ట్రాఫిక్ నేరాలపై కొరడా!
మోటారు వాహనాల బిల్లులో మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2016కు ప్రతిపాదించిన కీలక సవర ణలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అనుసంధానం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, బాధితులకు పరిహారం పెంపు తదితర ప్రతి పాదనలూ ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని, హెల్మెట్, సీటు బెల్టు వాడని వారిని కఠినంగా శిక్షించాలని ప్రతి పాదించారు. పార్లమెంటరీ సంఘం చేసిన దాదాపు అన్ని సూచనలను ప్రధాని అధ్యక్షత సమావేశమైన కేబినెట్ ఆమోదించిందని రవాణా మంత్రి నితిన్ గడ్కారీ విలేకర్లకు తెలిపారు. బిల్లు్ల వచ్చేవారం పార్లమెంటు ముందుకొస్తుందన్నారు.
ఆన్లైన్ సేవల కోసం ఆధార్ ఆధారిత తనిఖీని బిల్లులో ప్రతిపాదించారని, తద్వారా లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సునూ రవాణా కార్యాలయానికి వెళ్లకుండానే పొందొచ్చని పేర్కొన్నారు. దీనివల్ల ఒకే పేరుతో పలు లైసెన్సులు తీసుకోవడం కదురదన్నారు. వాహనాలను ఆర్టీఓ ద్వారానే రిజిస్టర్ చేయాలన్న స్థాయీ సంఘం సూచనను ప్రభుత్వం తిరస్కరిచిందని వెల్లడించారు. 1989 నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే.. ఆలిండియా ఎలక్ట్రానిక్ రిజిస్టర్ ద్వారా వాహనాల డీలర్లు నంబర్లు కేటాయించి, రిజిస్టర్ చేస్తారని వివరించారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి నాలుగు నెలల్లోగా రూ.5 లక్షల పరిహారం అందుతుందన్నారు. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పరిశీలన కోసం రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటైన స్థాయీ సంఘానికి పంపారు.
మరికొన్ని నిర్ణయాలు
యూరియా ఉత్పత్తి పెంచేందుకు జాతీయ యూరియా విధానం–2015కు చేసిన సవ రణలకు ఆమోదం. పునఃఅంచనా సామర్థ్యానికి(ఆర్ఏసీ) మించి ఉత్పత్తి చేసేందుకు తయారీదారులకు వెలుసు బాటు. ఫాస్పేట్, పోటాస్ ఎరువులకు సంబంధించి 2017–18కుగాను పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) రేట్ల నిర్ధారణ విధానానికి ఆమోదం. ఫాస్పరస్‌పై సబ్సిడీ కేజీకి రూ.11.99(గత ఏడాది కంటే రూ.1.24 తగ్గింపు), పోటాస్‌పై రూ. 12.39(గత ఏడాదికంటే రూ. 3.07 తగ్గింపు), నత్రజనిపై రూ. 18.98(గత ఏడాదికంటే రూ. 3.13 పెంపు), సల్ఫర్పై రూ. 2.24(గత ఏడాది కంటే 19పైసల పెంపు)గా నిర్ణయం.