టీపీయూఎస్ దీక్షను జయప్రదం చేయ్యండి
- రాష్ట్రకార్యదర్శి లక్ష్మినారాయణ్
హిమాయత్‌నగర్(హైదరాబాద్‌సిటీ)
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టిపియూఎస్) ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ఛలో హైదరాబాద్, సామూహిక నిరాహార దీక్షను ఉపాధ్యాయులంతా ఏకమై జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జె.లక్ష్మినారాయణ్ పిలుపునిచ్చారు.
మంగళవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10గంటలకు ఈ ఆందోళనను నిర్వహిస్తున్నామన్నారు. సీపీఎస్ విధానం రద్దు పరచి పాత పెన్షన్ విధానంను వర్తింపచేయాలన్నారు. ఉపాధ్యాయుల నుంచి కొంత ప్రీమియం తీసుకుని, ప్రభుత్వ ఆరోగ్యకార్డులతో అన్ని ఆసుపత్రులలో వైద్యచికిత్సలు, ఓపి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. 10వ, పీఆర్సీ బకాయిలను వెంటనే నగదు రూపంలో చెల్లించాలని, అన్ని పాఠశాలలకు స్వీపర్, అటెండర్ పోస్టులను మంజూరు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు జయప్రదం చేయాలని విజ్ఞిప్తి చేశారు.