విద్యార్థులకు ‘ట్రాఫిక్ గేమ్స్’
వీడియో గేమ్స్ రూపొందించాలనే యోచన
సాక్షి, హైదరాబాద్: బడి ఈడు నుంచే చిన్నారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు యోచిస్తున్నారు. దీనికోసం ఆ ఈడు పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపే వీడియో గేమ్స్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. విద్యాశాఖతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించిన ట్రాఫిక్ పోలీసులు వారి అంగీకారం తర్వాత గేమ్స్ రూపకల్పనకు సన్నాహాలు చేయాలని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా వీడియో గేమ్స్ ఆలోచన చేస్తున్నారు.
థియరీ కోసం పాఠ్యాంశాలు...
విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎస్సీఈఆర్టీతో కలసి సమగ్ర విధానం రూపొందించారు. ఒకటో తరగతి నుంచే ట్రాఫిక్‌ను పాఠ్యాంశంగా చేర్చడానికి అవసరమైన విధివిధానాలకు సిద్ధమయ్యారు. వేర్వేరు అంశాలతో తయారైన ట్రాఫిక్ పాఠ్యపుస్తకాలు ప్రస్తుతం రాష్ట్ర రహదారి భద్రతా విభాగం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇది అమలులోకి వస్తే ట్రాఫిక్ అన్నది ఓ పాఠ్యాంశంగా మారడమే కాకుండా పరీక్షల్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు, మార్కులు సైతం అమలులోకి వస్తాయి. ఇవి కేవలం థియరీ అని అధికారులు చెప్తున్నారు.
ప్రాక్టికల్‌గా ఉండేలా గేమ్స్
చిన్నారుల మెదళ్లలో ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా నిలిచిపోవడంతో పాటు భవిష్యత్తులో వారు ఉత్తమ రోడ్ యూజర్లుగా మారడానికి థియరీ ఒక్కటే సరిపోదని, ప్రాక్టికల్ నాలెడ్జ్ సైతం అవశ్యమని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఉండే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా వీడియో గేమ్స్ రూపొందించాలని నిర్ణయించారు. విద్యాశాఖ ప్రాథమిక అనుమతి లభించిన తర్వాత తయారీకి సన్నాహాలు చేయనున్నారు.
వీడియో గేమ్స్‌కూ ఓ పిరియడ్...
ఈ వీడియో గేమ్స్ తయారీ బాధ్యతల్ని ఏదైనా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీకి అప్పగించనున్నారు. వీటిని నామమాత్రపు ధరకే పాఠశాలలకు పంపిణీ చేయించాలని యోచిస్తున్నారు. దాదాపు ప్రతి పాఠశాలలోనూ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటున్న నేపథ్యంలో వాటితోపాటు ట్రాఫిక్ వీడియో గేమ్స్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఈ గేమ్ ఆడేందుకు వారానికి ఓ పిరియడ్ ఉండేలా పాఠశాలతో సంప్రదింపులు జరపనున్నారు.
మార్కులు కేటాయించే విధంగా...
అలాగే ఈ ట్రాఫిక్ వీడియో గేమ్స్ అన్నది నామ్‌కే వాస్తేగా మారకూడదని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం ఈ గేమ్స్‌పై పరీక్షలు సైతం నిర్వహించడంతో పాటు మార్కులు వేసేలా చర్యలు తీసుకోనున్నారు. తొలిదశలో ఆరో తరగతి వరకు, అనంతరం పదో తరగతి వరకూ అనువుగా ఉండే అంశాలతో కూడిన గేమ్స్ డిజైన్ చేయిస్తారు. భవిష్యత్తులో కాలేజీ విద్యార్థులకూ అవసరమైన, ఆసక్తి ఉండే అంశాలతో వీటిని రూపొందించాలనే ప్రతిపాదనా ఉంది.