వాటర్ ట్యాంకర్లో ఎర్రచందనం
తరలింపులో ‘ఎర్ర’ దొంగల కొత్త పంథా..
దాడిచేసి పట్టుకున్న పలమనేరు పోలీసులు
రూ. 10 లక్షల విలుజేసే 12 దుంగలు, ట్రాక్టర్ సీజ్
ఒకరి అరెస్టు, మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు
పలమనేరు: అక్రమార్జనకు అలవాటు పడిన ఎర్ర దొంగలు కొత్తకొత్త పంథాలు అనుసరిస్తున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓవైపు పోలీసులు పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటే.. మరో వైపు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ అక్రమార్కులు పోలీసు కళ్లు గప్పి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. గుట్టురట్టు కాకుండా దుంగల్ని జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. తాజాగా ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్లో ఎర్ర చందనం దుంగలను అక్రమార్కులు బెంగళూరువైపునకు తరలిస్తూ పట్టుబడ్డమే నిదర్శనం. పలమనేరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం డీఎస్పీ శంకర్ విలేకరులకు వెల్లడించిన మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు వైపునుంచి పలమనేరు మీదుగా ఓ నీటి టాక్టర్ ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్థానిక సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐలు చిన్నరెడ్డెప్ప, లోకేష్ ఐడీ పార్టీతో కలసి స్థానిక సిల్క్‌ఫామ్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కాపు కాశారు.
ఏపీ 04 టీ 0420 నంబరున్న ట్రాక్టర్ వాటర్ ట్యాకర్‌ను పోలీసులను చూడగానే మరింత వేగంగా పోనిచ్చారు. దీంతో పోలీసులు వెంంబడించి పట్టుకున్నారు. బంగారుపాళ్యం మండలం గోవర్ధనగిరికి చెందిన శేఖర్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. మరో ఇద్దరు పరారయ్యారు. వారు ఉదయ్‌కుమార్, త్యాగరాజులునాయుడుగా పోలీసుల విచారణలో తేలింది. ట్రాక్టర్‌తో పాటు ట్యాంకర్‌లోని 12 దుంగలను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ నిందితున్ని కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఐడీ పార్టీ సిబ్బంది దేవ, ఎల్లప్ప, జయకృష్ణ, పయని, ప్రకాష్‌ను ఆయన అభినందించారు. పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.