అనిల్ అంబానీ భారీ డీల్
ముంబై: అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన , టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను బ్రూక్ ఫీల్డ్ కు విక్రయించింది. ఈ మేరకు కెనడా కు చెందిన బ్రూక్‌ఫీల్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఒక ఒప్పందంపై కుదుర్చుకుంది. టవర్ల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో తప్పనిసరి (రెండు వైపులా బైండింగ్) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం తెలియజేసింది. దీంతో బ్రూక్‌ఫీల్డ్ నుంచి ముందస్తు చెల్లింపుగా రూ. 11,000 కోట్లను అందుకోనున్నట్లు వెల్లడించింది. ఈ బైండింగ్ ఒప్పందం ప్రకారం టవర్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఈ తాజా ఒప్పందం ద్వారా తన రుణ భారాన్ని తగ్గించుకోనుంది.
మరోవైపు అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన మరో సంస్థ రిలయన్స్ కేపిటల్ కూడా నిధుల సమీకరణ చేపట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది.హోమ్ ఫైనాన్స్ ద్వారా అన్సెక్యూర్డ్ ఎన్సీడీల జారీ ద్వారా రూ, 1,000 కోట్లను(14.7 మిలియన్ డాలర్లు) సమీకరించనున్నట్లు తెలిపింది.
కాగా ఆర్ కాం మొబైల్ టవర్ వ్యాపార వాటా విక్రయానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చివరికి కెనడా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మార్కెట్లో ఆర్‌కామ్ షేరు దాదాపు 8 శాతానిపై దూసుకెళ్లింది.