అందుకున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూడలేకే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు యాత్రలు, దీక్షలు చేపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ మునిగిపోతోందన్న భయంతోనే దీక్షలు చేస్తున్నారన్నారు.
రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, సోనియాగాంధీని నిలదీయాలని ప్రజాప్రతినిధులకు బాలాజీ పిలుపునిచ్చారు. చీరాల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ యడం చినరోశయ్య, అవ్వారు ముసలయ్య, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అమృతపాణిలు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో పోరాడుతోందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టారన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ నిరవధిక నిరాహార దీక్ష చేసి సీమాంధ్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.
వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేసి 48 గంటల పాటు దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో షర్మిల బస్సు యాత్ర చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పీకర్ ఫార్మెట్లో కాకుండా ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చడానికి కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కర్నేటి వెంకటప్రసాద్, పార్టీ పట్టణ కన్వీనర్ యాతం ఆనందరావు, వేటపాలెం మండల కన్వీనర్ పులి వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ సీపీ నాయకులు యడం బాలాజీ, దేటా జోసఫ్, కొరబండి సురేశ్, పారిచర్ల దయమ్మ, డక్కుమళ్ల సురేశ్, మల్లెల బుల్లిబాబు, కర్నేటి రవికుమార్, కొమ్మనబోయిన వీరయ్య, చింతా శ్రీను, కోటి ఆనంద్, పొదిలి ఐస్వామి, విల్సన్, మేడిద రత్నకుమార్, షేక్ ఆజాద్, గంధం చంద్ర, దార్ల శాస్త్రి, మనోహరి, గుడూరి జేమ్స్, శ్రీనివాసరావు, మచ్చా సువార్తరావు, నారాయణ పాల్గొన్నారు.