నిధులు గోల్మాల్ !
భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో(టీపీఎంయూ పరిధిలో)ని 19 మండలాల గిరిజన మహిళల అభివృద్ధి కోసం భద్రాచలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇందిరాక్రాంతి పథం పాలన గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంతో సంబంధం లేకుండా ట్రైబల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(టీపీఎంయూ)పరిధిలోకి వచ్చే ఏజెన్సీ మండలాల్లో మహిళా సమాఖ్యలకు తోడ్పాటునందించేందుకు ఏపీడీ స్థాయి హోదా గల అధికారిని నియమించినప్పటికీ లక్ష్యం నెరవేరటం లేదు. సమాఖ్యల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు దుబారా అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షణాధికారులే కమీషన్లకు కక్కుర్తి పడుతుండటంతో కింది స్థాయి సిబ్బంది సమాఖ్యల నిధులను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు తప్పు డు నివేదికలు ఇస్తూ కాగితాల్లో ప్రగతి చూపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. మహిళా సమాఖ్యల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే పావలా వడ్డీ రుణాలను కూడా సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమాయక గి రిజన మహిళలకు మాయమాటలు చెప్పి వారి తోనే తీర్మానాలు చేయించి డబ్బు డ్రా చేసుకుంటున్నారని, ఆ మొత్తంతో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని ‘న్యూస్‌లైన్’ పరిశీలన లో తెలిసింది.
నిబంధనలు పట్టవా..?
అత్యంత నిరుపేదలను గుర్తించేందుకు చేపట్టాల్సిన సర్వేకు అవసరమైన పుస్తకాల ముద్రణలో నిధులు కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణ ఉంది. 19 మండలాల్లో సుమారు లక్ష కుటుంబాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని ఐకేపీ అధికారులు భావించారు. అయితే పుస్తకాల ముద్రణ విషయంలో నిబంధనలు కాలరాశారు. వాస్తవంగా ఈ పనులకు టెండర్లు పిలిచి, ఉన్నతాధికారుల సమక్షంలో తెరవాలి. తక్కువ కోట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ వారికి పనులు అప్పగించాలి. మైదాన ప్రాంత మండలాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (డీపీఎంయూ) అధికారులు ఈ పద్ధతినే జేసీ సమక్షంలో పారదర్శకంగా పనులు చేపట్టారు.
కానీ భద్రాచలం ఐకేపీ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని, తమకు అనుకూలంగా ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్ యజమాని నుంచి ఒకే కొటేషన్ తీసుకొని పనులు అప్పగించారని, దీనికి కనీసం ప్రొక్యూర్మెంట్ కమిటీ అనుమతులు కూడా తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ఖమ్మంలో ఒక పేజీ ముద్రణకు రూ. 0.80 పైసల చొప్పున అప్పగించగా, ఇక్కడి అధికారులు మాత్రం రూ.1.13 పైసలకు కట్టబెట్టారు. గత ఏడాది ఇదే సర్వే పుస్తకాల కోసం ఒక పేజీకి రూ 0.47 పైసలే అప్పటి అధికారులు వెచ్చించడం గమనార్హం. ప్రస్తుతం ముద్రణ కోసం రూ.6.75 లక్షల ఖర్చు చూపిస్తూ బిల్లుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించేందుకు సిద ్ధమైనట్లు సమాచారం. దీంతో ఐకేపీపై రూ.2 లక్షల వరకు అదనపు భారం పడుతున్నట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని సదరు ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఇక్కడి పర్యవేక్షణాధికారికి కమీషన్ రూపంలో ముట్టజెప్పేందుకు ఒప్పం దం కుదుర్చుకున్నారని ఆరోపణలున్నాయి.
సమాఖ్యల డబ్బు సొంతానికి...
మహిళా సమాఖ్య(వీవో)ల ఖాతాల్లో ఉన్న డబ్బును కొంతమంది ఐకేపీ సిబ్బంది సొంతానికి వాడుకుంటున్నారు. వాటితో వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీఆర్‌పురం మండలం కొటారుగొమ్ము గ్రామ సమాఖ్య నుంచి ఈ ఏడాది మార్చి 11న రూ.50 వేలు మండల సమాఖ్య వారు అప్పుగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని కొటారుగొమ్ము వీవో వారు తీర్మానం పుస్తకంలో పొందుపరిచారు. కానీ ఈ డబ్బును వారి వద్ద నుంచి అప్పుగా తీసుకున్నట్లు మండల సమాఖ్య తీర్మానంలో కనిపించకపోవటం గమనార్హం. వీవో నుంచి ఎంఎంఎస్కు డబ్బులు అప్పు ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ అది బ్యాంకు ఖాతా నుంచి ఖాతాకే సర్దుబాటు చేయాలి తప్ప నగదు రూపంలో ఇచ్చే వీలు లేదు.
కానీ ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కటంతో అక్కడి సిబ్బంది తీసుకున్న డబ్బును ఆగస్టు 23న తిరిగి ఇచ్చేశారు. ఈ డబ్బును కొటారుగొమ్ము వీవో వారు తమ ఖాతాలో నగదు రూపంలోనే వేసుకున్నారు. ఒక వేళ ఎంఎంఎస్ డబ్బులు అప్పుగా తీసుకుంటే ఇచ్చేటప్పుడైనా తీర్మానం మేరకు ఖాతానుంచి వీవో ఖాతాకు మాత్రమే జమచేయాలి. ఇక్కడ అలా జరుగకపోవటంతో సమాఖ్యల డబ్బులు సిబ్బంది వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోందని పలువురు అంటున్నారు. ఇదే రీతిన చింతూరు మండలం తులసిపాక గ్రామైక్య సంఘంలోనూ చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ రూ.1.20 లక్షలు తీర్మానం లేకుండానే చిన్న సంఘాలకు అప్పుల పేరుతో బ్యాంకు నుంచి డ్రా చేసిన సిబ్బంది.. వాటితో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీడీ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో సమాఖ్యల ఆర్థిక లావాదేవీలపై పర్యవేక్షించకపోవడం వల్లే ఇలాటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం ఐకేపీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని గిరిజన సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.