Town police
-
నవ దంపతుల ఆత్మహత్య
వారికి రెండు నెలల క్రితమే వివాహమైంది. అన్యోన్యంగా ఉంటున్నారు. ఎవరికీ చెప్పుకోలేని ఏ కష్టమొచ్చిందో ఏమో తెలియదు. కలకాలం కలిసి ఉండాలనుకున్నవారు కలిసి తనువు చాలించాలనుకున్నారు. ఇద్దరూ ఒకేసారి ఉరి బిగించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. క్రైం కడప (అర్బన్): కడప నగరం మట్టిపెద్దపులి వీధిలో నివాసముంటున్న నవదంపతులు శనివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. టూ టౌన్ పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరంలోని నాగరాజుపేటకు చెందిన ఫర్హానా (25) అనే యువతికి శివలింగంబీడి వీధికి చెందిన పఠాన్ ఖాజా నవాజ్‌ఖాన్ (30) అనే వ్యక్తితో రెండు నెలల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. మట్టి పెద్దపులివీధి మెయిన్‌రోడ్డు ప్రక్కన ఉన్న ఓ ఇంటిలో మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. ఖాజా నవాజ్‌ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. శనివారం ఉదయం భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఫర్హానా అక్క ఫోన్లో మాట్లాడి సాయంత్రం తన ఇంటికి తీసుకు వెళతానని చెప్పింది. అంతలోపు మూడు గంటల ప్రాంతంలో ఫర్హానా సోదరుడు చాంద్‌బాషా వీరి ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టగా ఇంట్లో నుంచి వారు ఎంతసేపటికీ బయటికి రాలేదు. దీంతో అతను కిటికీలో నుంచి గమనించాడు. అక్క, బావ ఇద్దరూ చీరెతో ఉరేసుకుని వేలాడుతుండటాన్ని గమనించి బంధువులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐ ఎస్కే రోషన్, తమ సిబ్బందితో చేరుకున్నారు. ఒకే చీరకు ఉరేసుకుని .. సంఘటన స్థలంలో ఫర్హానా, ఆమె భర్త పఠాన్ ఖాజా నవాజ్ఖాన్లు ఇరువురు చీరతో ఒకేసారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు, స్థానికులు, బంధువులు అంచనాకు వచ్చారు. మృతదేహాలు రెండూ అలాగే ఒకదానికొకటి పెనవేసుకుని ఉండటాన్ని చూసి కలిసి ఉండాలనుకున్నవారు కలిసే బలవన్మరణానికి పాల్పడ్డారంటూ ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వీరి మరణానికి స్పష్టమైన కారణాన్ని అటు బంధువులుగానీ, ఇటు పోలీసులుగానీ చెప్పలేకపోతుండటం గమనార్హం. -
పరిషత్ పోలింగ్ 77.14 %
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు స్వల్వ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడతగా 18 మండలాల్లోని 18 జడ్పీటీసీ, 289 ఎం పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ 77.14 శాతం నమోదైంది. పోలింగ్ సరళి ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం వరకు నిదానంగా సాగింది. మొదటి రెండు గంటలలో ఉదయం9 గంటలకు 14.19 శాతం, ఉదయం 11 గంటలకు 33.18 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.15 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 66.32 శాతంగా నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 18 మండలాలలో కలిపి 77.14 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని మండలాల్లో ఓటర్లు ఎండ తీవ్రతను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరగా, మరి కొన్ని చోట్ల అంతగా బయటకు రాలేకపోయారు. బిచ్కుంద, బోధన్, నిజాంసాగర్, రెంజల్, బీర్కూర్, ఎడపల్లి మండలాల్లో అత్యధికంగా 80 నుంచి 83 శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. బాన్సువాడ, డిచ్పల్లి, మండలాల్లో 71.50 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 7,28,809 మంది ఓటర్లలో 5,62,199 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆకుల కొండూర్‌లో పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ శనివారం అర్ధరాత్రి నిజామాబాద్ మండలం ఆకుల కొండూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబ్బులు పంచుతున్నారనే సమాచారం మేరకు రూరల్ టౌన్ పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గుంపులుగా ఉన్న గ్రామస్తులను లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఆగ్రహించిన గ్రామ సర్పంచ్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అతనిపైనా చేయి చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీసులతో ఘర్షణకు దిగారు. అక్కడున్న పోలీసు వాహనానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. పోలింగ్ బూత్‌లోని ఎన్నికల ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ తరుణ్ జోషి వివరాలు తెలుసుకున్నారు. కాగా గ్రామ సర్పంచ్‌తో పాటు, పలువురు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు మండలాలలో స్వల్ప ఉద్రిక్తత పోలింగ్ రోజు కొన్ని మండలాలలో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో ఓటర్లపై పోలీసులు చేయి చేసుకున్నందుకు గ్రామస్తులు ఆందోళన చేశారు. జక్రాన్‌పల్లి మండలం కేశ్పల్లిలో ఓటర్లను ఆటోలో పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్లను అక్కడున్న పోలీసులు చితకబాదారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు లేనందుకు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.బీర్కూర్ మండలం కిష్టాపూర్‌లో ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ హోం గార్డు కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ సరళిని పరిశీలించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న డిచ్పల్లి, బోర్గాం, మంచిప్ప, మోపాల్ తదితర గ్రామాలను సందర్శించారు. ఎన్నికల పరిశీలకులు భారతీ లక్పతి నాయక్ బాన్సువాడ, బిచ్కుంద, వర్ని తదితర మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషి, బోధన్ సబ్ కలెక్టర్ హరినారాయణన్, ఆయా డివిజన్ల ఆర్డీఓలు, డీఎస్పీలు కూడా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఓటేసిన ప్రముఖులు... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంపూర్‌లో ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకోగా, మద్నూర్‌లో ఎమ్మెల్సీ రాజేశ్వర్, నవీపేట మండలం పోతంగల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు వేశారు. -
ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ఇసుకను అక్రమంగా తరలిస్తూ కాసుల పంట పండించుకుంటున్న మాఫీయాపై వన్ టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 12 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు. ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన ‘ఇసుక మాఫియా ఇష్టారాజ్యం’ కథనంపై వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఉదయం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్రాక్టర్లను పట్టుకుని, వాటిని సీజ్ చేశారు. తర్వాత అనంతపురం చెరువులో ఇసుక తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి విలేకరులను వెంటబెట్టుకుని వెళ్లి దాడులు చేశారు. ఈ సందర్భంగా రెండు ట్రాక్టర్లను వదిలి పెట్టి వాటి యజమానులు ఉడాయించారు. వాటిని స్టేషన్‌కు తరలించేందుకు తాళాలు లేకపోవడంతో అక్కడే ఉన్న మరో వ్యక్తికి వాటిని చూస్తుండాలని చెప్పి, పట్టుబడ్డ ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. తవ్వకాల ప్రాంతంలో ఉన్న రెండు ట్రాక్టర్లను తీసుకొచ్చేందుకు పోలీసులు వెళ్లగా అప్పటికే అవి అక్కడి నుంచి మాయమయ్యాయి. తనను భయపెట్టి ట్రాక్టర్లు తీసుకెళ్లినట్లు బాధితుడు చెప్పడంతో, తీసుకెళ్లిన వారిపై చోరీ కేసులు నమోదు చేస్తామని సీఐ మాధవ్ చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు ‘అనంత’ అడ్డాగా మారింది : సీఐ గోరంట్ల మాధవ్ ఈ సందర్భంగా ఇసుక తవ్వకాల ప్రాంతంలో సీఐ మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాకు అనంతపురం అడ్డాగా మారిందని, ఇష్టారాజ్యంగా పక్క రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అనంతపురం చెరువులో ఇసుక మాఫీయా జేసీబీలతో ఇసుకను తవ్వుతోందని సమాచారం అందడంతో దాడులు చేశామన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు నుంచే ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ట్రాక్టర్ల రాక పోకలను గుర్తించి వాటిని మఫ్టీల్లో వెంబడించామని, తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ఇసుక మాఫీయా సభ్యులు పరారయ్యే ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే తాము, సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నామన్నారు. లోయలను తలపించే రీతిలో అనంతపురం చెరువును తవ్వేశారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాటిలో కొంతమంది కూలీలు పడి చనిపోయిన ఘటనలున్నాయని కూలీల ద్వారా తెలిసిందని చెప్పారు. తవ్వకాలు తమ పరిధిలో లేకున్నా...ఇసుక తరలింపు తమ పరిధిలో సాగుతుండటంతో స్పందించామన్నారు. ఇకపై వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.