T.R. kannan
-
‘క్విడ్ ప్రో కో’ లేనే లేదు
పీఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ ఎదుట ‘జగతి’ వాదనలు కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనాలూ పొందలేదు ఆ ముగ్గురూ ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలు చూపాలని ఈడీకి అథారిటీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల వెనుక ‘క్విడ్ ప్రో కో’ అనేది ఎక్కడా లేదని, వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలూ పొందలేదని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవిగుప్తా చెప్పారు. ఈ ముగ్గురూ అత్యంత సహజమైన వ్యాపార దృష్టితో లాభాలనాశించి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెడితే ఆ కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసును ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ (అడ్జుడికేటింగ్ అథారిటీ) శుక్రవారం విచారించింది. అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముకేశ్‌కుమార్ ఎదుట రవిగుప్తా దాదాపు మూడుగంటల పాటు వాదనలు వినిపించారు. ఆగస్టు 27న విచారణ సందర్భంగా అసంపూర్ణంగా ముగించిన వాదనను కొనసాగిస్తూ.. ఆ వ్యాపారవేత్తలు పెట్టిన పెట్టుబడులతో ప్రభుత్వానికి నష్టమే లేనప్పుడు అసలు ఇది పీఎంఎల్ఏ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నష్టం జరిగిందంటున్న ఈడీ అదెలా జరిగిందో వివరాలు మాత్రం చెప్పడం లేదని అథారిటీ దృష్టికి తీసుకువచ్చారు. జగతిలోకి వచ్చిన పెట్టుబడులు ముడుపులు అవునో కాదో ఈడీ ఆధారసహితంగా చూపకుండా, క్విడ్ ప్రో కోని నిరూపించకుండా ఇష్టానుసారం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు దిగడం అసమంజసమని అన్నారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి వాటికి తగ్గ షేర్లు పొందారు. వారు నష్టపోయిందే లేనప్పుడు ఇందులో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘పెట్టుబడులను పెట్టినవారిని సంస్థ మోసం చేస్తే అది తప్పవుతుంది కానీ అసలు పెట్టుబడుల్ని తీసుకోవడాన్నే నేరంగా పేర్కొనడం విడ్డూరం..’ అని అన్నారు. నిజానికి ఈ కేసులో ఇన్వెస్టర్లను మోసం చేయడమన్నదే జరగలేదంటూ, అలా చేసినట్టుగా వారెవరూ ఫిర్యాదు చేయని సంగతినీ ఆయన అథారిటీ దృష్టికి తీసుకొచ్చారు. కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి తొలుత ఈ కేసులో నిందితులుగా ఉన్నారని, తర్వాత వారు ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులుగా మారి స్టేట్మెంట్లు ఇచ్చారని రవిగుప్తా తెలిపారు. ఈ కేసు వ్యవహారాలు తలాతోకా లేకుండా నడుస్తున్నాయనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. సొమ్ముకు తగిన షేర్లు పొందారు... ‘‘కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి... ఈ ముగ్గురూ మోసపోయారా అంటే లేనే లేదు. పెట్టిన సొమ్ముకు తగ్గ షేర్లను పొందారు. తమ వ్యాపారాలను భిన్నరంగాల్లోకి విస్తరించుకునే ఉద్దేశంతో వారు స్వీయ నిర్ణయం మేరకే పెట్టుబడులు పెట్టారు. ‘జగతి’లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ముగ్గురికీ చేసిన వాగ్దానాలను అనంతర కాలంలో నెరవేర్చలేదని చెబుతున్నారు. అలాగైతే అది వారికి, సంస్థకు మధ్య వ్యవహారం. దీంట్లో పీఎంఎల్ఏకి సంబంధం ఏమిటి? వారు పెట్టుబడులు పెట్టింది ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగానేనని ఈడీ ఆరోపిస్తోంది. దీనికేమో ఆధారాలు చూపడం లేదు. ఎలా చూసినా ఇది క్విడ్‌ప్రో కో కేసు కానీ, సర్కార్‌కు నష్టం జరిగిన కేసు కానీ కానే కాదు..’’ అని రవిగుప్తా వాదించారు. ఈ వాదనలు ఆలకించిన అథారిటీ... ఈ ముగ్గురు ఇన్వెస్టర్లు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలను చూపాల్సిందిగా ఈడీని ఆదేశించింది. సీబీఐ పెట్టిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తును సాగించి అటాచ్మెంట్లకు దిగినందున ఆధారాల విషయంలో సీబీఐని సంప్రదించాలని సూచించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజు సదరు ఆధారాల వివరాలను తమ ముందుంచాలని ఈడీ తరఫు న్యాయవాది విపుల్కుమార్కు స్పష్టం చేసింది. -
ప్రభుత్వానికి నష్టమెలా: జగతి న్యాయవాదులు
తమ సంస్థలో పెట్టుబడులపై పీఎంఎల్ఏ అథారిటీ ముందు ‘జగతి’ వాదనలు అసలు ఇది మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుంది? ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులకు దక్కిన ప్రయోజనాలేంటి? వారేమైనా నష్టపోయినట్లు ఫిర్యాదు చేశారా? అవేవీ లేనపుడు ‘జగతి’ డిపాజిట్లు ఎలా అటాచ్ చేస్తారు? తదుపరి విచారణ వచ్చేనెల 27కు వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి మున్ముందు లాభాలొస్తాయనే ఉద్దేశంతోనే జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని, ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది అందుకు ప్రతిగా జగతిలోకి నిధులు తరలించారనడం పూర్తిగా అవాస్తవమని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవి గుప్తా స్పష్టంచేశారు. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసుపై ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ చైర్మన్ కె.రామమూర్తి ఎదుట మంగళవారం ఆయన ఈ మేరకు వాదనలు వినిపించారు. ఆ ఇన్వెస్టర్లూ ఎలాంటి ప్రభుత్వ ప్రాజెక్టులూ చేపట్టలేదని, ఈడీ మాత్రం వారు జగతిలో పెట్టిన పెట్టుబడులతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటోందని, ఆ నష్టం వివరాలు మాత్రం చెప్పటం లేదని తెలియజేశారు. ‘‘ఒక సంస్థలో ఎవరైనా లాభాలు వస్తాయన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెడితే దాంతో ప్రభుత్వ ఖజానాకు నష్టమెలా వస్తుంది? పైగా మోసం చేశారని అనడమేంటి? అసలు ఇది మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుంది?’’ అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే శంకర్రావు ఒక లేఖ రాస్తే దాన్నే పిటిషన్‌గా పరిగణించారని, హైకోర్టు అమికస్ క్యూరీని నియమించినా ఆయన పిటిషనర్ కోసమేనని చెప్పారు. ‘‘అమికస్ క్యూరీ స్వతంత్రంగా నివేదిక ఇచ్చినట్లు ఈడీ చెబుతోంది. కానీ ఆయన్ను పిటిషనర్ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కోర్టు నియమించింది. పిటిషనర్ ప్రతినిధిగా మారినపుడు అమికస్ క్యూరీ స్వతంత్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఎలా సాధ్యం? ఆ నివేదిక నిష్పాక్షికమైనదని ఎలా చెబుతారు’’ అని ఆయన అన్నారు. హైకోర్టు చెప్పిందొకటి.. ఎఫ్ఐఆర్ ఒకటి.. చార్జిషీట్ మరొకటి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో ఉన్నది ఒకటైతే ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు వేరని, ఇక చార్జిషీట్లో పొందుపరిచిన అంశాలకు అసలు సంబంధమే లేదని రవి గుప్తా వివరించారు. ఈడీ వాదన పొంతన లేకుండా ఉందని చెప్పారు. పెట్టుబడి పెట్టిన ముగ్గురూ.. తర్వాత ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులుగా మారారని, వారి స్టేట్మెంట్లను ఈడీ రికార్డు చేసిందని, ప్రభుత్వం నుంచి దక్కిన లబ్ధికి ప్రతిఫలంగానే పెట్టుబడులు పెట్టామని వారెక్కడా చెప్పలేదని వివరించారు. డెలాయిట్ నివేదికపై ఈడీ ఆరోపణలను ఆయన ఖండించారు. ‘‘ఆ నివేదిక సాయంతో ఇన్వెస్టర్లను మోసం చేస్తే అది వారికి, కంపెనీకి మధ్య చీటింగ్ కేసు. అది కూడా కంపెనీల చట్టం కింద. అంతేతప్ప ఇందులో ప్రభుత్వాన్ని మోసం చేయడమనేది ఎక్కడుంది? దీనిపై పీఎంఎల్ఏ కేసు ఎలా పెడతారు?’’ అని ప్రశ్నించారు. జగతి షేర్లను రూ.350 చొప్పున విక్రయించ డం అక్రమం అనడాన్ని ప్రస్తావిస్తూ... ‘ఈనాడు’ని ప్రచురించే ఉషోదయా ఎంటర్ప్రైజెస్ సంస్థ తమ షేర్లను రూ.5.28 లక్షల ప్రీమియంతో విక్రయించిందని, ఆది నుంచీ నష్టాల్లోనే ఉంటూ 30 ఏళ్లుగా అదే ఒరవడిని సాగించిన సంస్థ ఇంత భారీ ధరకు షేర్లను విక్రయించగా లేనిది అత్యధిక సర్క్యులేషన్‌తో మార్కెట్లోకి ప్రవేశించిన జగతి తన షేర్లను రూ.350ధరకు విక్రయించడం తప్పెలా అవుతుందని రవి గుప్తా ప్రశ్నించారు. కణ్ణన్ ఎలా నష్టపోయారు?: ‘‘జయలక్ష్మి టెక్స్టైల్స్ డెరైక్టర్ కణ్ణన్ ఆంధ్రప్రదేశ్‌లో జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీని స్థాపించారు. దీనికి సంబంధించి ఏ ఒక్కటి కూడా వైఎస్సార్ హయాంలో జరగలేదు. ఆయన జగతిలో పెట్టిన రూ.5 కోట్ల పెట్టుబడులకు షేర్లు పొందారు. ఇక్కడ ప్రభుత్వానికొచ్చిన నష్టమేంటి? కణ్ణన్ ఎలా నష్టపోయారు? ఎన్నారై వ్యాపారవేత్త మాధవ్ రామచంద్ర రూ.19.65 కోట్లను జగతిలో పెట్టారు? ఇందులో పీఎంఎల్ఏ కేసుకు ఆస్కారమెక్కడ? ఎ.కె.దండమూడి రూ.10 కోట్లు పెట్టి ఈక్విటీ షేర్లను పొందారు. ఇక్కడా పీఎంఎల్ఏ సెక్షన్లు ఎలా వస్తాయి? తమ డబ్బును వ్యాపార లాభాల కోసం ఎక్కడైనా ఎవరైనా పెట్టుకోవచ్చుగా’’ అని రవి వాదించారు. అంతకుముందు ఈడీ తరఫు న్యాయవాది విపుల్‌కుమార్ వాది స్తూ... ఆ ముగ్గురి పెట్టుబడుల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందన్నారు. ఆ నిధు లు ముడుపులుగా తేల్చామని, అందుకే 34.65 కోట్ల జగతి ఫిక్స్డ్ డిపాజిట్లను అటాచ్ చేశామని చెప్పారు. తర్వాత రవి గుప్తా వాదనలు వినిపిస్తుండగా.. విపుల్‌కుమార్ లేచి, తాను మరో కేసుకు హాజరవ్వాల్సి ఉన్నందున మరో రోజున వాదనలు వినాలని కోరారు. ఇందుకు రామమూర్తి సమ్మతిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేశారు.