సీపీఎం నేతలకు యావజ్జీవం
కోజికోడ్: సంచలనం సృష్టించిన టి.పి.చంద్రశేఖరన్ హత్య కేసులో కేరళ సీపీఎంకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు సహా 11 మందికి ప్రత్యేక కోర్టు మంగళవారం యావజ్జీవ జైలు శిక్ష విధించింది. మరో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష వేసింది. కోజికోడ్ జిల్లా ఓంచియామ్ గ్రామంలో సీపీఎం పెత్తనాన్ని నిరసిస్తూ రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ నెలకొల్పిన చంద్రశేఖరన్(51).. 2012 మే 4న దారుణ హత్యకు గురయ్యారు.
ఏడుగురు ఆయన ను 51 సార్లు కత్తిపోట్లు పొడిచినట్లు దర్యాప్తులో తేలింది. సీపీఎంకు చాలా కాలం సేవలందించిన నేతను సొంత పార్టీ నేతలే చంపించడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పినరయి విజయన్, అచ్యుతానందన్ వర్గాల మధ్య వివాదమే రేపింది. ‘ రాజకీయ శత్రుత్వంతో చంద్రశేఖరన్పై హత్యకు పురికొల్పిన వారి చేతిలో నిందితులు పనిముట్లయ్యారు’ అని జడ్జి పేర్కొన్నారు. శిక్ష పడిన సీపీఎం నేతల్లో కున్హనందన్(పానూర్ కమిటీ), కె.సి.రామచంద్రన్(స్థానిక కమిటీ నేత), మనోజ్(శాఖ కార్యదర్శి) ఉన్నారు.