అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ఇసుకను అక్రమంగా తరలిస్తూ కాసుల పంట పండించుకుంటున్న మాఫీయాపై వన్ టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 12 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు. ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన ‘ఇసుక మాఫియా ఇష్టారాజ్యం’ కథనంపై వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఉదయం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్రాక్టర్లను పట్టుకుని, వాటిని సీజ్ చేశారు.
తర్వాత అనంతపురం చెరువులో ఇసుక తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి విలేకరులను వెంటబెట్టుకుని వెళ్లి దాడులు చేశారు. ఈ సందర్భంగా రెండు ట్రాక్టర్లను వదిలి పెట్టి వాటి యజమానులు ఉడాయించారు. వాటిని స్టేషన్‌కు తరలించేందుకు తాళాలు లేకపోవడంతో అక్కడే ఉన్న మరో వ్యక్తికి వాటిని చూస్తుండాలని చెప్పి, పట్టుబడ్డ ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. తవ్వకాల ప్రాంతంలో ఉన్న రెండు ట్రాక్టర్లను తీసుకొచ్చేందుకు పోలీసులు వెళ్లగా అప్పటికే అవి అక్కడి నుంచి మాయమయ్యాయి. తనను భయపెట్టి ట్రాక్టర్లు తీసుకెళ్లినట్లు బాధితుడు చెప్పడంతో, తీసుకెళ్లిన వారిపై చోరీ కేసులు నమోదు చేస్తామని సీఐ మాధవ్ చెప్పారు.
ఇసుక అక్రమ రవాణాకు ‘అనంత’ అడ్డాగా మారింది : సీఐ గోరంట్ల మాధవ్
ఈ సందర్భంగా ఇసుక తవ్వకాల ప్రాంతంలో సీఐ మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాకు అనంతపురం అడ్డాగా మారిందని, ఇష్టారాజ్యంగా పక్క రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అనంతపురం చెరువులో ఇసుక మాఫీయా జేసీబీలతో ఇసుకను తవ్వుతోందని సమాచారం అందడంతో దాడులు చేశామన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు నుంచే ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.
ట్రాక్టర్‌ల రాక పోకలను గుర్తించి వాటిని మఫ్టీల్లో వెంబడించామని, తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ఇసుక మాఫీయా సభ్యులు పరారయ్యే ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే తాము, సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నామన్నారు. లోయలను తలపించే రీతిలో అనంతపురం చెరువును తవ్వేశారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాటిలో కొంతమంది కూలీలు పడి చనిపోయిన ఘటనలున్నాయని కూలీల ద్వారా తెలిసిందని చెప్పారు. తవ్వకాలు తమ పరిధిలో లేకున్నా...ఇసుక తరలింపు తమ పరిధిలో సాగుతుండటంతో స్పందించామన్నారు. ఇకపై వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.