అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : ‘అనంత’లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. నిబంధనలకు పాతరేసి.. ఇసుకదిన్నెలను తవ్వేసి.. యథేచ్ఛగా కర్ణాటకకు రవాణా చేస్తూ కాసులు దండుకుంటోంది. ఓ మంత్రి అండ చూసుకుని పేట్రేగిపోతోంది. తమ బిజినెస్ సాఫీగా సాగడానికి అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు.. కాదు కూడదని అంటే వారిని బెదిరిస్తున్నారు. గనులు, భూగర్భ శాఖ అధికారుల అంచనా ప్రకారం రోజుకు రూ.కోటికి పైగా ఇసుక వ్యాపారం జరుగుతోంది. 2007 నుంచి ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమార్కులపై 2876 కేసులు నమోదు చేయగా.. రూ.2.14 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసినట్లు భూగర్భ జల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇసుక త వ్వకాలకు ఇవీ నిబంధనలు..
వాల్టా చట్టం ప్రకారం అన్ని నిబంధనలకూ లోబడి ఇసుక రీచ్‌లను అప్పగించాలి. దీని కోసం ముందుగా గనులు, రెవెన్యూ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ, భూగర్భ జల, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా సర్వే చేయాలి. ఆయా శాఖలు నివేదించిన ప్రకారం అన్ని అనుమతులతో రీచ్‌లకు వేలం నిర్వహించాలి. ముందుగా గనుల శాఖ సర్వే చేసి రీచ్‌లో ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించాలి. ఒక మీటరు తవ్వితే ఎలాంటి సమస్యా ఉండదని ధ్రువీకరించాలి. నీటి పారుదల శాఖ పరిశీలన జరిపి నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు లేవని నమోదు చేయాలి. భూగర్భ జల శాఖ పరిశీలన జరిపి ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలకు ఎలాంటి అవరోధం లేదనే ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంది. కనీసం 10 మీటర్ల వరకు భూగర్భ జలాలు ఉంటేనే అనుమతించాల్సి ఉంటుంది. క్వారీల వల్ల రహదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని పంచాయత్‌రాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలు ధ్రువీకరించాలి. ప్రధానంగా పర్యావరణ అనుమతులు కీలకం. కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ విభాగాలు పరిశీలన జరగాలి. పరిసర గ్రామాల ప్రజల అనుమతులు ఉండాలి. పంచాయతీ అనుమతి తీసుకుని ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ఇవన్నీ పూర్తయితే నోటిఫికేషన్ జారీ చేసి లాటరీ పద్ధతిలో ఇసుక రీచ్‌లను అప్పగిస్తారు. నిబంధనల ప్రకారం ఒక మీటరు లోతు మాత్రమే తవ్వాలి. యంత్రాలను వినియోగించకూడదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలి.
జరుగుతున్నది ఇదీ..: జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నా.. తవ్వకానికి అధికారిక అనుమతులు లేవు. గతంలో గనుల శాఖ పర్యవేక్షణలో ఉంటే.. ప్రస్తుతం పర్యవేక్షణ బాధ్యతలు డ్వామాకు మార్చారు. దీంతో తమకు అడ్డూ అదుపూ లేదన్నట్లుగా ఇసుకాసురులు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. తాడిపత్రి, కదిరి, పెద్దపప్పూరు, ఉల్లికల్లు, హిందూపురం, తాడిమర్రి ప్రాంతాల్లో ఇసుకను తోడేస్తున్నారు.
కర్ణాటకలో ఇసుకకు మంచి డిమాండ్ ఉండటంతో.. అడ్డదారులు తొక్కుతున్నారు. చీకటి మాటున రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. రాజకీయ అండ.. పలుకుబడి పెట్టుబడిగా సహజ సంపదను కొల్లగొడుతున్నారు. అదేమని అధికారులు అడ్డుపడితే.. దాడులు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాలకు వెళ్లాలంటే అధికారులు సాహసించడం లేదు. రోజుకు 22 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇసుకాసురులు తోడేస్తున్నట్లు భూగర్భశాఖ అధికారుల చెబుతున్నారు.
ట్రాక్టరు రూ.4 వేలు.. లారీ రూ.40 వేలు : ఇసుకాసురులు హిందూపురం సమీపంలోని పెన్నానది, శింగమనమల నియోజకవర్గంలోని ఉలికల్లు నుంచి రాత్రిళ్లు నిరంతరాయంగా ఇసుకను కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి ట్రాక్టర్లలో తరలించి.. అక్కడ నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి కర్ణాటకకు లారీల్లో తీసుకెళ్తున్నారు. కర్ణాటకలో 14 టన్నుల లారీ ఇసుక రూ.35 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. హిందూపురం నుంచే రోజుకు కనీసం 40 లారీల ఇసుక తరలుతోందంటే ఆశ్యర్యం కలగకమానదు. ఓ మంత్రి అనుచరులు మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎవరయినా అధికారులు ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటే.. సదరు నేత వెంటనే రంగంలోకి దిగి వ్యవహారం చక్కబెట్టేస్తున్నారు. దీంతో అధికారులు వాహనాలను నిలపాలంటే వెనుకాడే పరిస్థితి ఏర్పడింది. తాడిపత్రి, పెద్దపప్పూరు ప్రాంతంలో పెన్నానది నుంచి భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి అనుచరులే అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది. అక్రమాలను నివారించాల్సిన పోలీసులు మామూళ్ల మత్తులో పడి మిన్నకుండిపోతున్నారు. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించే పోలీసులు ఇదొక ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
మచ్చుకు కొన్ని పరిశీలిస్తే.. : శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఉల్లికల్లు నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇక్కడ ఒక మంత్రికి సన్నిహితంగా ఉన్న వారే వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. తాడిమర్రి ప్రాంతంలో ఉన్న వాగు నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గనుల శాఖ అధికారుల అంచనా ప్రకారం రోజుకు 3000 ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.
ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.3,500 నుంచి రూ.4,500 వంతున విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.కోటికిపైగా ఇసుక వ్యాపారం జరుగుతోంది. గతంలో గనుల శాఖ పరిధిలో ఇసుక పర్యవేక్షణ ఉన్న సమయంలో ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.40 వంతున రాయల్టీ చెల్లించాల్సి ఉంది. జిల్లాలో రోజుకు 25 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడుతున్నారు. దీన్ని బట్టిచూస్తే రోజుకు రూ.లక్షకు పైగా రాయల్టీకి గండికొడుతున్నారు. అంటే ఏడాదికి రూ.4 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్లే. ఇసుక విక్రయాలు చట్టబద్ధంగా ఉంటే వాణిజ్య పన్నుల శాఖకు 4 శాతం పన్ను వసూలు కావాల్సి ఉంది.
టాస్క్‌ఫోర్‌స మీనమేషాలు : ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించాల్సి ఉంది. ఇది ఎప్పుడో చేయాల్సి ఉండగా.. ఇసుక అక్రమాల నిరోధానికి జిల్లాలో టాస్స్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఒక టాస్క్‌ఫోర్స్ బృందంలో నలుగురు సభ్యులు ఉంటారు. ఒక డిప్యూటీ తహశీల్దారు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు ఏఈలు(గృహ నిర్మాణం, ఆర్‌డబ్ల్యూఎస్), సభ్యులుగా ఉంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పటికే సగం రీచ్‌లు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు మేల్కొన్న అధికారులు వారం రోజుల క్రితం టాస్స్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కమిటీ చైర్మన్‌గా, డ్వామా పీడీ సంజయ్ ప్రభాకర్‌ను కన్వీనర్‌గా, డీపీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, మైన్స్ ఈడీని సభ్యులుగా నియమించారు.
ఇసుక మాఫియా ఇష్టారాజ్యం
Published Sun, Jan 12 2014 2:35 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement