వారికి రెండు నెలల క్రితమే వివాహమైంది. అన్యోన్యంగా ఉంటున్నారు. ఎవరికీ చెప్పుకోలేని ఏ కష్టమొచ్చిందో ఏమో తెలియదు. కలకాలం కలిసి ఉండాలనుకున్నవారు కలిసి తనువు చాలించాలనుకున్నారు. ఇద్దరూ ఒకేసారి ఉరి బిగించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
క్రైం కడప (అర్బన్): కడప నగరం మట్టిపెద్దపులి వీధిలో నివాసముంటున్న నవదంపతులు శనివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. టూ టౌన్ పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరంలోని నాగరాజుపేటకు చెందిన ఫర్హానా (25) అనే యువతికి శివలింగంబీడి వీధికి చెందిన పఠాన్ ఖాజా నవాజ్‌ఖాన్ (30) అనే వ్యక్తితో రెండు నెలల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. మట్టి పెద్దపులివీధి మెయిన్‌రోడ్డు ప్రక్కన ఉన్న ఓ ఇంటిలో మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. ఖాజా నవాజ్‌ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.
శనివారం ఉదయం భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఫర్హానా అక్క ఫోన్‌లో మాట్లాడి సాయంత్రం తన ఇంటికి తీసుకు వెళతానని చెప్పింది. అంతలోపు మూడు గంటల ప్రాంతంలో ఫర్హానా సోదరుడు చాంద్‌బాషా వీరి ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టగా ఇంట్లో నుంచి వారు ఎంతసేపటికీ బయటికి రాలేదు. దీంతో అతను కిటికీలో నుంచి గమనించాడు. అక్క, బావ ఇద్దరూ చీరెతో ఉరేసుకుని వేలాడుతుండటాన్ని గమనించి బంధువులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్‌ఐ ఎస్‌కే రోషన్, తమ సిబ్బందితో చేరుకున్నారు.
ఒకే చీరకు ఉరేసుకుని ..
సంఘటన స్థలంలో ఫర్హానా, ఆమె భర్త పఠాన్ ఖాజా నవాజ్‌ఖాన్‌లు ఇరువురు చీరతో ఒకేసారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు, స్థానికులు, బంధువులు అంచనాకు వచ్చారు.
మృతదేహాలు రెండూ అలాగే ఒకదానికొకటి పెనవేసుకుని ఉండటాన్ని చూసి కలిసి ఉండాలనుకున్నవారు కలిసే బలవన్మరణానికి పాల్పడ్డారంటూ ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వీరి మరణానికి స్పష్టమైన కారణాన్ని అటు బంధువులుగానీ, ఇటు పోలీసులుగానీ చెప్పలేకపోతుండటం గమనార్హం.
నవ దంపతుల ఆత్మహత్య
Published Sun, Feb 22 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement