ఏప్రిల్‌లో షి‘కారు’..!
⇒ పుంజుకున్న వాహన విక్రయాలు
⇒ గ్రామీణ మార్కెట్లో డిమాండ్ తగ్గింది...
⇒ టాప్‌గేర్‌లో మారుతీ, హ్యుందాయ్, హోండా కార్స్
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం వాహన రంగానికి శుభారంభం పలికింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కంపెనీల ఏప్రిల్ నెల అమ్మకాలు జోరుగా పెరిగాయి. కొత్త మోడళ్ల కారణంగా విక్రయాల స్పీడ్ పెరిగిందని పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీల ప్రమోషన్ స్కీమ్‌లు, డీలర్ల డిస్కౌంట్లు.
పెళ్లిళ్ల సీజన్, పట్టణ మార్కెట్లో నిలకడగా ఉన్న డిమాండ్ కారణంగా అమ్మకాలు పెరిగాయి. గ్రామీణ మార్కెట్లో డిమాండ్ ఊపందుకోకపోయినా, వడ్డీరేట్లు దిగిరాకపోయినా ఏప్రిల్‌లో కొన్ని కంపెనీల అమ్మకాలు జోరందుకోవడం విశేషం. మహీంద్రా అండ్ మహీంద్రా వాహన అమ్మకాలు 1 శాతమే పెరగ్గా, జనరల్ మోటార్స్ విక్రయాలు మాత్రం తగ్గాయి. టూ వీలర్ దిగ్గజం హీరో మోటో కార్ప్ విక్రయాలు 7 శాతం తగ్గాయి. గ్రామీణ మార్కెట్లో డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. మొత్తం మీద గత నెలలో ప్రయాణికుల కార్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి. గత ఏప్రిల్‌లో ఈ కార్ల అమ్మకాల వృద్ధి 7 శాతంగానే ఉంది.
భవిష్యత్తు ఆశావహమే...
ఈ ఆర్థిక సంవత్సరం ఆశావహంగా ఉండగలదన్న అంచనాలను మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాలకు ఊపునిచ్చేలా ప్రభుత్వం సంస్కరణలను, విధానాలను తీసుకొస్తుండడమే దీనికి కారణమని వివరించారు. సెంటిమెంట్స్ సానుకూలంగా ఉన్నాయని, త్వరలో కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నామని, ఫలితంగా తమ అమ్మకాలు మరింత మెరుగుపడగలవని పేర్కొన్నారు. అంచనా వేసిన స్థాయిలకు వినియోగదారుల సెంటిమెంట్ పెరగలేదని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు.
గ్రామీణ మార్కెట్లో కూడా సమస్యలున్నాయని అందుకే తమ అమ్మకాలు కుదేలయ్యాయని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం డిమాండ్‌పై ప్రభావం చూపనున్నదని ఆయన పేర్కొన్నారు. వడ్డీరేట్లు దిగివస్తాయని, ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు దశలవారీగా అమల్లోకి వస్తాయని, ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటాయని, అమ్మకాలు పుంజుకోవచ్చని వివరించారు. అకాల వర్షాలు, పంట దిగుబడులు ఆశించినంతగా లేకపోవడం, గ్రామీణ వేతనాల్లో మందగమనం వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గి అమ్మకాలు కుదేలయ్యాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఇటియోస్ సిరీస్ కార్ల జోరు కారణంగా టయోటా అమ్మకాలు 63 శాతం పెరిగాయి.