విమర్శలా?
► అర్థం చేసుకోవాలి
► వైగో గారడీ
► ఇయక్కంలో చీలిక తథ్యమా
►వామపక్షాల ఐక్యతకు
► టి పాండియన్ పిలుపు
సాక్షి, చెన్నై: మక్కల్ ఇయక్కంలో అంతర్గత సమరం రచ్చకెక్కుతోంది. ఆ ఇయక్కంకు కన్వీనర్‌గా ఉన్న వైగోకు వ్యతిరేకత ఏర్పడుతోంది. విజయకాంత్‌ను వైగో విమర్శిస్తే, వామపక్షాలు మద్దతుగా నిలవడం చర్చకు దారి తీశాయి. ఈ సమయంలో తానెప్పుడు విజయకాంత్‌ను విమర్శించానన్నట్టుగా వైగో పెదవి విప్పడం గమనించాల్సిందే..
ఎండీఎంకే నేత వైగో కన్వీనర్‌గా వీసీకీ, సీపీఎం, సీపీఐలతో మక్కల్ ఇయక్కంలో కొద్ది రోజులుగా సాగుతున్న వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా ఆ ఇయక్కంకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న వైగో తీరును పరోక్షంగా మిత్రులే విమర్శించే పనిలో పడ్డారు. వైగోకు కన్వీనర్ పదవి అవసరమా..? అని సీపీఎం సీనియర్ నేత రంగరాజన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో వైగో నోరు జారడం చర్చకు దారి తీసింది. ఆ ప్రశ్నకు సమాధానానికి దాట వేత ధోరణి అన్నట్టుగా తన గురి డీఎండీకే అధినేత విజయకాంత్మీద మరల్చారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని వైగో చేసిన వ్యాఖ్యలకు విజయకాంత్ సతీమణి ప్రేమలత తీవ్రంగానే స్పందించడమే కాకుండా, ఎదురుదాడికి దిగారు.
ఈ సమయంలో సీపీఎం, సీపీఐ నేతలు విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదన్నట్టు స్పందించడం చూస్తే, ఇయక్కంలో అంతర్గత సమరం తారా స్థాయికి చేరిందన్నది స్పష్టం అవుతోంది. వీసీకే నేత తిరుమావళవన్ పైపైకి ఇయక్కంలో అందరం కలిసే ఉన్నామని చెబుతున్నా, లోలోపల ఆయన కూడా మదన పడుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వైగో తీరుతో మున్ముందు మరింత ఇరకాటంలో పడడం కన్నా, ఇయక్కం అన్నది లేకుండా చేస్తే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే విధంగా సీపీఐ మాజీ రాష్ట్రకార్యదర్శి టి.పాండియన్ స్పందిస్తూ బలపడాలంటే, ముందుగా వామపక్షాలు ఏకమై, ముందుకు సాగాలని పిలుపునివ్వడం గమనించాల్సిన విషయం.
అదే సమయంలో విజయకాంత్‌ను పరోక్షంగా ఆయన కూడా వెనకేసుకు రావడంతో వైగో మేల్కొన్నట్టున్నారు. తానెప్పుడు విజయకాంత్‌ను విమర్శించానని మాటల గారడి ప్రదర్శించడం గమనార్హం. కళింగపట్నంలో సోమవారం మీడియాతో మాట్లాడిన వైగో, ప్రేమలత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్టుందని సూచించారు. తాను విజయకాంత్‌ను విమర్శించనేలేదని, రెండున్నర గంటల ఇంటర్వ్యూలను పూర్తిగా చూసి అర్థం చేసుకోవాలేగానీ, సహోదరి తప్పుగా భావించడం శోచనీయమని వ్యాఖ్యానించారు.