ఫ్లిప్‌కార్ట్‌లో కెమెరా ఆర్డర్ చేస్తే...
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? బిజీ లైఫ్ లో షాపింగ్ చేసే ఓపిక లేకో...లేక బిజీబిజీ షెడ్యూల్ ..సమయం లేదనో ఆన్లైన్ షాపింగ్‌ను ఎంచుకుంటున్నారా? అయితే మీకో హెచ్చరిక. ఎందుకంటే ఆన్లైన్ లో విలువైన వస్తువులను ఆర్డర్ చేస్తే .. రాళ్లు, రప్పలు మనల్ని వెక్కిరించడం ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతోంది. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్న వినియోగదారులకు వస్తువులకు బదులు రాళ్లు, ఇటుకలు రావడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఇలాంటి ఆన్లైన్ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ లో కెమెరాను ఆర్డర్ చేసిన వ్యక్తికి పార్సిల్లో రాయి, పిల్లలు ఆడుకునే రెండు బొమ్మ కెమెరాలు రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. నాగోల్ మమతా నగర్‌కాలనీకి చెందిన వినయ్(24) డీఎస్ఎల్ ఆర్ కెమెరా కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశారు. రూ.41 వేల విలువైన కెనాన్ ఈవోఎస్ 700డి కెమెరాను ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. తీరా సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్ విప్పి చూస్తే అందులో రాయి, డమ్మి కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది, డెలివరీ బాయ్ ఎవరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని ఎల్బీ నగర్ ఎస్ఐ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఫ్లిప్‌కార్ట్ తిరస్కరించింది. కస్టమర్ కేర్ ద్వారా సంప్రదించినపుడు అత్యంత భద్రత మధ్య తమ ప్యాకింగ్ ఉంటుందనీ, డెలివరీకంపెనీ మోసం చేసి ఉంటుందని, దీనికి తమ బాధ్యత ఏమీ లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆన్లైన్ మోసాలు ఎంతలా జరుగుతున్నాయనేదానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం.. సో..ఇకపై ఆన్లైన్ షాపింగ్ చేసేటపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే.