’డిగ్రీ’ లోనూ సెమిస్టర్స్
- మెమోల్లోనూ క్రెడిట్స్, గ్రేడింగ్
- మార్కుల విధానానికి స్వస్తి
- వచ్చే విద్యా సంవత్సరం నుంచే .. పూర్తికావొచ్చిన సిలబస్ మార్పులు
- త్వరలో తెలుగు అకాడమీ ముద్రణకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ కోర్సుల పరీక్షల విధానం, సిలబస్‌లో సమూల మార్పులకు ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇకపై అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున మూడేళ్ల డిగ్రీ కోర్సులకు మొత్తం ఆరు సెమిస్టర్లను అమలు చేయనుంది. అలాగే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో (సీబీసీఎస్) భాగంగా అందించే క్రెడిట్ పాయింట్లు, గ్రేడింగ్ విధానాన్నే డిగ్రీ కోర్సుల్లో పాటించి మెమోల్లోనూ మార్కుల స్థానంలో వాటినే ముద్రించనుంది. ఇందుకు అనుగుణంగా ఏడాదిగా సాగిస్తున్న సిలబస్ రివిజన్ పూర్తి కావచ్చింది.
సంప్రదాయ డిగ్రీల్లోని 17 సబ్జెక్టుల్లో సిలబస్ మార్పులు పూర్తవగా ఈ నెల 31లోగా మరో రెండు సబ్జెక్టుల సిలబస్‌లలో మార్పులు పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. మార్చిన సిలబస్‌లోనే 2016-17 విద్యా సంవత్సరంలో బోధన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 31 తరువాత మారిన సిలబస్ మొత్తాన్ని తెలుగు అకాడమీకి అప్పగించి పుస్తకాల ముద్రణ పూర్తయ్యాక జూన్ నాటికి కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. సిలబస్ మార్పులపై ఇటీవల అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య...సిలబస్ మార్పులను అన్ని వర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో ఆమోదించి జూన్ నుంచి పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
మరో 50 స్పెషలైజ్డ్ సబ్జెక్టుల్లోనూ..
రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న కోర్ సబ్జెక్టులతోపాటు వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు సొంతంగా, ప్రతే ్యకంగా నిర్వహిస్తున్న బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ వంటి 50కిపైగా స్పెషలైజ్డ్ సబ్జెక్టులను అందిస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేక కోర్సులను ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకమైన కోర్సును కొనసాగిస్తోంది. కొన్ని ప్రధాన కాలేజీలూ పలు ప్రత్యేక సబ్జెక్టుల్లో యూనివర్సిటీ ఆమోదంతో డిగ్రీలను కొనసాగిస్తున్నాయి. అలాంటివన్నీ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రస్థాయిలో అమలు చేసే కోర్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులను యూనివర్సిటీల ప్రొఫెసర్లతో ఉన్నత విద్యా మండలి చేయిస్తుందని, స్పెషలైజ్డ్ సబ్జెక్టుల సిలబస్‌లో స్థానికంగా యూనివర్సిటీలు, కాలేజీల పరిధిలోనే మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మల్లేశ్ స్పష్టం చేశారు.
సిలబస్‌లో మార్పులు చేసిన సబ్జెక్టులు
హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సోషల్ వర్క్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కామర్స్ సబ్జెక్టుల్లో సిలబస్ మార్పులను ఉన్నత విద్యా మండలి గతంలో పూర్తి చేయగా ఇటీవల కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఇంగ్లిషు, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్ సిలబస్‌లలో మార్పులు చేసింది. ఈ నెల 31లోగా సైకాలజీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు పూర్తికానున్నాయి.
వివిధ సబ్జెక్టుల్లో ప్రధాన మార్పులు
తెలుగు ద్వితీయ భాష, మోడర్ ్న లాంగ్వేజ్ తెలుగు సబ్జెక్టుల్లో తెలంగాణకు చెందిన ఆధునిక కవులకు పెద్దపీట.
సివిల్స్, గ్రూపు-1 వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీలోని సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ సబ్జెక్టుల్లో మార్పులు.
కామర్స్‌లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొన్ని యూనిట్లకు చోటు.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషనలో తెలంగాణ గ్రామ పరిపాలన వ్యవస్థకు పెద్దపీట.
హిస్టరీలో దక్కన్ చరిత్రకు ప్రాధాన్యత. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, ప్రస్థానంపై ప్రముఖంగా పాఠ్యాంశాలు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వంటి సబె ్జక్టుల్లో సిలబస్ అప్‌గ్రేడ్.