పట్టాలు లేని రైలు.. ఎలా వెళ్తుందో తెలుసా?
రైలంటే... రెండు పట్టాలుండాలి... బోలెడన్ని బోగీలుండాలి.. అక్కడక్కడ మూడు రంగుల్లో సిగ్నళ్లు, క్రాసింగ్‌లు కనిపించాలి! కానీ ఈ ఫొటోలను కొంచెం జాగ్రత్తగా చూడండి. మిగిలినవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నా... పట్టాలు మాత్రం మాయమైపోయాయి! అలాగని దీన్ని ఓ పొడవైన బస్సు అంటే చైనీస్ రైల్ కార్పొరేషన్ వాళ్లు ఒప్పుకోరు! దీన్ని తయారు చేసింది వాళ్లే మరి. ఈ రైలు.. కంటికి కనిపించని వర్చువల్ పట్టాలపై పరుగులు పెడుతుందని అంటున్నారు వాళ్లు!
విషయం ఏమిటంటే... పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా కొత్త కొత్త రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని చైనా రకరకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వాహనాలన్నీ అడుగు నుంచి దూసుకెళ్లేలా ఓ కొత్త బస్సును డిజైన్ చేసినా, వాయు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైయిన్లను అభివృద్ధి చేసినా లక్ష్యం మాత్రం ఇదే. ఈ దిశలో జరిగిన తాజా ఆవిష్కరణ ఈ పట్టాల్లేని రైలు! చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ రైలును మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా పరిగెత్తించారు. దాదాపు వంద అడుగుల పొడవైన ఈ రైల్లో ఒక్కసారికి దాదాపు 307 మంది ప్రయాణించవచ్చు. సిటీబస్సుల కంటే కొంచెం ఖరీదైనప్పటికీ వీటిని మెట్రో రైలు ఏర్పాటుకయ్యే ఖర్చులో ఐదోవంతుతోనే కొనుక్కోవచ్చు, నడపవచ్చు అని చైనీస్ రైల్ కార్పొరేషన్ చెబుతోంది.
విద్యుత్తుతో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి కాలుష్యం బాధ తక్కువ. పది నిమిషాలపాటు ఛార్జ్ చేస్తే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పాతిక కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ప్లాస్టిక్, రబ్బర్లతో కూడిన చక్రాలు... బోలెడన్ని సెన్సర్ల సాయంతో ఇది ముందుగా నిర్దేశించిన మార్గంలో పట్టు తప్పకుండా ప్రయాణిస్తుందట. చైనీస్ రైల్ కార్పొరేషన్ ఈ పట్టాల్లేని రైలు కోసం ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది నుంచి ఇది ఝుఝూ నగరంలో పరుగులు పెట్టనుంది. ఇంకోమాట... ఒక్కో రైలు కనీసం పాతికేళ్లు మన్నికగా సేవలు అందిస్తుందని అంటున్నారు!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్