పీఎంఎల్‌ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ ఎదుట ‘జగతి’ వాదనలు
కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి
ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనాలూ పొందలేదు
ఆ ముగ్గురూ ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలు చూపాలని ఈడీకి అథారిటీ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల వెనుక ‘క్విడ్ ప్రో కో’ అనేది ఎక్కడా లేదని, వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలూ పొందలేదని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవిగుప్తా చెప్పారు. ఈ ముగ్గురూ అత్యంత సహజమైన వ్యాపార దృష్టితో లాభాలనాశించి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెడితే ఆ కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీలు) అటాచ్‌మెంట్ కేసును ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ న్యాయ ప్రాధికార సంస్థ (అడ్జుడికేటింగ్ అథారిటీ) శుక్రవారం విచారించింది.
అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముకేశ్‌కుమార్ ఎదుట రవిగుప్తా దాదాపు మూడుగంటల పాటు వాదనలు వినిపించారు. ఆగస్టు 27న విచారణ సందర్భంగా అసంపూర్ణంగా ముగించిన వాదనను కొనసాగిస్తూ.. ఆ వ్యాపారవేత్తలు పెట్టిన పెట్టుబడులతో ప్రభుత్వానికి నష్టమే లేనప్పుడు అసలు ఇది పీఎంఎల్‌ఏ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నష్టం జరిగిందంటున్న ఈడీ అదెలా జరిగిందో వివరాలు మాత్రం చెప్పడం లేదని అథారిటీ దృష్టికి తీసుకువచ్చారు. జగతిలోకి వచ్చిన పెట్టుబడులు ముడుపులు అవునో కాదో ఈడీ ఆధారసహితంగా చూపకుండా, క్విడ్ ప్రో కోని నిరూపించకుండా ఇష్టానుసారం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు దిగడం అసమంజసమని అన్నారు.
జగతిలో పెట్టుబడులు పెట్టిన కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి వాటికి తగ్గ షేర్లు పొందారు. వారు నష్టపోయిందే లేనప్పుడు ఇందులో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘పెట్టుబడులను పెట్టినవారిని సంస్థ మోసం చేస్తే అది తప్పవుతుంది కానీ అసలు పెట్టుబడుల్ని తీసుకోవడాన్నే నేరంగా పేర్కొనడం విడ్డూరం..’ అని అన్నారు. నిజానికి ఈ కేసులో ఇన్వెస్టర్లను మోసం చేయడమన్నదే జరగలేదంటూ, అలా చేసినట్టుగా వారెవరూ ఫిర్యాదు చేయని సంగతినీ ఆయన అథారిటీ దృష్టికి తీసుకొచ్చారు. కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి తొలుత ఈ కేసులో నిందితులుగా ఉన్నారని, తర్వాత వారు ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులుగా మారి స్టేట్‌మెంట్లు ఇచ్చారని రవిగుప్తా తెలిపారు. ఈ కేసు వ్యవహారాలు తలాతోకా లేకుండా నడుస్తున్నాయనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు.
సొమ్ముకు తగిన షేర్లు పొందారు...
‘‘కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి... ఈ ముగ్గురూ మోసపోయారా అంటే లేనే లేదు. పెట్టిన సొమ్ముకు తగ్గ షేర్లను పొందారు. తమ వ్యాపారాలను భిన్నరంగాల్లోకి విస్తరించుకునే ఉద్దేశంతో వారు స్వీయ నిర్ణయం మేరకే పెట్టుబడులు పెట్టారు. ‘జగతి’లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ముగ్గురికీ చేసిన వాగ్దానాలను అనంతర కాలంలో నెరవేర్చలేదని చెబుతున్నారు. అలాగైతే అది వారికి, సంస్థకు మధ్య వ్యవహారం. దీంట్లో పీఎంఎల్‌ఏకి సంబంధం ఏమిటి? వారు పెట్టుబడులు పెట్టింది ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగానేనని ఈడీ ఆరోపిస్తోంది. దీనికేమో ఆధారాలు చూపడం లేదు. ఎలా చూసినా ఇది క్విడ్‌ప్రో కో కేసు కానీ, సర్కార్‌కు నష్టం జరిగిన కేసు కానీ కానే కాదు..’’ అని రవిగుప్తా వాదించారు.
ఈ వాదనలు ఆలకించిన అథారిటీ... ఈ ముగ్గురు ఇన్వెస్టర్లు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలను చూపాల్సిందిగా ఈడీని ఆదేశించింది. సీబీఐ పెట్టిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తును సాగించి అటాచ్‌మెంట్లకు దిగినందున ఆధారాల విషయంలో సీబీఐని సంప్రదించాలని సూచించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజు సదరు ఆధారాల వివరాలను తమ ముందుంచాలని ఈడీ తరఫు న్యాయవాది విపుల్‌కుమార్‌కు స్పష్టం చేసింది.
‘క్విడ్ ప్రో కో’ లేనే లేదు
Published Sat, Sep 28 2013 2:09 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement