లేపాక్షి పోలీసు స్టేషన్ లో ఉంచిన ఇసుక ట్రాక్టర్
లేపాక్షి / హిందూపురం: సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడ సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కొనలేని పరిస్థితులున్నా.. అధికార పార్టీ నేతలు మాత్రం ట్రాక్టర్ల కొద్దీ ఇసుకను అక్రమ రవాణా చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.
పోలీసులు వారానికో ట్రాక్టర్ పట్టుకుని అపరాధ రుసుము విధించడం మినహా మరెలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. నియోజకవర్గంలోని వాగులు, వంకలు, చెరువులు, నది పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. టీడీపీకి చెందిన లేపాక్షి మండల జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఆయనకు చెందిన ఇసుక ట్రాక్టర్లను రెండు నెలల వ్యవధిలోనే ఐదు సార్లు పోలీసులు పట్టుకున్నారు. గతంలో నాలుగుసార్లు అపరాధ రుసుము విధించి ట్రాక్టర్లను వదిలేశారు.
తాజాగా గురువారం లేపాక్షి మండలంలోని కల్లూరు చెరువు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీసుస్టేషన్‌లో ఉంచామని, కేసు నమోదు చేసి తహశీల్దార్‌కు అప్పగిస్తామని ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు. ఇదిలావుండగా.. ట్రాక్టర్‌ను వదలకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని సదురు జెడ్పీటీసీ సభ్యుడు రెవెన్యూ, పోలీసు అధికారులను హెచ్చరించారు. ఈ నెల ఏడున ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గానికి వస్తారని, అప్పుడు మీ కథ తేలుస్తానంటూ బెదిరించడంతో అధికారులు కూడా భయపడుతున్నారు.